Constable Rescues a falling Passenger Video : ప్రయాణికురాలి ప్రాణం కాపాడిన కానిస్టేబుల్.. వీడియో వైరల్ - Constable Rescues a falling Passenger Video Viral
🎬 Watch Now: Feature Video
Constable Rescues a falling Passenger Video Viral : కదులుతున్న రైలు ఎక్కబోతూ.. రైలు ఆగకముందే దిగబోయేందుకు ప్రయత్నిస్తూ.. ఈ మధ్య చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి ఘటనలకు సంబంధించి ఈ మధ్య వీడియోలు సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. అయితే పలు సంఘటనల్లో ఆ రైల్వే స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది గమనించి.. ప్రయాణికుల ప్రాణాలు కాపాడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే వరంగల్ రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకుంది.
వరంగల్ రైల్వే స్టేషన్‌లో కదులుతున్న రైలు నుంచి దిగేందుకు ప్రయత్నించిన ఓ మహిళ ప్రమాదవశాత్తు రైలు కింద పడుతుండగా ఆర్పీఎఫ్ మహిళా కానిస్టేబుల్ చాకచక్యంగా కాపాడారు. భద్రాచలంనుంచి సికింద్రాబాద్ స్టేషన్ వెళ్లే మణుగూరు ఎక్స్‌ప్రెస్ శనివారం తెల్లవారుజామున 2.47 నిమిషాలకు వరంగల్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. నెమ్మదిగా ట్రైన్ ఆగుతున్న సమయంలో ఓ మహిళా ప్రయాణికురాలు కిందకు దిగేందుకు ప్రయత్నించింది. పట్టు జారడంతో ప్లాట్‌ఫాం మీద ప్రమాదవశాత్తు కింద పడిపోయారు. తలుపు వద్ద హ్యాండిల్‌ను వదలక పోవటంతో... కొద్ది దూరం రైలు ఆమెను ఈడ్చుకొని వెళ్లింది. ఆ సమయంలో అక్కడే విధులు నిర్వర్తిస్తున్న రైల్వే రక్షక దళం మహిళా కానిస్టేబుల్ సొనాలి.ఎమ్ మొలాకె పరుగున వచ్చి ప్రయాణికురాలిని ఒక్క ఉదుటున ప్లాట్‌ఫాం వైపు లాగారు. దీంతో ఆ మహిళకు ప్రాణాపాయం తప్పింది. కానిస్టేబుల్ చూడకుండ సరైన సమయంలో స్పందించకపోయి ఉంటే ఆమె రైలు, ప్లాట్‌ఫాం మధ్య పడి ప్రాణాలు కోల్పోయేది. విధుల్లో ధైర్యసాహసాలు ప్రదర్శించిన సొనాలిని రైల్వే ఉన్నతాధికారులు అభినందించారు.