Salty Food Health Problems : ఉప్పు లేకపోతే రుచి రాదు. అదే సమయంలో ఏం చేయలేని పరిస్థితి తలెత్తుతుంది. వంటకాల రుచికి ఉప్పు ఎంత ముఖ్యమో.. మనం ఆరోగ్యంగా ఉండేందుకు ఉప్పును తగిన మోతాదులో తీసుకోవడం కూడా అంతే ముఖ్యమని పోషకాహార నిపుణులు అంటున్నారు. ఉప్పు అధికంగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండటం చాలా ముఖ్యం. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..
ఉప్పు లేకుండా కూరల్ని చేసుకుంటే అవి రుచించవు. అయితే ఉప్పుతో వంటలకు రుచి వచ్చే మాట వాస్తవమే అయినప్పటికీ ఉప్పును ఎక్కువగా తింటే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. సాధారణంగా ఒక ఆరోగ్యకరమైన వ్యక్తి నిత్యం 3.75 గ్రాముల వరకు ఉప్పు తినొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. అయితే భారతీయులు రోజూ 11 గ్రాముల ఉప్పు తినేస్తున్నారు. ముఖ్యంగా దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాల్లో ఉప్పు వాడకం ఎక్కువ.
ఉప్పు ద్వారా శరీరంలో సోడియం స్థాయి పెరుగుతుంది. కాబట్టి ఉప్పు మోతాదు తగ్గించుకోవడం మంచిది. ప్రస్తుత రోజుల్లో ఎవరి నోట విన్నా ఆహారంలో ఉప్పు వాడకం తగ్గించాలని.. ఉప్పు వాడకం పెరిగితే రక్తపోటు వచ్చి ప్రమాదకర పరిణామాలు ఎన్నో జరుగుతూ ఉంటాయని వింటూ ఉన్నాం. చిటికెడే కదా అని ఉప్పును తేలిగ్గా తీసుకుంటే దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
జంక్ ఫుడ్స్ వద్దు
ఇంట్లో వండకునే కూరల్లో ఉప్పు వాడకం మామూలే. ఇంటి ఆహారం కంటే బయట తినే ఆహారాల్లో ఉప్పు శాతం అధికంగా ఉంటోంది. మనం రోజూ తీసుకోవాల్సిన దాని కంటే ఎక్కువ మోతాదులో ఉప్పును తింటున్నాం. పప్పులు, ఆకుకూరలు సహా చాలా ఆహార పదార్థాల్లో సోడియం అనేది ఉంటుంది. కాబట్టి వండుకునే కూరల్లో 3 నుంచి 5 గ్రాముల (అర చెంచాడు) ఉప్పు తీసుకుంటే సరిపోతుంది. ఇంటి భోజనం కాకుండా ఉప్పు అధికంగా వాడే జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ తీసుకోవడం ఏమాత్రం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
"ఉప్పు శాతం అధికంగా ఉండే జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల శరీరంలో సోడియం స్థాయులు పెరిగిపోతాయి. తద్వారా చిన్న వయసులోనే మధుమేహం, గుండె నొప్పి, కొలెస్ట్రాల్ సమస్యలతో పాటు కాలేయం, మూత్రపిండాల ఆరోగ్యం పైనా తీవ్ర ప్రభావం పడుతుంది. అందుకే రోజువారీ తీసుకునే ఆహారాల్లో ఉప్పు వాడకాన్ని బాగా తగ్గించాలి. శరీరంలో సోడియం లెవల్స్ పెరిగినప్పుడు డీహైడ్రేషన్ కు గురవ్వడం, కాళ్ల వాపులు లాంటివి చూడొచ్చు"
- ప్రముఖ డైటీషియన్ డాక్టర్ శ్రావ్య
వీటికి దూరంగా ఉండాలి
ప్యాక్ చేసిన చిక్కుళ్లు, టిన్నుల్లో అమ్మే ట్యూనా ఫిష్, నిల్వ ఉంచే చేపలు, నిల్వ ఉంచే ఆహారాలు తినకూడదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇవి రక్తంలో సోడియం పరిమాణాన్ని పెంచుతాయి. అప్పడాలు, పచ్చళ్లు, బేకరీ ఐటమ్స్, సాల్టెడ్ చిప్స్ వంటి నిల్వ ఉంచే చిరుతిళ్లు, దీర్ఘకాలం నిల్వ ఉంచేందుకు రూపొందించిన స్నాక్స్ లో ఉప్పు శాతం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వీటికి దూరంగా ఉండాలి. పాలతో చేసిన చీజ్‌లో కొన్ని కంపెనీలు రుచి కోసం ఉప్పు కలుపుతాయి. ఇలాంటి చీజ్‌ను తింటే శరీరంలో సోడియం పెరిగిపోయి హైబీపీ వస్తుంది.
Coffee Face Mask For Health Skin Telugu : కాఫీ స్క్రబ్‌తో ఆ సమస్య దూరం.. మీరూ ఓ సారి ట్రై చేయండి!
Sitting Too Much Side Effects : కదలకుండా అదే పనిగా కూర్చుంటున్నారా? ఆ ఆరోగ్య సమస్యలు గ్యారెంటీ!