మన శరీరంలో అవసరమైన పనులు అవసరమైన సమయంలోనే జరగాలి. అవసరం తీరాక ఆగిపోవాలి. లేకపోతే తీవ్ర అనర్థాలకు దారితీస్తుంది. రక్తం గడ్డ కట్టే ప్రక్రియే దీనికి మంచి ఉదాహరణ. మనకు ఏదైనా గాయమైతే రక్తంలోని ప్లేట్‌లెట్లు, ఎర్ర రక్తకణాలు జట్టుకట్టి ఫిబ్రిన్ సాయంతో రక్తాన్ని గడ్డ కట్టించేస్తాయి. వెంటనే రక్తస్రావం ఆగిపోతుంది. మరి అనవసరంగా.. అదీ రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టటం మొదలైతే? తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది. ప్రాణాపాయాన్నీ తెచ్చిపెడుతుంది. థ్రాంబోసిస్ ఇలాంటి విపత్కర పరిస్థితినే తెచ్చిపెడుతుంది. ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న ప్రతి నాలుగు మరణాల్లో ఒకటి దీని మూలంగా తలెత్తే సమస్యలతోనే మరణిస్తున్నారు! థ్రాంబోసిస్‌పై అవగాహన లేకపోటమే దీనికి ప్రధాన కారణం.
రక్తం గడ్డలు సిరల్లో, ధమనుల్లో ఎక్కడైనా ఏర్పడొచ్చు గానీ ఎక్కువగా సిరల్లోనే పుట్టుకొస్తుంటాయి. ప్రధానంగా కాలి సిరల్లో ఏర్పడుతుంటాయి. ఇవి రక్త ప్రవాహానికి అడుగడుగునా అడ్డుపడుతుంటాయి. అంతేకాదు, రక్తనాళాల గోడల నుంచి విడిపోయి, రక్తంలో కలిసి ఇతర భాగాలకూ చేరుకోవచ్చు (వీనస్‌థ్రాంబోఎంబాలిజమ్- వీటీఈ). ఇలా ఊపిరితిత్తులకు చేరుకొని (పల్మనరీ ఎంబాలిజమ్) ప్రాణాంతకంగా పరిణమించొచ్చు. కొవిడ్-19లోనూ దీన్ని చూస్తూనే ఉన్నాం.
ఏంటీ కారణాలు?
నాళాల లోపలి పైపొర (ఎపిథిలియం) దెబ్బతినటం: గాయాలు, శస్త్రచికిత్సలు, ఇన్‌ఫెక్షన్లు.. ఇలా వాపు ప్రక్రియ (ఇన్‌ఫ్లమేషన్) ప్రేరేపితం కావటానికి దోహదం చేసేవేవైనా రక్తనాళాల లోపలి పైపొరను దెబ్బతీయొచ్చు. ఈ పొర మైనంలా మృదువుగా ఉంటుంది. ఏ కారణంతో దెబ్బతిన్నా రక్తం గడ్డకట్టే ప్రక్రియ అస్తవ్యస్తమైపోతుంది.
రక్త ప్రసరణ నిలిచిపోవటం (స్టేసిస్): రక్తం నిరంతరం ప్రవహిస్తూ ఉండాలి. ఒకవేళ ఎక్కడైనా నిల్వ ఉండిపోతుంటే గడ్డల ముప్పు పెరిగినట్టే. గుండె వైఫల్యం, శారీరక శ్రమ లేని జీవనశైలి, సుదూర ప్రయాణాల వంటివన్నీ ఇందుకు దోహదం చేసేవే.
రక్తం ఎక్కువగా గడ్డకట్టే తత్వం (హైపర్ కొయాగ్యుబిలిటీ): కొందరికి జన్యులోపాల మూలంగా రక్తం గడ్డకట్టే ప్రక్రియ గుణం ఎక్కువగా ఉంటుంది. ల్యూపస్ వంటి స్వీయరోగనిరోధక జబ్బులూ ఇందుకు దోహదం చేయొచ్చు.
డీవీటీ ప్రధానం
సిరల్లో ఏర్పడే రక్తం గడ్డల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది డీప్ వీన్ థ్రాంబోసిస్ (డీవీటీ) గురించే. ఎక్కువగా కనిపించేవి ఇవే. కాళ్లలో, గజ్జల్లో, చేతుల్లో ఎక్కడైనా ఏర్పడొచ్చు. ఇవి కొందరిలో ఉన్నట్టుండి తలెత్తొచ్చు. పైకేమీ తెలియకుండా దీర్ఘకాలంగా కొనసాగుతూ వస్తుండొచ్చు. చిన్న గడ్డలైతే లక్షణాలేవీ ఉండవు. ఒక మాదిరి గడ్డలు గలవారికి పాదాలు, మడమలతో పాటు కాళ్లు వాచిపోవచ్చు. నొప్పి పుట్టొచ్చు. సాధారణంగా నొప్పి పిక్కల్లో మొదలవుతుంటుంది. చర్మం ఎరుపెక్కొచ్చు. నల్లగానూ అవ్వచ్చు. కాళ్లు టైర్ల మాదిరిగా గట్టిగానూ అవ్వచ్చు. కొన్నిసార్లు ఉన్నట్టుండి కాలు ఎరుపెక్కి, వాచిపోయి నడవటమే కష్టం కావొచ్చు. వెంటనే చికిత్స చేయకపోతే ప్రాణాల మీదికీ రావొచ్చు.
