World Sight Day 2022 : కళ్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ సమస్య రాకుండా జాగ్రత్త పడాలి. కానీ కొందరు నయనాల్ని ఎక్కువగా పట్టించుకోరు. అందువల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ నేపథ్యంలో సాధారణంగా మనం కళ్ల విషయంలో చేసే తప్పులేంటో తెలుసుకుందాం.
కంటి పరీక్ష చేయించుకోకపోవటం
Eye care tips in Telugu : కనీసం ఏటా ఒకసారి కంటి పరీక్ష చేయించుకోవటం మంచిది. 40 ఏళ్లు పైబడినవారికిది మరింత ముఖ్యం. కంటి పరీక్షలో చూపు ఎలా ఉందనేది చూస్తారు. కంట్లో చుక్కల మందు వేసి నీటికాసుల వంటి సమస్యలేవైనా ఉన్నాయా అని పరీక్షిస్తారు. అవసరమైతే ఏటా రెండు మూడు సార్లు పరీక్ష చేయాల్సి రావొచ్చు.
![World Sight Day 2022 eye care tips in telugu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/16630388_eye_1.jpeg)
దురదపై నిర్లక్ష్యం
కంటి నుంచి నీరు కారటం, దురద, మంట వంటి అలర్జీ లక్షణాలు ఇన్‌ఫెక్షన్లలోనూ కనిపించొచ్చు. ముఖ్యంగా నొప్పి, గరగర వంటివి ఉంటే నిర్లక్ష్యం అసలే పనికిరాదు.
దెబ్బలు పట్టించుకోకపోవటం
కంటికి ఎలాంటి దెబ్బ తగలినా వీలైనంత త్వరగా డాక్టర్‌కు చూపించుకోవాలి. చూపు మసకబారినట్టు అనిపించినా, కళ్లు తెరవలేకపోతున్నా, తెల్లగుడ్డు మీద రక్తం చారలు కనిపించినా, కన్ను సరిగా కదలకపోతున్నా, కంటిపాప పెద్దదిగా లేదా ఆకారం మారినట్టు ఉన్నా ఆలస్యం చేయరాదు.
పొగ తాగటం
పొగ తాగే అలవాటు కళ్లకూ హాని చేస్తుంది. శుక్లాలు, దృశ్యనాడి దెబ్బతినటం, రెటీనా మధ్యభాగం క్షీణించే ముప్పులు పెరిగేలా చేస్తుంది.
![World Sight Day 2022 eye care tips in telugu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/16630388_eye_2.jpeg)
చలువ అద్దాలు ధరించకపోవటం
సూర్యరశ్మిలోని అతినీలలోహిత కాంతి కిరణాలు కళ్లను దెబ్బతీస్తాయి. దీంతో శుక్లాలు, రెటీనా మధ్యభాగం దెబ్బతినటం వంటివి తలెత్తుతాయి. అందువల్ల బాగా ఎండ కాస్తున్నప్పుడు బయటకు వెళ్తే చలువ అద్దాలు ధరించటం మంచిది.
కళ్లను రుద్దటం
చాలామంది చేసే పొరపాటు ఇది. అదేపనిగా రుద్దితే కళ్లు చికాకుకు గురవుతాయి. రక్తనాళాలూ దెబ్బతింటాయి. ఇవి కళ్లను దెబ్బతీస్తాయి.
అతిగా గ్యాడ్జెట్ల వాడకం
అదేపనిగా స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌ల వంటి వాటి వంకే చూస్తూ ఉంటే కంటి కండరాలు దెబ్బతింటాయి. కళ్లు అలసిపోతాయి.
కళ్లద్దాలు సరిచేసుకోకపోవటం
ఏళ్ల తరబడి అవే కళ్లద్దాలు ధరించటం తగదు. రోజులు గడుస్తున్న కొద్దీ మన చూపూ మారుతుంది. దీన్ని ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ అవసరమైతే కళ్లద్దాలూ మార్చుకోవాల్సి ఉంటుంది. లేకపోతే చూపు దెబ్బతినొచ్చు.
అలర్జీల నుంచి కళ్లను ఎలా రక్షించుకోవాలో తెలుసుకునేందుకు ఈ వీడియో చూడండి.