Pratidwani: రేషన్... పరేషాన్! - రేషన్‌కార్డుల సమస్యలు
🎬 Watch Now: Feature Video
Pratidwani: రాష్ట్రవ్యాప్తంగా 92 లక్షల పైచిలుకు రేషన్‌కార్డులు ఉన్నాయి. ప్రజా పంపిణీ వ్యవస్థ కింద సుమారు 2 కోట్ల 85 లక్షల మంది ఈ సౌకర్యం పొందుతున్నారు. వీరికి ప్రతినెలా ప్రతి వ్యక్తికీ ఆరు కిలోల బియ్యం అందుకుంటారు. అయితే గత 4 ఏళ్లుగా.. కొత్త కార్డుల పంపిణీ జరగడం లేదు. ఇప్పటికీ కొత్తకార్డుల కోసం ఎంతోమంది నిరీక్షణిస్తున్నారు. మధ్యలో ప్రభుత్వం కొత్త కార్డుల మంజూరు, పేర్ల నమోదు చేపడుతూ దరఖాస్తులు స్వీకరించినా.. తరువాత అడుగు ముందుకు పడలేదు. దీంతో కొత్తగా పుట్టిన పిల్లలు, కొత్తగా పెళ్లైన జంటలు.. కార్డు కోసం ఎదురుచూస్తున్నారు. భార్యాభర్తల పేర్లు ఉంటాయి కానీ పిల్లల పేర్లు అందులో ఎక్కవు, కొన్నిచోట్ల పెళ్లైన అమ్మాయిల పేర్లు కార్డుల్లో తొలగించారు. కానీ వారి పేర్లు మెట్టినింటి కార్డులో నమోదు చేయడం లేదు. వీటికి తోడు కార్డుల్లో అక్షర దోషాల సవరణ, కొత్త పేర్ల నమోదు, ఇతర మార్పుల కోసం దరఖాస్తుదారుల ఎదురుచూపులు చూడాల్సి వస్తోంది. ఎందుకంటే అధికారులు ఏకంగా వివరాల ఎడిట్ ఆప్షన్‌ను తొలగించారు. ఓవైపు కొత్త కార్డులు మంజూరు చేయకపోగా... అదే సమయంలో కార్డుల తొలగింపు మొదలైంది. పేదల్లో ఇది కొత్త భయాన్ని సృష్టించింది. రేషన్ కార్డుల్లో అనర్హుల పేరుతో నిరంతరం ఈ తొలగింపు మొదలైంది. పేరు సరిగా లేదని, ఇంటి చిరునామా తప్పుగా ఉందని.. 3నెలలుగా రేషన్ తీసుకోలేదని... ఇలా పలు కారణాలతో కార్డుల తొలగింపు జరుగుతోంది. ఓసారి కార్డు రద్దయితే.. మళ్లీ దానిని సంపాదించుకోవడం చాలా కష్టమని అందరికి తెలుసు. కార్డు లేకుంటే కేవలం రేషన్ బియ్యమే మాత్రమే కోల్పోరు... ఆరోగ్య శ్రీ కార్డు కూడా దక్కదు. ఈ కార్డు లేకుండే వారికి ప్రభుత్వ ఆసుపత్రే గతి. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఈ కార్డుతో చికిత్స చేయించుకునే అవకాశం ఉండదు. గతేడాది ఆగస్టులోపే అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు, పింఛన్లు అందజేస్తామని అప్పట్లో మంత్రి కేటీఆర్ ప్రకటించారు. కానీ ఆ హామీ కూడా అటకెక్కింది. ఈ పరిస్థితుల్లో ఉన్న కార్డుదారుల సమస్యలు తొలగి పోవాలన్నా... కొత్త కార్డుల దరఖాస్తుదారులకు నిరీక్షణ కు తెరపడాలన్నా.. రాష్ట్రప్రభుత్వం తక్షణం తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి? ఈ అంశంపై ఇవాళ్టి ప్రతిధ్వని కార్యక్రమంలో చర్చిద్దాం.
చర్చలో పాల్గొంటున్న వారు:
1) ఎన్.రాజు, తెలంగాణ రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
2) శ్రీనివాసరావు, హైదరాబాద్ ఆహార నిఘా కమిటీ సభ్యులు