Nanded Hospital Deaths : ఆస్పత్రి డీన్​తో మరుగుదొడ్లు శుభ్రం చేయించిన ఎంపీ!.. ఎందుకో తెలుసా?

By ETV Bharat Telugu Team

Published : Oct 3, 2023, 8:12 PM IST

thumbnail

Nanded Hospital Deaths : ప్రభుత్వ ఆస్పత్రి డీన్​తో మరుగుదొడ్లు శుభ్రం చేయించారు ఓ ఎంపీ. ఈ ఘటన మహారాష్ట్ర నాందేడ్​లోని శంకర్రావ్ చవాన్​ ప్రభుత్వ ఆస్పత్రిలో జరిగింది. గత 48 గంటల్లోనే 31 మంది మరణించిన నేపథ్యంలో శివసేన ఎంపీ హేమంత్‌ పాటిల్‌ ఆస్పత్రిని సందర్శించి.. అక్కడి పరిస్థితులను పరిశీలించారు. ఈ క్రమంలో ఆస్పత్రిలో మరుగుదొడ్లు అధ్వానంగా ఉన్నట్లు ఆయన గుర్తించారు. వెంటనే ఆస్పత్రి డీన్‌ శ్యామ్‌రావ్ వాకోడేను పిలిపించి అపరిశుభ్రతపై గట్టిగా నిలదీశారు. అంతటితో ఆగకుండా డీన్‌తోనే మరుగుదొడ్లను శుభ్రం చేయించారు ఎంపీ హేమంత్​. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. ఎంపీ పైపుతో గోడలపై నీళ్లు కొడుతుండగా.. డీన్‌ వైపర్‌తో మరుగుదొడ్లను శుభ్రం చేస్తూ అందులో కనిపించారు.

సోమవారం ఇదే ఆస్పత్రిలో 24 గంటల్లోనే 24 మరణాలు సంభవించాయి. మంగళవారానికి ఆ సంఖ్య 31కి చేరింది. ఇంకా 71 మంది రోగుల పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలిసింది. అయితే, ఈ మరణాలకు వైద్య సిబ్బంది నిర్లక్ష్యం, మందుల కొరత కారణం కాదని చెప్పారు ఆస్పత్రి డీన్ శామ్‌రావ్‌. రోగులకు సరైన వైద్యం అందించినా వారు కోలుకోలేదని తెలిపారు. ఈ ఘటనపై ప్రభుత్వంపై విమర్శలు గుప్పించాయి ప్రతిపక్షాలు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.