తలనొప్పి తరచూ చూసేదే. దీనికి ఒత్తిడి, నిస్సత్తువ, ఎక్కువసేపు కంప్యూటర్, ల్యాప్‌టాప్‌లను చూడటం వంటి కారణాలు చాలానే ఉన్నాయి. నొప్పి మాత్రలు ఉపశమనం కలిగించొచ్చు గానీ వీటితో దుష్ప్రభావాలు తలెత్తొచ్చు. మరేంటి మార్గం? తలనొప్పి మరీ ఎక్కువగా లేకపోతే పరిమళ నూనెలను ప్రయత్నించొచ్చు. ఇవి తలనొప్పితో పాటు ఇతర సమస్యలు తగ్గటానికీ దోహదం చేస్తాయి. పెప్పర్‌మెంట్ నూనె తలనొప్పి, కండరాల నొప్పి, దురద, జీర్ణ సమస్యలను తగ్గించగలదు. కెమోమిలా నూనె నిద్ర బాగా పట్టేలా చేస్తుంది. ఇలా తలనొప్పి, ఒత్తిడి, ఆందోళన తగ్గటానికీ దోహదం చేస్తుంది. యూకలిప్టస్ నూనె పుండ్లు నయం కావటానికి, రక్తంలో గ్లూకోజు నియంత్రణలో ఉండటానికి, నంజుపొక్కులు తగ్గటానికి ఉపయోగపడుతుంది. లావెండర్ నూనె దిగులు, ఒత్తిడి, ఆందోళన తగ్గిస్తుంది. ఇది పార్శ్వనొప్పి నుంచీ ఉపశమనం కలిగిస్తుంది.
గుర్తుంచుకోవాల్సిన విషయమేంటంటే.. గాఢంగా ఉండే పరిమళ నూనెలను నేరుగా చర్మానికి రాసుకోవటం తగదు. ఇతర నూనెల్లో కలిపి రాసుకోవాలి. టిష్యూ కాగితం మీద రెండు మూడు చుక్కలు వేసి వాసన పీల్చుకోవచ్చు. రూమ్ ఫ్రెష్‌నర్‌లోనూ కొన్ని చుక్కలు కలుపుకోవచ్చు.
ఇదీ చదవండి: 10 రోజుల్లో బరువు తగ్గాలా? ఈ చిట్కాలు పాటించండి!