Best Tourist Places to Visit in October in Telugu States : దసరా సెలవుల్లో చాలామంది టూర్స్ ప్లాన్ చేస్తుంటారు. మరి మీరు కూడా టూర్లకు వెళ్లాలనుకుంటున్నారా? అక్టోబర్ సీజన్‌లో చూడాల్సిన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రముఖ పర్యాటక ప్రదేశాల లిస్ట్ ఇక్కడ ఉంది. ఓ లుక్కేయండి మరి..
అరకు: ఆంధ్రాలో భూతల స్వర్గంగా పేరున్న అరకు వ్యాలీ సైతం అక్టోబర్ నెలలో చూడముచ్చటగా ఉంటుంది. ఈ కాలంలో అక్కడ వికసించే అందమైన పూతోటలు పర్యాటకుల్ని కొత్త అనుభూతికి గురి చేస్తాయి. అలాగే విశాఖ నుంచి అరకు వ్యాలీకి ఈ సమయంలో రైలులో ప్రయాణిస్తే అసలైన మజా ఉంటుంది. దట్టమైన అటవీ మార్గంలో సాగే ఈ ప్రయాణం గురించి ఎంత చెప్పినా తక్కువే.
పాపికొండలు: గోదావరి నదితో పెనవేసుకున్నట్టు కనిపించే పాపికొండల అందాలు టూరిస్టులను మైమరపింపజేస్తాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో గోదావరి నదిలో విస్తరించిన మూడు కొండల సముదాయమే పాపికొండలు. పర్వతాల అందాలను ఆనందించడంతోపాటు లోయలు, జలపాతాలు, క్యాంపింగ్, ట్రెక్కింగ్ వంటివి ఇక్కడ అనుభూతి చెందవచ్చు.
మారేడుమిల్లి: తూర్పుగోదావరి జిల్లాలో భద్రాచలం - రాజమండ్రి హైవే మార్గంలో ఈ గ్రామం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తప్పక సందర్శించాల్సిన ప్రదేశాల్లో మారేడుమిల్లి ఒకటి. దట్టమైన అడవులు, పొగమంచు వంటి ఎన్నో ప్రకృతి అందాల మధ్య మారేడుమిల్లి ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఫ్యామిలీతో ఇక్కడికి వెళ్తే ఎంతగానో ఎంజాయ్ చేయవచ్చు.
కొల్లేరు సరస్సు: దాదాపు 300 చదరపు మైళ్ల విస్తీర్ణంలో గోదావరి, కృష్ణా డెల్టా మధ్య అతి పెద్ద మంచి నీటి సరస్సుగా ఇది విస్తరించింది. ప్రతి ఏడాది అక్టోబర్ నుంచి మార్చి మాసాల మధ్య విదేశీ పక్షులు ఇక్కడికి వలస వస్తుంటాయి. పక్షి ప్రేమికులకు ఈ సరస్సు ఒక స్వర్గధామం అని చెప్పవచ్చు. దాదాపు 20 మిలియన్ల విదేశీ పక్షులు ఇక్కడికి వస్తుంటాయని చెబుతారు.
నాగార్జున సాగర్: హైదరాబాద్ సమీపంలో ఉన్న ముఖ్యమైన పర్యాటక ప్రదేశాలలో నాగార్జున సాగర్ ఒకటి. ఇది నల్గొండ జిల్లాలో ఉంది. ఇక్కడికి వెళ్తే మీరు కృష్ణా నదిపై నిర్మించిన అతిపెద్ద రాతి నిర్మాణమైన నాగార్జున సాగర్ ఆనకట్టను చూడొచ్చు. తర్వాత బోట్ ఎక్కి నది మధ్యలో ఉన్న నాగార్జున కొండకు వెళ్లొచ్చు. ఇక్కడ బౌద్ధ మహాయాన చక్రవర్తి నాగార్జున స్థాపించిన బౌద్ధ విహారంతోపాటు.. ప్లానిటోరియం, ఆర్ట్ గ్యాలరీ చూడొచ్చు. అలాగే ఆనాటి సంస్కృతిక వైభవం, కళాఖండాల అద్భుతాలను చూడొచ్చు.
అనంతగిరి హిల్స్: హైదరాబాద్‌కు సమీపంలో ఉండే హిల్ స్టేషన్లలో అనంతగిరి కొండలు ఒకటి. ఈ పర్యాటక ప్రదేశం వికారాబాద్ జిల్లాలో ఉంది. దీనిని 'తెలంగాణ ఊటీ'గా పిలుస్తారు. ఎత్తయిన కొండలు, పచ్చటి చెట్లు, ఇరుకైన లోయలు, స్వచ్ఛమైన గాలి, మంచినీటి సరస్సులు ప్రకృతి ప్రేమికులను కట్టిపడేస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక్కడికి వెళ్తే అడవి మధ్యలో ఉన్న 1300 సంవత్సరాల చరిత్ర గల అనంత పద్మ నాభస్వామి ఆలయం, నాగసముద్రం సరస్సు, భవనాసి సరస్సు తప్పకుండా చూడాలి. ఇంకా ట్రెక్కింగ్, బోటింగ్ అక్టివిటీస్ కూడా చేయొచ్చు!
పాకాల-ఏటూరునాగారం: తెలంగాణలోని పాకాల-ఏటూరునాగారం ప్రాంతం ప్రకృతి ప్రియులకు నిజమైన స్వర్గం. పచ్చని అడవులు, అద్భుతమైన జలపాతాలు, ప్రశాంతమైన సరస్సులు, అరుదైన వన్యప్రాణులు, చారిత్రక ఆలయాలు ఇక్కడ మిళితమై ఒక అద్భుతమైన ప్రకృతి దృశ్యాన్ని సృష్టించాయి. ఇక పాకాల సరస్సులో బోటింగ్, లక్నవరం సరస్సు, బొగతా వాటర్‌ఫాల్స్, రామప్ప ఆలయ సందర్శన, ఏటూరు నాగారం అభయారణ్యంలో టెక్క్రింగ్, క్యాంపింగ్, బర్డ్ వాచ్ వంటివి ఎంజాయ్ చేయవచ్చు.
తెలంగాణ టూరిజం వన్డే ప్యాకేజీ - కేవలం రూ.1500 టికెట్‌తో జోగులాంబ, అంజన్న దర్శనం, ఇంకా మరెన్నో!
హైదరాబాద్ To గోవా - తక్కువ బడ్జెట్లో తెలంగాణ టూరిజం స్పెషల్ ప్యాకేజీ! వివరాలివే!