Smart Gadgets To Stay Warm All Winter : ఉష్ణ ప్రాంతం కాబట్టి ఎండ కాస్త ఎక్కువైనా భరించగలం, కానీ నాలుగైదు డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గితే మాత్రం ‘ఇదేం చలిరా బాబూ... చంపేస్తోంది...’ అనుకుంటూ గజగజ వణికిపోతాం. అందుకే ఇప్పుడు చలికాలాన్నీ నులివెచ్చదనంతో హాయిగా గడిపేందుకు ఎన్నో రకాల స్మార్ట్ గ్యాడ్జెట్లు మార్కెట్లోకి వస్తున్నాయి. వాటిలో కొన్ని...
కాంతి చికిత్స!
చలికాలం రాగానే చాలామందికి బద్ధకంగా అనిపించి ఓ పట్టాన నిద్ర లేవరు. మరికొందరినైౖతే సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్(శాడ్) కూడా పట్టి పీడిస్తుంది. అంటే- చిరాకు, ఏకాగ్రత లోపించడం, డిప్రెషన్... వంటి వాటితో బాధపడుతుంటారన్నమాట. దీనంతటికీ కారణం పగటి వేళలు తగ్గిపోయి, ఎండ సరిగ్గా తగలకపోవడమే. అందుకే ఈమధ్య చాలామంది ఆ కాలంలో లైట్ థెరపీలకీ వెళుతున్నారు.
అయితే బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఒంటికి కాస్త డి-విటమిన్ వచ్చేలా కేరెక్స్, ఆరా, ఫిలిప్స్, నార్తర్న్ లైట్ టెక్నాలజీ... వంటి కంపెనీలు సన్ ల్యాంపుల్నీ డిజైన్ చేస్తున్నాయి. ఎండలోకి వెళ్లే తీరిక లేనివాళ్లు కనీసం ఓ అరగంటైనా ఈ సన్ ల్యాంప్ దగ్గర కూర్చోవడంవల్ల అది జీవగడియారాన్ని ప్రేరేపించి ‘శాడ్’ బారిన పడకుండా చేస్తుంది అంటున్నారు. ముఖ్యంగా దీన్నుంచి వెలువడే కాంతి శరీరంలోని సెరటోనిన్ శాతాన్ని పెంచడంవల్ల డిప్రెషన్ రాకుండా ఉంటుందట.
కాఫీ.. చల్లారకుండా..!
ఉదయం లేవగానే వేడి వేడి కాఫీనో టీనో తాగకుండా ఉండలేనివాళ్ల సంఖ్యే ఎక్కువ. అయితే చలికాలంలో మాత్రం కాఫీని కప్పులో పోసుకుని బాల్కనీలోకి వచ్చి కూర్చునేసరికే అది కాస్తా చల్లగా అయిపోతుంటుంది. అదీగాక కొందరికి ఓ చేత్తో న్యూస్ పేపర్ పట్టుకుని మరో చేత్తో కాఫీ మగ్గు పట్టుకుని మెల్లగా కాఫీ తాగుతుంటారు. కానీ చదవడంలో మునిగిపోయి కాఫీ సిప్ చేయడం మర్చిపోతే, కప్పులో మిగిలిన కాఫీ మొత్తాన్నీ చల్లగానే తాగాలి.
ఆ బాధ లేకుండా ఉండేందుకే ఇప్పుడు టీ, కాఫీ వార్మర్స్ వస్తున్నాయి. వీటిమీద కప్పు లేదా మగ్గు పెట్టుకుంటే అది ఎంతసేపయినా వేడిగానే ఉంటుంది. ఆఫీసుల్లోనూ ఇంట్లోనూ వాడుకోగలిగేలా తయారవుతోన్న ఈ కాఫీ వార్మర్స్‌లో టోర్మెటీ, లక్కీ... వంటి కంపెనీలు కప్పుతో సహా వస్తున్నాయి. మరికొన్ని కంపెనీలు స్టీలు, గాజు, పింగాణీ... ఇలా దేంతో చేసిన మగ్ అయినా పెట్టుకునేందుకు వీలుగా కేవలం వార్మర్ ప్లేట్లనే రూపొందిస్తున్నాయి.
కాబట్టి ఇది చెంతన ఉంటే ఎంత మెల్లగా తాగినా కాఫీ చల్లారిపోదు. పోతే, టెక్ టూల్, ఎంబర్... వంటి కంపెనీలు ప్లేటుతో పనిలేకుండా ఎంతసేపయినా వేడిగా ఉంచే ప్రిన్సెస్ ట్రావెల్ మగ్గుల్నీ తీసుకొస్తున్నాయి. వీటిల్లో కావాల్సిన ఉష్ణోగ్రతను సెట్ చేసుకుని వెంట తీసుకెళ్లొచ్చు. సో, కాఫీనీ చివరిబొట్టు వరకూ వేడిగా ఆస్వాదించవచ్చన్నమాట.
తొడుక్కునే దుప్పట్లు!
