ఓటమి భయంతోనే కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్పై ఆరోపణలు చేస్తున్నారు : మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ - తెలంగాణ రాజకీయ వార్తలు
🎬 Watch Now: Feature Video
Published : Nov 4, 2023, 4:32 PM IST
Minister Puvvada Comments on Congress : ఓటమి భయంతోనే కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్పై ఆరోపణలు చేస్తున్నారని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ విమర్శించారు. సోమవారం ఖమ్మంలో జరగనున్న సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాట్లపై స్థానిక నేతలతో మంత్రి చర్చించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పాలనలోనే దేశం సర్వనాశనమైందని ఆరోపించారు. ఇసుక, భూ మాఫియాలకు పాల్పడింది హస్తం నేతలే అని ధ్వజమెత్తారు.
విచక్షణ కోల్పోయినట్లు కనిపిస్తున్న కాంగ్రెస్ నేతల మాటలే బీఆర్ఎస్ గెలుపునకు పునాది అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి భద్రత దృష్ట్యా సభా ఏర్పాట్లు చేయాల్సి వస్తుందని.. దీనిపై కూడా విపక్ష నేతలు రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు. ఇవాళ ఏదో గుడినో, మసీదునో, చర్చినో కూలగొట్టినట్లు విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. సీఎం సభకు వేలాదిగా జనం హాజరవుతారని.. ఈ నేపథ్యంలోనే సభా ప్రాంగణంలో కొంత అడ్డంగా ఉన్న కళాశాల నిర్మాణాన్ని తొలగించామన్నారు. మళ్లీ కట్టిస్తామని చెప్పినట్లు వివరించిన మంత్రి.. దానికే సామాజిక మాధ్యమాల్లో విపక్షాలు ఇష్టారీతిన మాట్లాడుతున్నాయని ఆక్షేపించారు.