మైక్రోస్కోప్‌లో అమాయకంగా కనిపించే కరోనా వైరస్ ప్రమాదకర ఆయుధంగా మారి జనాభా లెక్కలను తారుమారు చేస్తున్న సమయంలో మనం సాధించిన సాంకేతికతే మనల్ని కాపాడుతోంది. ఈ వైరస్ మన శ్వాసకోశాలను ముట్టడించటం ప్రారంభించగానే దాని జన్యు క్రమాన్ని ఛేదించి టీకాను తయారుచేసే పని ప్రారంభించాం. వైరస్లు కలిగించే పోలియో, చిన్నమ్మవారు, ధనుర్వాతం మొదలైన ఎన్నో టీకాలు ప్రభావవంతంగా పనిచేస్తున్నాయి. నేడు శాస్త్రవేత్తలు కరోనా వైరస్‌ను ఆమూలాగ్రం పరీక్షిస్తున్నారు. వైరస్లు సహజంగానే పరివర్తన చెంది కొత్త రకాలకు జన్మినిస్తాయి. వీటిలో కొన్ని రకాల వైరస్లు సుదీర్ఘకాలం మనగలుగుతూ ప్రకృతిలో భాగమైతే, కొన్ని బలహీనపడి అంతరించి పోతాయి.
బి.1.617 రకం కొవిడ్:
గత కొన్ని వారాలుగా బి.1.617 వైరస్ భారత్‌లో వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ వైరస్ ఇప్పటికే 40 దేశాలకు పాకింది. గతంలో బి.1.1.7 రకం వైరస్ బ్రిటన్ నుంచి ఢిల్లీకి చేరి పంజాబ్ ప్రాంతం వరకు విస్తరించింది. బంగాల్లో బి.1.618 రకం వైరస్ కొవిడ్‌ను కలిగిస్తుండగా, బి.1.617 రకం మిగతా వాటిపై పైచేయి సాధించి విస్తరిస్తోంది. ఇది మహారాష్ట్ర లోనూ విస్తారంగా ఉంది. 617 రకం 617.2 అనే కొత్త రకాన్ని కూడా తయారు చేసినట్టు ఇంగ్లాండ్ లో గుర్తించారు.
2020, అక్టోబర్‌లో భారత్‌లో గుర్తించిన ఈ రకం ఫిబ్రవరి 2021 కల్లా మహారాష్ట్రలోనే 60% రోగులకు కారణమైంది. ఇన్సాకోగ్ అనే వైరస్ జన్యువుల విశ్లేషణ సంస్థ, పూణె లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, హైదరాబాద్‌లోని సి.సి.ఎమ్.బి. ఆ వైరస్ల రకాలను గుర్తిస్తున్నారు. ఎన్.440.కె అనే రకం వైరస్‌ను కర్నూల్లో గుర్తించారు. ఇది 15 రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతూ తీవ్ర వ్యాధి లక్షణాలను కలుగచేస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లోనే కాక చుట్టు పక్కల రాష్ట్రాలకు ఇది పాకింది. అయితే ఈ కర్నూల్ రకం వైరస్ నిదానంగా అంతరిస్తూ ఉంది. దాని స్థానంలో బి.1.1.7, బి.1.617 రకాలు విస్తరిస్తున్నాయి.
సరిహద్దుల వెలుపల:
కొవిడ్‌ను కలుగచేసే వైరస్లలో ప్రపంచవ్యాప్తంగా వేల రకాలు ఉంటాయి. ఈ వైవిధ్యానికి కారణం నిరంతరం జరుగుతున్న ఉత్పరివర్తనాలే. బ్రిటన్‌కు చెందిన బి.1.1.7 నేడు 50కి పైగా దేశాల్లో కనిపిస్తోంది. దక్షణాఫ్రికాకు చెందిన బి.1.351 రకం 20 దేశాలకుపైగా పాకింది. పి.1 అనే బ్రెజిల్ రకం 10 దేశాల్లో వీరవిహారం చేస్తోంది. ఈ వేరువేరు వైరస్లు అన్నీ కరోనా జాతికి చెందినవే. అన్నీ ఊపిరితిత్తులనే ప్రధానంగా ముట్టడిస్తాయి. జన్యుక్రమంలో కొన్ని మార్పుల వల్ల కొవిడ్ లక్షణాల్లో కొన్ని తేడాలు కనిపించవచ్చు. విటన్నింటిలోనూ బి.1.617 రకం నేడు భారత్‌లో ఆక్సిజన్ ఇబ్బందులకు, ఆసుపత్రులపై భారానికి కారణమవుతోంది.
టీకాలు మనల్ని రక్షించగలవా?
కొవిషీల్డ్ టీకా బ్రిటన్ రకాలకు చెందిన వైరస్‌లను సులభంగా నిర్వీర్యం చేయగలదు. ఇది దక్షిణాఫ్రికా రకం వైరస్‌లపై అంత ప్రభావం చూపించకపోవచ్చు. అయినా వ్యాధి లక్షణాలు ముదరకుండా ప్రాణాలు నిలబెట్టగలదు. మోడెర్నా టీకా దక్షిణాఫ్రకా వైరస్‌లపై చక్కగా పనిచేస్తుంది. కొవాగ్జిన్ టీకా బ్రిటన్, బ్రెజిల్ రకాల వైరస్‌లకు వ్యతిరేకంగా ఉత్తమ ప్రభావాన్ని చూపుతోంది. రష్యాకు చెందిన స్పుత్నిక్ టీకా భారత్‌లో విస్తరించిన వైరస్‌లను సంహరించగలదు. ఏ టీకా అయినా మన శరీరంలో రోగనిరోధక శక్తిని ఇనుమడింపచేసి, వ్యాధిని నిరోధిస్తుంది. లేదా లక్షణాల తీవ్రతను బాగా తగ్గించి ప్రాణాపాయం నుంచి రక్షిస్తుంది. అందువల్ల కొవిడ్ సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవటానికి టీకా మాత్రమే అత్యుత్తమ ఆయుధం.