కొందరు పుస్తకం చదువుతూ నిద్రపోతే మరికొందరు పడుకునేముందు కాసేపు టీవీనో ఫోనో చూస్తుంటారు. అయితే చలికాలంలో ఈ పనులూ చేసేటప్పుడు రగ్గు కప్పుకుని పుస్తకం చదవాలన్నా టీవీ చూడాలన్నా కాస్త ఇబ్బందే. అందుకే రాడిసన్, ద కంఫీ, మలాకొ... వంటి కంపెనీలు తొడుక్కునే బ్లాంకెట్లనీ శాలువాల్నీ తీసుకొస్తున్నాయి. వీటిని తొడుక్కుని హాయిగా ఆయా పనులన్నీ చేసుకోవచ్చన్నమాట.
ఉదయాన్నే వీటితోనే లేచి హాల్లోకి వచ్చి కూర్చుని కాఫీ కూడా తాగొచ్చు. అయితే వాతావరణం మరీ చల్లగా ఉంటే- ఎంత మందపాటి రగ్గు కప్పుకున్నా ఓ పట్టాన నిద్రపట్టదు. అలాంటి పరిస్థితులకి అనుగుణంగా ఎలక్ట్రిక్ బెడ్‌షీట్లనీ రగ్గుల్నీ కూడా తయారుచేస్తున్నాయి అనేక కంపెనీలు. బ్యాటరీతో పనిచేసే ఈ బ్లాంకెట్లలో అవసరాన్ని బట్టి ఉష్ణోగ్రతని సెట్ చేసుకోవచ్చు. కొంతసేపటికి ఆటోమేటిగ్గా స్విచాఫ్ అయిపోవడంతోపాటు ప్లగ్ కార్డ్‌ను తీసేస్తే మిగిలిన కాలాల్లోనూ వాడుకోవచ్చట.
వెచ్చని టోపీతో మధుర గానం!
తలకి మఫ్లర్ చుట్టుకుని ఒంటికి స్వెటర్ వేసుకుని చెవిలో ఇయర్ ఫోన్స్ లేదా పాడ్స్ పెట్టుకుని పాటలు వింటూ వాకింగ్ చేయడం చాలామందికి ఈమధ్య ఓ అలవాటుగా మారింది. అయితే చలికాలంలో మఫ్లర్ చుట్టుకున్నప్పుడు మళ్లీ ఇయర్ ఫోన్స్ పెట్టుకోవాలంటే కాస్త ఇబ్బందే. అందుకే ఇప్పుడు వైర్‌లెస్ టెక్నాలజీతో పనిచేసే స్మార్ట్ హెడ్‌ఫోన్ క్యాప్స్ వస్తున్నాయి.
ఫోన్ ఆప్ ద్వారా పాటల్ని సెలెక్ట్ చేసుకోవడంతోపాటు వాల్యూమ్ పెంచి తగ్గించుకునేందుకు వీలుగా దీనికి బటన్ కూడా ఉంటుంది. క్యాప్‌లోని లిథియం అయాన్ బ్యాటరీ ఆరుగంటలపాటు పనిచేస్తుంది. ఆ తరవాత దీన్ని మళ్లీ యూఎస్‌బీ కేబుల్ ద్వారా ఛార్జ్ చేసుకోవచ్చు. చలికాలంలో వేళ్లు వంకర్లు పోకుండా చేతులకు గ్లోవ్స్ వేసుకుంటారు కొందరు. అయితే ఇవి వేసుకున్నప్పుడు స్మార్ట్ ఫోన్‌ను ఆపరేట్ చేయడం చాలాకష్టం.
అందుకే ఏమాత్రం తడిని పీల్చని పలుచని కార్బన్ మైక్రోఫైబర్లతో గ్లోవ్స్‌ని రూపొందించారు. ఇవి వేసుకుంటే వర్షంలోనే కాదు, మైనస్ డిగ్రీల చలిలోనూ ఫోన్‌ని ఆపరేట్ చేయవచ్చట. మరీ ముఖ్యంగా మోటార్‌సైకిల్, సైకిల్ రైడ్‌లకి వెళ్లేవాళ్లకి ఇవి ఎంతో ఉపయోగపడతాయి అంటున్నారు ఉత్పత్తిదారులు.
నులివెచ్చని సాక్సు:
వాతావరణంలో ఉష్ణోగ్రతలు ఎంత పడిపోయినా పాదాలూ అరిచేతులూ వెచ్చగా ఉంటే చలి అంతగా బాధించదు. అందుకే చాలా మంది ఈ కాలంలో బయటకు వెళ్లినప్పుడే కాదు, పడుకునేటప్పుడూ సాక్సు వేసుకుంటారు. వీటివల్ల పాదాలూ పగలకుండా ఉంటాయి. అయితే ఇప్పుడు సాక్సుని కూడా రీఛార్జబుల్ బ్యాటరీతో పనిచేసేలా తయారుచేస్తున్నారు. మొబైల్ ఆప్ ద్వారా వీటిల్లోని ఉష్ణోగ్రతనీ సెట్ చేసుకోవచ్చట.
