'ఆ నలుగురు!'.. ప్రాణం నిలిపిన అంబులెన్స్ డ్రైవర్లు.. జీవం పోసిన కానిస్టేబుళ్లు! - గుండెపోటు వచ్చిన బాలిక ప్రాణాలు కాపాడిన
🎬 Watch Now: Feature Video
కేరళలోని ఇడుక్కి జిల్లాలో గుండెపోటుకు గురైన 17 ఏళ్ల బాలిక ప్రాణాలను అంబులెన్స్ డ్రైవర్లు కాపాడారు. స్థానికులు, పోలీసుల సహాయంతో రెండున్నర గంటల్లోనే 133 కి.మీ దూరంలో ఉన్న ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ బాలిక.. ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
ఇదీ జరిగింది.. జిల్లాలోని కట్టపన్న గ్రామానికి 17 ఏళ్ల అన్ మారియా గుండెపోటుకు గురైంది. ఆమెను అత్యవసర చికిత్స నిమిత్తం కొచ్చిలోని అమృత ఆస్పత్రికి తరలించాల్సి ఉంది. అది కట్టప్పన గ్రామానికి సుమారు 133 కి.మీ దూరంలో ఉంది. దీంతో రోడ్డు మార్గంలో వీలైనంత త్వరగా కొచ్చి చేరుకోవడానికి సహాయం చేయాలని కోరుతూ మంత్రి రోషి ఆగస్ట్ ఫేస్‌బుక్ పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
పోలీసులు, స్థానికుల సహాయంతో అన్ మారియాను అతి తక్కువ సమయంలోనే కొచ్చిలోని అమృత ఆస్పత్రికి తరలించారు అంబులెన్స్ డ్రైవర్లు. అంబులెన్స్ ఆస్పత్రికి చేరుకున్న తర్వాత.. సెకను కూడా వృధా చేయకుండా ఆమెను ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌కు తరలించారు. ప్రస్తుతం బాలిక.. వైద్యుల పరిశీలనలో ఉంటుంది. అంబులెన్స్ డ్రైవర్లు మణికుట్టన్, థామస్, టిన్స్, బిబిన్ను అందరూ అభినందిస్తున్నారు.
స్వీపర్‌కు ప్రసవం చేసిన RPF మహిళా కానిస్టేబుల్స్
మరోవైపు, రాజస్థాన్‌లో ఓ స్వీపర్‌కు ఆర్పీఎఫ్ మహిళా కానిస్టేబుళ్లు.. ప్రసవం చేశారు. దీంతో ఆ స్వీపర్ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అజ్మేర్ రైల్వే స్టేషన్లో గురువారం ఉదయం.. ప్లాట్‌ఫాంను శుభ్రం చేస్తున్న సమయంలో పూజ అనే మహిళకు ఒక్కసారికి పురిటి నొప్పులు వచ్చాయి. ప్రసవ వేదనతో ఆమె విలపించింది. అదే సమయంలో ఆమెను ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ వీరేంద్ర సింగ్ చూశాడు.
వెంటనే అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ ప్రేమారామ్‌కు ఫోన్‌లో సమాచారం ఇచ్చాడు. దీంతో కానిస్టేబుళ్లు హంస కుమారి, సావిత్రి ఫగేడియా, లక్ష్మీ వర్మలను సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే పూజ ఆరోగ్య పరిస్థితి క్షీణించి రక్తస్రావం ప్రారంభమైంది. ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు కూడా సమయం లేదు. వెంటనే దుప్పటి తెచ్చి అడ్డుపెట్టి నలుగురు మహిళా కానిస్టేబుళ్లు ప్రసవం చేశారు. ఆమె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. వెంటనే తల్లీబిడ్డలను స్థానికంగా ఉన్న శాటిలైట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారని మహిళా కానిస్టేబుళ్లు తెలిపారు.