మీరంతా కంటి నిండా నిద్రపోతున్నారా...? ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే కేవలం ఆరు గంటల సేపే నిద్రపోయేవారికి ఒంట్లో నీటిశాతం తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటోందని అధ్యాయనాలు చెబుతున్నాయి. ఒంట్లో నీటి శాతం తగ్గితే నిరుత్సాహం, నిరాసక్తత, చిరాకు, ఏకాగ్రత దెబ్బతినటం వంటి సమస్యలు తలెత్తుతాయి.
మనం రాత్రిపూట నిద్రపోతున్నప్పుడు పీయూష గ్రంథి వాసోప్రెసిన్ అనే హార్మోన్ను విడుదలయ్యేలా చేస్తుంది. ఇది మూత్రపిండాలను మూత్రాన్ని పట్టి ఉంచేలా చేస్తుంది. దీని వల్ల ఒంట్లోంచి ద్రవాలు ఎక్కువగా వెళ్లిపోవన్నమాట. సాధారణంగా గాఢనిద్రలో వాసోప్రెసిన్ మరింత ఎక్కువగా విడుదలవుతుంది. ఒకవేళ మనం ముందుగానే నిద్రలేస్తే ఇది కిడ్నీలకు అంతగా చేరుకోదు. దీంతో అవి మూత్రాన్ని సరిగా పట్టి ఉంచలేవు. ఫలితంగా నీటి శాతం తగ్గుతుంది.
ఈ దుష్ప్రభావాలన్నింటినీ తప్పించుకోవాలంటే కంటి నిండా నిద్రపోవటం మంచిది. అది కుదరకపోతే లేచిన వెంటనే గ్లాసు నీరు తాగటమైనా చేయాలంటున్నారు ఆరోగ్య నిపుణులు.