Godavari water level Bhadrachalam : 46.7 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం.. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ - Bhadradri Kothagudem District News
🎬 Watch Now: Feature Video
Godavari water level at Bhadrachalam : రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో పాటు.. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతూ వస్తోంది. నిన్నటి వరకు 39 అడుగుల వద్ద ప్రవహించిన గోదావరి.. ఈరోజు ఉదయానికి 40 అడుగులకు చేరింది. రాత్రి 7 గంటలకు 46.7 అడుగులకు వద్దకు చేరి ప్రవహిస్తోంది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీచేశారు. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరిలో 10.83 లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఉంది. భద్రాచలం ఎగువన ఉన్న తాలిపేరు ప్రాజెక్టు నుంచి 23 గేట్లు ఎత్తి.. 1,80,000 క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం రెండవ ప్రమాద హెచ్చరిక స్థాయి.. 48 అడుగుల వరకు పెరగవచ్చు అని కేంద్ర జలవనరుల శాఖ అధికారులు తెలుపుతున్నారు.
గోదావరి ప్రవాహం 43 అడుగుల వద్దకు నీటిమట్టం చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక.. 48 అడుగులకు చేరితే రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. భారీగా కురుస్తున్న వర్షాలతో పాటు పెరుగుతున్న గోదావరి నది వరదల వల్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య సూచించారు. గోదావరి కరకట్ట ప్రాంతం వద్ద విస్తా కాంప్లెక్స్ ఏరియాలో మోటర్ల ద్వారా బ్యాక్ వాటర్‌ను తొలగించే ప్రాంతాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. రామాలయం ఏరియాలో కొత్త కాలనీలో వరద నీరు చేరకుండా అధికారులు ఎప్పటికప్పుడు బ్యాక్ వాటర్‌ను మోటర్ల ద్వారా తొలగించాలని అధికారులకు చెప్పారు.