Silent Walking Benefits : గుంపుగా వెళ్లడమో ఒంటరిగా ఉంటే ఫోన్‌లో పాటలు వింటూనో లేదంటే యూట్యూబ్ వీడియోలు చూస్తూనో చాలా మంది వాకింగ్ చేస్తుంటారు. ఇలాంటి అలవాటు వల్ల వాకింగ్‌తో జరిగే ప్రయోజనానికి బదులు నష్టమే ఎక్కువంటున్నారు నిపుణులు. ఇద్దరు ముగ్గురితో కలిసి నడిస్తే జరిగే పిచ్చాపాటి వల్ల నవ్వులు, పరిహాసాలు ఎలా ఉన్నా లేనిపోని సమస్యలు వచ్చే అవకాశం ఉందట.
Silent Walking Trend : పదిమందిలో మాట్లాడితే ఏవో రాజకీయాలు, ఇంట్లో సమస్యలు, పాత గొడవలు గుర్తుకు వచ్చి అనసవర ఉద్రేకాలకు లోనుకావాల్సివస్తుందని పరిశోధనల్లో తేలిందట. అదేవిధంగా ఉదయాన్నే గాడ్జెట్లను పట్టుకుని తిరగడం వల్ల మనసు, శరీరం తేలిక కావాల్సిందిపోయి బరువెక్కుతున్నట్లు పరిశోధకుల అధ్యయనంలో తేలిందంటున్నారు.
సైలెంట్ వాకింగ్‌తో చెక్
వాకింగ్‌లో మిగతా డిస్టబెన్స్‌ను అధిగమించేందుకు ఇప్పుడు కొత్తగా సైలెంట్ వాకింగ్ అనే ట్రెండ్ మొదలైంది. ఫోన్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, స్మార్ట్ వాచీలతో సహా ఇతర వస్తువులను పక్కన పెట్టి సింగిల్‌గా ఎవరితో మాట్లాడకుండా మౌనంగా నడవటమే ఈ సైలెంట్ వాకింగ్ ట్రెండ్. మౌనంగా మనతో మనం ఉంటూ నడవడం ద్వారా ధ్యానం చేసినట్లు అవుతోందని అంటున్నారు.
ఆలోచనలకు పదునుపెట్టే సమయం
సైలెంట్ వాకింగ్ వల్ల ఏకాగ్రత పెరురుగుతుందనే భావన వ్యక్తమవుతోంది. మన ఆలోచనలకు ఆ ఆలోచనలను పదును పెట్టుకోటానికి, లక్ష్యంపై దృష్టి నిలపడానికి సైలెంట్ వాకింగ్ ఉపయోగపడుతుందట. ఎల్లప్పుడూ ఎలక్ట్రానిక్ వస్తువులు, మొబైల్‌ఫోన్లలో గడిపేస్తే ఇక కొత్త ఆలోచనలు ఎలా వస్తాయంటున్నారు కొంతమంది సైలెంట్ వాకర్స్. నడకలో అంతరాయం లేకుండా ఉండాలంటే గుంపుగా వెళ్లడం, గాడ్జెట్లను తీసుకెళ్లడం మానేయాలంటున్నారు. 'సైలెంట్ వాకింగ్' రెండు పనులను చేస్తుంది. అందులో మొదటిది మన ఆలోచనలను మనం వినేలా చేయడం. రెండోది ప్రకృతిని ఆస్వాదించడం. సైలెంట్ వాకింగ్ వల్ల తమ ఆరోగ్య స్థితిలోనూ కొంత మార్పు కనిపించినట్లు ఇటీవల ఈ విధానంలోకి మారిన వాకర్లు చెబుతున్నారు.
ఒత్తిడిని జయంచొచ్చు
ఏ కమ్యూనికేషన్ లేకుండా సైలెంట్‌గా రోజూ కనీసం అరగంట పాటు ఏకాంతంగా నడవటమే సైలెంట్ వాకింగ్. దీనివల్ల ఆత్రుత, ఆందోళన వంటి మానసిక సమస్యలు తగ్గుతాయి. దీంతోపాటు ప్రశాంతత కూడా లభిస్తోందని అంటున్నారు. 5 నిమిషాలు ఫోన్ కనిపించకపోతే ఆందోళన చెందేవారు అరగంట ఫోన్ వదిలేస్తే మనసుకు స్వేచ్ఛ లభిస్తుందని క్రమంగా ఈ అలవాటు ప్రశాంత జీవితాన్ని అలవాటు చేస్తుందని అంటున్నారు. మోచేతిలో ఫోన్ ఉన్నంత సేపు పీక మీద కత్తి వేలాడుతున్నట్లు ఆందోళనగా ఉంటుందని ఎప్పుడు ఏ విధమైన ఫోన్ వస్తుందనే భయంతో గడపాల్సి వస్తోందని కొందరు వాకర్స్ చెప్పడం గమనార్హం.
ధ్యానం చేసినట్లే
సైలెంట్ వాకింగ్‌తో ధ్యానంతో కలిగే ప్రయోజనాలు అన్నీ ఉన్నాయి. కిక్కిరిసిన జీవితంలో మనవైన ఆలోచనలకు చోటు ఇచ్చి, సానుకూల ఆలోచనలు చేస్తూ జీవితాన్ని కొనసాగించడమే సైలెంట్ వాకింగ్.
భోజనం చేసిన తర్వాత 100 అడుగులు నడిస్తే మంచిదా ? ఆయుర్వేదం ఏం చెబుతుంది!
వాకింగ్, యోగా- వీటిలో బరువు తగ్గడానికి ఏది బెస్ట్ ఆప్షన్ ? నిపుణుల మాటేంటి!