మారుతున్న జీవనశైలి, ఒత్తిడి, ఆందోళన, దురలవాట్లతో చాలామంది బ్రెయిన్ స్ట్రోక్ (brain stroke) బారిన పడుతున్నారు. నిమ్స్‌లో నెలకు 40-50 మంది వరకు ఈ సమస్యతో చేరుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. మెదడు రక్తనాళాల్లో ఏర్పడే వైఫల్యం కారణంగా బ్రెయిన్ స్ట్రోక్ (brain stroke) సంభవిస్తుంది. రక్తం గడ్డ కట్టడం వల్ల రక్తనాళాలు పూర్తిగా లేదా పాక్షికంగా మూసుకుపోయి, మెదడుకి రక్త సరఫరా సక్రమంగా జరగకపోయినా స్ట్రోక్ వస్తుంది. కొన్నిసార్లు రక్త నాళాల్లో చీలిక ఏర్పడి రక్తస్రావమైతే, కణాలకు రక్త సరఫరా ఆగిపోతుంది. దీనిని బ్రెయిన్ హెమరేజ్‌గా పిలుస్తారు. ఇందులో రక్త నాళాల గోడలు పలుచబడి చిన్న బుడగలుగా బయటకొస్తాయి. బ్రెయిన్ స్ట్రోక్‌తో శరీరంలో ఒకవైపు పూర్తిగా చచ్చుపడిపోతే పక్షవాతంగా వ్యవహరిస్తారు. వ్యాధిపై అవగాహన పెంచుకొని.. వెంటనే చికిత్స అందించడం ద్వారా ఈ రెండు రకాల మెదడు పోటులను నియంత్రించవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈనెల 29న ప్రపంచ స్ట్రోక్ దినం (world stroke day 2021)సందర్భంగా ఈ కథనం.
ఈ లక్షణాలుంటే..
- మెదడులో రక్తసరఫరా ఆగడాన్ని బట్టి బ్రెయిన్ స్ట్రోక్ (brain stroke symptoms)లక్షణాలు ఆధారపడి ఉంటాయి. కాళ్లు, చేతులను నియంత్రించే భాగాల వద్ద రక్తసరఫరా ఆగితే ఆ భాగాలు చచ్చుపడిపోతాయి.
- ముఖం, నోరు, కన్ను, ఒక్కోసారి శరీరానికి ఇరువైపులా భాగాలు ప్రభావితం కావచ్చు. మాట పడిపోవడం, నిలకడ, స్థిమితం లేకపోవడం, చూపు, స్పృహ కోల్పోవడం జరుగుతుంది.
- బ్రెయిన్ హెమరేజ్‌లో తీవ్రమైన తలనొప్పి వస్తుంది. వాంతులవుతాయి. కొన్నిసార్లు స్పృహ కోల్పోతారు. ః మధుమేహం, అధిక రక్తపోటు, హృదయ సంబంధ వ్యాధులు, ఊబకాయం, హైబ్లడ్ కొలెస్ట్రాల్ ఉన్నవారికి, పొగ, మద్యం తాగడం, డ్రగ్స్ తీసుకొనేవారికి ఈ ముప్పు ఎక్కువ.
- హఠాత్తుగా బలహీనత, శరీరంలో ఒకవైపు తిమ్మిరి, దృష్టిలోపం, నడకలో ఇబ్బందులు, మాటలను గ్రహించలేని స్థితి, మైకం కమ్మడం, స్థిరత్వం కోల్పోవటం, సమన్వయం దెబ్బతినడం జరిగితే వెంటనే వైద్యం అందించాలి.
జీవనశైలి మార్పుతో రక్షణ
బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు తప్పించుకోవాలంటే జీవనశైలి మార్చుకోవాలి. లక్షణాలు బయటపడగానే ఆసుపత్రికి తరలించాలి. తొలి ఆరు గంటల్లో తీసుకొస్తే త్వరగా కోలుకొనే అవకాశం ఉంది. ఉప్పు రోజులో 3-4 గ్రాములకు మించకుండా వాడాలి. రోజుకు కనీసం 45 నిమిషాలు వారానికి 5 రోజులు వ్యాయామం చేయాలి. వేగంగా నడక, సైక్లింగ్, ఈత, షటిల్, టెన్నిస్ వంటి ఆటలు ఆడొచ్చు. జంక్‌ఫుడ్స్ తినరాదు. ఆహారంలో పండ్లు, కూరగాయలు తీసుకోవాలి.
- డాక్టర్ విజయసారథి, న్యూరోసర్జన్ విభాగాధిపతి, నిమ్స్
కరోనా తర్వాత పెరిగిన కేసులు
కరోనా తర్వాత ఈతరహా కేసులు పెరిగాయి. నాళాల్లో రక్తం గడ్డకట్టడమే ఇందుకు కారణం. యువతలోనూ స్ట్రోక్‌కు గురైన వారున్నారు. దీనివల్ల కొందరు జీవితాంతం వైకల్యం బారిన పడతారు. ముందే మేల్కొంటే ఈ ముప్పు తప్పించుకోవచ్చు. రక్తపోటు, మధుమేహాన్ని నియంత్రణలో పెట్టుకోవాలి. పొగ పూర్తిగా మానేయాలి. ఆల్కహాల్ తగ్గించాలి. కూర్చొనే విధులు నిర్వర్తించేవారు తప్పనిసరిగా రోజూ వ్యాయామం చేయాలి.
- డాక్టర్ ఎం.కమలేశ్, సీనియర్ న్యూరాలజిస్టు, కామినేని
ఇదీ చూడండి : బరువు తగ్గాలా? హై ప్రొటీన్ డైట్ ట్రై చేయండి!