Eating Food With Hands Benefits : భారతదేశం.. అనేక సంస్కృతులు, సంప్రదాయాల మేళవింపు. శతాబ్దాల నాటి పద్ధతుల్ని దేశంలోని అత్యధిక జనాభా ఇప్పటికీ పాటిస్తోంది. అలానే పాశ్చాత్య పోకడల్నీ అలవాటు చేసుకుంటోంది. ఇలాంటి భిన్న పరిస్థితుల మధ్య.. భారతీయులు చేతులతోనే తినడం వెనకున్న శాస్త్రీయ, వైదిక కారణాల్ని చూద్దాం.
వేదాలు ఏం చెబుతున్నాయి?
రోజువారీ జీవితంలో ఆయుర్వేదానిదీ కీలక పాత్ర. ముఖ్యమైన భాగం కూడా. మనిషి శరీరంలో చేతులు అత్యంత విలువైన అవయవాలని ఆయుర్వేదం చెబుతోంది. చేతికి ఉండే ఐదు వేళ్లు.. పంచ భూతాలతో సమానమని వివరిస్తోంది.
- బొటన వేలు-- అగ్ని
- చూపుడు వేలు--వాయువు
- మధ్య వేలు--ఆకాశం
- ఉంగరం వేలు--భూమి
- చిటికెన వేలు--నీరు
చేతితో తింటే లాభాలెన్నో..
చెంచాలకు బదులు చేతులతో తినడం వల్ల ఆరోగ్యపరంగా ఎన్నో లాభాలు ఉన్నాయని ఇప్పటికే అనేక అధ్యయనాల్లో తేలింది.
1. మెరుగైన అరుగుదల
అరచేతులు, వేళ్లపై "నార్మల్ ఫ్లోరా" అనే బ్యాక్టీరియా ఉంటుంది. అది ఏమాత్రం హానికారకం కాదు. పర్యావరణంలో ఉండే కొన్ని రకాల ప్రమాదకర సూక్ష్మజీవుల నుంచి రక్షణ కల్పిస్తుంది. చేతితో తింటే.. "నార్మల్ ఫ్లోరా" బ్యాక్టీరియా మన శరీరంలోకి చేరుతుంది. నోరు, గొంతు, పేగులకు మంచి చేస్తుంది. ఆహారం మరింత మెరుగ్గా జీర్ణమయ్యేందుకు ఉపకరిస్తుంది.
2. మితాహారం
చేతితో అయితే మనం చాలా నెమ్మదిగా తింటాం. చెంచాలు ఉపయోగించిన దానికన్నా మనం తినే తిండి తక్కువగా ఉంటుంది. ఫలితంగా.. ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. ఈ విషయం అనేక పరిశోధనల్లో తేలింది.
3. మధుమేహం దూరం
టైప్-2 డయాబెటిస్ ఉన్నవారు ఇతరులతో పోల్చితే చాలా వేగంగా తింటారు. అలా చేయడం.. శరీరంలోని చక్కెర స్థాయిల్లో హెచ్చుతగ్గులకు దారితీస్తుంది. ఆ మార్పును నివారించాలంటే చేతితో తినడం ఉత్తమం. అప్పుడే ఆహారం నెమ్మదిగా తీసుకుంటారు. ఆరోగ్య సమస్యలకు దూరంగా ఉంటారు.
4. పరిశుభ్రత
చేతుల్ని రోజులో అనేకసార్లు కడుక్కుంటాం. తినడానికి ఉపయోగించే పాత్రల్ని మాత్రం రోజుకు ఒక్కసారే శుభ్రపరుస్తాం. తినేందుకు చెంచాలకు బదులుగా చేతుల్నే ఉపయోగిస్తే.. అపరిశుభ్రత వల్ల వచ్చే సమస్యల్ని చాలావరకు నివారించవచ్చు.
ఇవీ చదవండి: మధుమేహంతో ఇబ్బంది పడుతున్నారా?.. పెరుగు, గుడ్లు తినేయండి!