ఊపిరితిత్తుల్లోకి చేరుకోవటం
కొందరిలో గడ్డలు రక్తనాళం నుంచి విడిపోయి, రక్తంలో కలిసి పైకి ప్రయాణించొచ్చు. ఇలా ఊపిరితిత్తులకూ చేరుకోవచ్చు (పల్మనరీ ఎంబాలిజమ్). పెద్ద పెద్ద గడ్డలైతే క్షణాల్లోనే మరణం సంభవిస్తుంది. గడ్డలు మధ్యస్థంగా ఉన్నవారికి ఆయాసం, శ్వాస వేగంగా తీసుకోవటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఛాతీలో నొప్పి ఉండొచ్చు. గాఢంగా ఊపిరి తీసుకుంటే నొప్పి ఎక్కువవుతుంది. గుండె వేగమూ పెరుగుతుంది. తల తేలిపోతున్నట్టూ అనిపించొచ్చు. రక్తపోటు బాగా పడిపోతుంది. శ్వాస సరిగా ఆడకపోవటం వల్ల రక్తంలో ఆక్సిజన్ స్థాయులూ పడిపోతాయి. దీనికి సత్వరం చికిత్స అవసరం.
ముప్పు ఎవరికి?
కాళ్లకు తగినంత వ్యాయామం లేకపోవటం.. ప్రయాణాల్లో గానీ కంప్యూటర్ ముందు గానీ కదలకుండా గంటల తరబడి కూర్చోవటం.. ఏదైనా జబ్బుతో, ప్రమాదాలతో లేదూ ఆపరేషన్లతో కాళ్లు కదపలేని స్థితిలో రోజుల తరబడి మంచం మీదే ఉండటం.. హార్మోన్ మాత్రలు దీర్ఘకాలంగా వాడుకోవటం.. ఊపిరితిత్తులు లేదా క్లోమగ్రంథి క్యాన్సర్ల వంటివన్నీ వీటి ముప్పు పెరిగేలా చేసేవే. గర్భిణులకు, గుండె వైఫల్యం, గుండె జబ్బులు, న్యుమోనియా, హెచ్‌ఐవీ వంటి జబ్బులతో బాధపడేవారికీ ముప్పు ఎక్కువే.
నిర్ధారణ ముఖ్యం
సిరల్లో రక్తం గడ్డల లక్షణాలు కనిపిస్తే ముందుగా కాలి, పిక్క కండరాల తీరుతెన్నులు, శ్వాస తీసుకునే విధానం వంటివి నిశితంగా పరిశీలిస్తారు. కడుపు మీద నొక్కి ఎక్కడైనా నొప్పి పుడుతుందేమో గమనిస్తారు. క్యాన్సర్ వంటి సమస్యల లక్షణాలేవైనా ఉన్నాయేమో పరిశీలిస్తారు. గడ్డలున్నట్టు అనుమానిస్తే కలర్ డాప్లర్ పరీక్ష చేస్తారు. పొట్ట భాగంలో గడ్డలను గుర్తించటానికి సీటీ లేదా ఎంఆర్‌ఐ స్కాన్ ఉపయోగపడుతుంది. పల్మనరీ ఎంబాలిజమ్ అయితే ఊపిరితిత్తుల సీటీ స్కాన్, పల్మనరీ యాంజియోగ్రామ్ ఉపయోగపడతాయి.
నివారణ సాధ్యమే
వ్యాయామం, శారీరక శ్రమ అన్నింటికన్నా ముఖ్యం. ఆసుపత్రిలో ఎక్కువసేపు మంచం మీదుండే వాళ్లు మడమలు కదిలిస్తూ ఉండాలి. వీలైనంత త్వరగా వ్యాయామాలు ఆరంభించాలి.
ఎప్పుడైనా, ఎక్కడైనా గంటల తరబడి కూర్చోకుండా చూసుకోవాలి.
ఒంట్లో నీటిశాతం తగ్గకుండా చూసుకోవాలి.
మద్యం జోలికి వెళ్లకుండా ఉండటం మంచిది. ఒకవేళ మద్యం అలవాటుంటే మితం పాటించాలి.
గడ్డలు ఏర్పడే ముప్పు ఉన్నవారు ప్రత్యేకమైన సాక్స్, క్రేప్ బ్యాండేజీ ధరించొచ్చు. ఇవి కండరాల మీద ఒత్తిడి పెంచుతూ రక్తం పైకి వెళ్లేలే చేస్తాయి.
