Jagtial Rains : వానా వానా వల్లప్పా.. వరద ఉద్ధృతి తగ్గేదెప్పుడప్పా..?
Heavy Rains in Jagtial : రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల్లో వాన జోరు తగ్గినా.. దాని ప్రభావం మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. పలు జిల్లాల్లోని చెరువులు పొంగి అలుగు పారుతున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో ఉరకలెత్తుతున్న వాగుల ఉద్ధృతికి వరద నీరంతా రహదారులపైకి చేరి రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. పలుచోట్ల జనజీవనం స్తంభిస్తోంది.
జగిత్యాల జిల్లాలో కురిసిన వర్షాలకు వాగులు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. అనంతారం జాతీయ రహదారి వంతెన పైనుంచి నీరు ప్రవహిస్తోంది. ప్రవాహ వేగం ఉద్ధృతంగా ఉండటం వల్ల రోడ్డు దాటేందుకు వాహనదారులు, పాదచారులు భయపడుతున్నారు. ఎక్కడ వరదలో కొట్టుకుపోతామేమోనని అక్కడే ఆగిపోతున్నారు. అనంతారం వంతెనపైకి వరద నీరు చేరడం వల్ల జగిత్యాల పరిసర గ్రామాలైన ధర్మపురి, మంచిర్యాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పూర్తిగా వంతెన నీట మునగడంతో ప్రయాణాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రాయికల్ మండలం మైతాపూర్ మధ్య వాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. సారంగాపూర్ మండలం పెంబట్ల -కోనాపూర్ గ్రామ ప్రజల రవాణా సదుపాయాలు దెబ్బతిన్నాయి.