పరారుణ కాంతిని గ్రహించడం ద్వారా పనిచేసే ఈ సాక్సు త్వరగా వేడెక్కి రక్త ప్రసరణకు ఇబ్బంది లేకుండా చేస్తాయి. ఆర్థ్రయిటిస్‌తోనూ కీళ్లనొప్పులతోనూ తరచూ ఫ్లూ జ్వరాలతోనూ బాధపడేవాళ్లకి ఇవెంతో మేలు. కేవలం సాక్సు మాత్రమే కాదు, షూలో పెట్టుకునేందుకూ హీటెడ్ ఇన్‌సోల్స్ కూడా దొరుకుతున్నాయి. వీటిని సైతం ఫోన్ ఆప్ ద్వారా ఉష్ణోగ్రతని పెంచుకుంటూ తగ్గించుకుంటూ సరిచేసుకోవచ్చు. తెల్లవారుజామున లేదా రాత్రివేళ బయట తిరిగేటప్పుడూ; హైకింగ్, ట్రెకింగ్‌లకు వెళ్లేవాళ్లకూ ఈ రకమైన సోల్స్ వల్ల చలిబాధ లేకుండా ఉంటుంది.
పట్టుకునే హీటర్లు:
ఎంత చలిగా ఉన్నా స్వెటర్లుగానీ చేతులకి గ్లోవ్స్ గానీ తలకి క్యాప్‌గానీ పెట్టుకోవడం అంటే కొందరికి చికాకు. పిల్లలైతే మరీనూ. కానీ అరిచేతులూ పాదాలకీ మరీ చల్లదనం సోకితే రక్తప్రసరణ సరిగ్గా ఉండదు. అందుకే అరిచేతుల్ని వెచ్చగా ఉంచేందుకు ఇప్పుడు ఈ పోర్టబుల్ హ్యాండ్ వార్మర్స్ వస్తున్నాయి. జేబులో కూడా పట్టే వీలున్న వీటిని అరిచేతిలో పెట్టుకుంటే చాలు, దాన్నుంచి వచ్చే వేడికి రక్తప్రసరణ మెరుగవుతుంది.
వీటిని చేతిలో పెట్టుకుని పడుకోవచ్చు కూడా. మిక్కీ మౌస్, పిల్లి... వంటి బొమ్మలతోనూ రకరకాల ఆకారాలతోనూ వస్తున్న ఈ వార్మర్స్‌ని పట్టుకోవడానికి పిల్లలూ ఇష్టపడతారు. స్విచ్‌ఆన్ చేయగానే సెకన్లలో వేడెక్కే ఈ వార్మర్‌ని ఒకసారి ఛార్జ్ చేస్తే- ఐదు నుంచి పన్నెండు గంటలవరకూ వెచ్చదనాన్ని అందిస్తాయి. పైగా వీటిని ఫోన్, ట్యాబ్ వంటి వాటిని ఛార్జ్ చేసుకునే పవర్ బ్యాంక్‌గానూ వాడుకోవచ్చట. ఒకటికి రెండు పనులన్నమాట. బాగుంది కదూ!
గది వెచ్చగా!
గది ఉష్ణోగ్రత పెరిగి వేడిగా అయ్యేందుకు సెరామిక్ ఫ్యాన్ హీటర్ల నుంచి ఎలక్ట్రిక్ రేడియేటర్స్ వరకూ చాలానే రకాలున్నాయి. అయితే నేలమీద పెట్టే ఈ హీటర్లతో పిల్లలున్న ఇంట్లో కాస్త జాగ్రత్తగానే ఉండాలి. మర్చిపోయి గబాల్న పట్టుకున్నా లేదా పొరబాటున కాలో చెయ్యో తగిలినా కాలుతుంది. అందుకే ఇప్పుడు ప్లగ్‌లోనే పెట్టుకునే పోర్టబుల్ హీటర్లు వస్తున్నాయి. 500 వాట్స్ సామర్థ్యంతో పనిచేసే ఈ హీటర్లని ఎలాంటి వైర్ల సాయం లేకుండా నేరుగా ప్లగ్‌లో పెట్టుకోవచ్చు.
రిమోట్ సాయంతో ఆన్, ఆఫ్ చేసుకోవడంతోపాటు ఉష్ణోగ్రతని తగ్గించి, పెంచుకోవచ్చు కూడా. గది వేడెక్కేవరకూ ఉండి దానంతటదే ఆఫ్ అయిపోయేలా టైమ్ కూడా సెట్ చేసుకోవచ్చు. వీటిల్లోనే గది మొత్తానికి కాకుండా మనం కూర్చున్న చోట వాతావరణం కాస్త వెచ్చగా ఉండేలా చేసే పోర్టబుల్ టేబుల్ టాప్ హీటర్లు కూడా ఉన్నాయి. వీటినైతే మన వెంట ఆఫీసుకీ తీసుకెళ్లి వాడుకోవచ్చన్నమాట.
ఇవీ చదవండి: