Repairs to Karimnagar Cable Bridge Approach Road : 'ఈటీవీ భారత్' కథనానికి స్పందన.. కరీంనగర్ తీగల వంతెన అప్రోచ్ రోడ్డుకు మరమ్మతులు - కరీంనగర్ కేబుల్ బ్రిడ్జి రహదారిపై పగుళ్లు
🎬 Watch Now: Feature Video
Repairs on Karimnagar Cable Bridge : 'కరీంనగర్ కేబుల్ బ్రిడ్జి.. ప్రారంభించి నెల కాక ముందే పగుళ్లు' పేరిట ఈటీవీ భారత్లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. అప్రోచ్ రహదారిపై పగుళ్లకు సదరు గుత్తేదారు మరమ్మతు పనులను ప్రారంభించారు. కరీంనగర్ రాజీవ్ రహదారి నుంచి తీగల వంతెనకు కలుపుతూ 300 మీటర్ల అప్రోచ్ రోడ్డు వేశారు. అయితే దీనిని గత నెలలో ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అట్టహాసంగా ప్రారంభించారు. నాలుగు వారాలు గడవక ముందే రోడ్డు బీటలు వారి పక్కన ప్రహరీ గోడకు పగుళ్లు వచ్చాయి. దీనిపై ఈటీవీ భారత్ కథనాన్ని ప్రచురించగా.. అప్రమత్తమైన అధికారులు స్థలాన్ని పరిశీలించి.. 28.05 మీటర్లలో అక్కడక్కడ రెండు, మూడు సెంటిమీటర్ల లోతు వరకు కుంగిపోవడమే కాకుండా బీటలు వారినట్టుగా గుర్తించారు. ఈ మేరకు మరమ్మతు చేసేందుకు ఇప్పటికే వేసిన తారును తొలగించారు. మరమ్మతులకు అవసరమైన పనులన్నీ నాలుగైదు రోజుల్లో పూర్తి చేసి.. మళ్లీ తారు వేస్తామని రోడ్లు భవనాల శాఖ కార్యనిర్వాహక ఇంజినీర్ సాంబశివరావు తెలిపారు. పర్యాటకులు అప్రోచ్ రోడ్డు కుడి వైపు నుంచి వెళ్లి తీగల వంతెనను వీక్షించవచ్చునని స్పష్టం చేశారు.