Bhatti Vikramarka Latest Comments : 'నీళ్లు, నిధులు, నియామకాలు కేసీఆర్ పాలనలో కలగానే ఉన్నాయ్'
🎬 Watch Now: Feature Video
Bhatti Vikramarka Fire on KCR : దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ ఏకమవుతున్న వేళ.. విపక్షాల్లో చీలిక తెచ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. అందులో భాగంగానే ఇటీవల ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌ను హైదరాబాద్ రప్పించుకుని సమావేశమయ్యారని అన్నారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ముమ్మాటికీ బీజేపీకి-బీ టీమ్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్కి ఓటు వేస్తే బీజేపీకి వేసినట్లేనని ఆయన అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా విపక్ష పార్టీ లను బలహీన పరచడమే బీజేపీ ఎజెండా అన్నారు. ఖమ్మం జనగర్జన బహిరంగ సభను విజయవంతం చేసిన పార్టీ కార్యకర్తలు, నాయకులకు భట్టి కృతజ్ఞతలు తెలిపారు.
Bhatti Comments on KTR : బహిరంగ సభను అడ్డుకునేందుకు అధికార పార్టీ కుటిల ప్రయత్నాలు చేసిందన్నారు. బీఆర్ఎస్ ఎన్ని అడ్డంకులు సృష్టించినా లెక్కచేయకుండా ప్రజలు అశేష జనవాహిని కలిదివచ్చిందన్నారు. ఖమ్మం జనగర్జన సభతో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని తేలిందన్నారు. బీఆర్ఎస్ 9 ఏళ్ల పాలనలో గోదావరి, కృష్ణా నదుల నుంచి అదనంగా ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేదన్నారు. కానీ.. కాళేశ్వరం ద్వారా 45 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చామని పదేపదే చెబుతున్న మంత్రి కేటీఆర్‌కు అసలు కాళేశ్వరంపై అవగాహన లేదని విమర్శించారు.
Bhatti Comments on BJP : రాష్ట్రంలో బీజేపీ పని అయిపోందని ఆ పార్టీ గురించి మాట్లాడటానికేమీ లేదన్నారు. పాత కొత్తల కలయికతోనే పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు అంతా కలిసి కృషి చేస్తామన్నారు. వైఎస్ షర్మిల కాంగ్రెస్‌లోకి వచ్చే అంశంపై అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. అలాంటి చర్చలు జరిగినప్పుడు స్పందిస్తామన్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్‌లోకి భారీగా వలసలు ఉంటాయని భట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ఆకాంక్షలైన నీళ్లు, నిధులు, నియామకాలు కేసీఆర్ పాలనలో కలగానే మారాయని అన్నారు. కాంగ్రెస్ పాలనతోనే ప్రజల స్వప్నాలు సాకారమవుతాయన్నారు.