అనుశీలన కీలకం
చికిత్స అనంతరం 10-15% మందికి ఏడాదిలోపు సమస్య మళ్లీ తిరగబెట్టొచ్చు. సుమారు 20-30% మందికి ఐదేళ్లలో, 50-60% మందికి పదేళ్లలో తిరగబెట్టొచ్చు. అందువల్ల క్రమం తప్పకుండా డాక్టర్‌ను సంప్రదిస్తూ, పరీక్షించుకోవటం చాలా ముఖ్యం. డీవీటీ తీవ్రంగా వచ్చినవారికి రాన్రానూ సిరల్లోని కవాటాలు దెబ్బతింటుంటాయి. దీంతో రక్తం కాస్త పైకి చేరుకోగానే కిందికి వచ్చేస్తుంది. ఇది సిరలు ఉబ్బటానికి (వెరికోజ్ వీన్స్) దారితీస్తుంది. ఫలితంగా కాళ్ల వాపులు, చర్మం నల్లగా అవటం, మడమల వాపు, నొప్పి, దురద, మచ్చలు, పుండ్లు, రక్తస్రావం వంటివి తలెత్తొచ్చు.
గడ్డలను బట్టి చికిత్స
గడ్డలు చిన్నగా, ఒక మాదిరిగా ఉన్నవారు ఇంట్లోనే చికిత్స తీసుకోవచ్చు. అధిక ముప్పులు గలవారిని, పెద్ద పెద్ద గడ్డలు, లక్షణాలు తీవ్రంగా ఉన్నవారిని, గతంలో గడ్డలు ఏర్పడ్డవారిని ఆసుపత్రిలో చేర్చి చికిత్స చేయాల్సి ఉంటుంది. వీరికి తొలి 5-10 రోజులు హెపారిన్ ఇంజెక్షన్లు ఇస్తారు. అనంతరం ఎసిట్రామ్, వార్ఫారిన్ వంటి మాత్రలు ఆరంభిస్తారు. మాత్రల ప్రభావం కనిపించటానికి రెండు, మూడు రోజులు పడుతుంది కాబట్టి ఇంజెక్షన్లు ఆపటానికి ముందే వీటిని ఆరంభించాల్సి ఉంటుంది. మందుల ప్రభావాన్ని గుర్తించటానికి మధ్యమధ్యలో పీటీఐ, ఐఎన్‌ఆర్ పరీక్షలు చేయాల్సి ఉంటుంది. అవసరమైతే మందు మోతాదూ మార్చాల్సి ఉంటుంది. ముప్పు కారకాలు, జబ్బు తీవ్రతను బట్టి మాత్రలను 3-6 నెలలు, కొందరికి 2 సంవత్సరాల వరకు ఇవ్వాల్సి ఉంటుంది. సమస్య తిరగబెట్టే అవకాశం గలవారు, ఊపిరితిత్తుల్లోకి రెండు సార్లు రక్తం గడ్డలు చేరుకున్నవారు, రక్తం గడ్డకట్టే తత్వాన్ని పెంచే జబ్బులు గలవారు, రక్తనాళాల జబ్బులు గలవారు జీవితాంతం వేసుకోవాల్సి ఉంటుంది. దీర్ఘకాలం మాత్రలు వేసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు అవసరం. మిరియాలు, ద్రాక్ష పండ్లు, బొప్పాయి పండ్ల వంటివి తినకూడదు. ఐబూప్రొఫెన్, క్లోర్‌ప్రొమజైన్ వంటి మందులు వేసుకోకూడదు. ఇవి మాత్రల ప్రభావాన్ని ఎక్కువ చేయొచ్చు లేదూ తగ్గించొచ్చు. ప్రస్తుతం ఇలాంటి ఇబ్బందులేవీ లేని, వెంటనే ప్రభావం చూపే కొత్తరకం మాత్రలూ అందుబాటులో ఉన్నాయి. ఇవి సురక్షితం. 3, 4 గంటల్లోనే ప్రభావం చూపుతాయి. ఆపేయగానే 6 గంటల్లో ప్రభావం తగ్గుతుంది. కాకపోతే ఖరీదు ఎక్కువ.
కొందరికి గడ్డ కారణంగా సిర మూసుకుపోయి చెడు రక్తం కిందే నిలిచిపోతుంది. నీరు, ఖనిజాలు, లవణాల వంటివి అక్కడే నిలిచిపోయి మొత్తం శరీర వ్యవస్థే అస్తవ్యస్తం కావొచ్చు. వీరికి సర్జరీతో పెద్ద సిరల్లోని గడ్డను తొలగించాల్సి ఉంటుంది. రక్త ప్రసరణ ఆగిపోకుండా సిరను దగ్గర్లోని ధమనులకూ అనుసంధానించాల్సి రావొచ్చు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో రక్తనాళాల గుండా సూక్ష్మమైన జల్లెడ లాంటి పరికరాన్ని పొత్తి కడుపు దగ్గర ఉండే ప్రధాన సిరలో అమరుస్తారు. ఇది గడ్డలు పైకి వెళ్లకుండా నిలువరిస్తుంది.