అరటి పండులో మెగ్నీషియం, పొటాషియం, పీచు మొదలైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. అయితే అరటి పండును తీసుకునే క్రమంలో కొన్ని మెలకువలు పాటించాలంటున్నారు పోషకాహార నిపుణులు.
అరటి పండును అలా తీసుకోవద్దు!
ఉదయాన్నే ఖాళీ కడుపున కసరత్తులు చేయడం వల్ల శరీరంలోని నీరు చెమట రూపంలో బయటికి వెళ్లిపోతుంది. తద్వారా డీహైడ్రేట్ అవుతాం... అలాగే శక్తినీ కోల్పోతాం. ఈ క్రమంలో కోల్పోయిన శక్తిని తిరిగి కూడగట్టుకోవాలంటే అరటి పండు మంచి ఆహారం. దీనిని మార్నింగ్ డైట్‌లో చేర్చుకోవడం వల్ల మరింత ఉత్సాహంగా వ్యాయామాలు చేయవచ్చు. అదేవిధంగా సాయంత్రం పూట స్నాక్స్ రూపంలో అరటి పండ్లను తీసుకోవచ్చు. కానీ కొన్ని సందర్భాల్లో అరటి పండును తీసుకోకపోవడమే ఆరోగ్యానికి శ్రేయస్కరం.
- రాత్రిపూట సాధ్యమైనంతవరకు అరటి పండును తినకపోవడమే మేలు. అలా తీసుకోవడం వల్ల ఒక్కోసారి జలుబు లాంటి సమస్యలు దరిచేరే అవకాశం ఉంది.
- ఇతర పండ్లతో లేదా పాలతో కలిపి అరటి పండును తీసుకోకూడదు.
- ఉదయం బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్న భోజనం తర్వాత కూడా అరటి పండును తినకూడదు.
- చాలామంది పాలతో కలిపి అరటి పండును తీసుకుంటే, మరికొంతమంది పాలు తాగాక దీనిని తింటుంటారు. అయితే ఈ రెండు పద్ధతులూ ఆరోగ్యానికి అంత మంచిది కాదు.
- సాధారణంగా అరటి పండ్లలో పచ్చివి, పండినవి, బాగా పండినవి... ఇలా రకరకాలుగా ఉంటాయి. అన్నింటిలోనూ పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే అవన్నీ శరీరానికి అందాలంటే మాత్రం కొన్ని మెలకువలు పాటించాల్సిందే. ప్రత్యేకించి తినే సమయం, పండు మగ్గిన స్థాయిని దృష్టిలో పెట్టుకోవాల్సిందే.
మగ్గని అరటి పండు
మీరు స్నాక్స్ కోసం వెతుకుతుంటే, అందులోనూ షుగర్ లెవెల్స్ తక్కువ ఉన్నవి కావాలంటే మగ్గని అరటి పండు మంచి ఆహారం. ఇందులో స్టార్చ్ అధిక మోతాదులో ఉంటుంది. అదేవిధంగా జీర్ణక్రియ రేటును మెరుగుపరిచే ప్రి బయోటిక్స్ సమ్మేళనాలు అధికంగా ఉంటాయి. దీనిని తీసుకోవడం వల్ల త్వరగా ఆకలి తీరుతుంది.
మగ్గిన అరటి పండు
బాగా మగ్గని అరటి పండుతో పోల్చితే ఇది కొంచెం తియ్యగా ఉంటుంది. కానీ తిన్న వెంటనే తేలికగా జీర్ణమవుతుంది. పైగా ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి.
బాగా మగ్గిపోయి మచ్చలున్న అరటి పండు
బాగా మగ్గిపోయి, బ్రౌన్ కలర్ లేదా చాక్లెట్ కలర్ మచ్చలున్న అరటి పండు పై రెండు రకాల పండ్లతో పోల్చితే చాలా తియ్యగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా లభిస్తాయి. ఏదైనా తియ్యగా తినాలనుకునేవారికి ఇలాంటి పండ్లు మంచి ఆహారం.
చూశారుగా.. వివిధ ఆరోగ్య ప్రయోజనాలున్న అరటి పండును ఎప్పుడు, ఎలా తీసుకోవాలో! మరి మీరు కూడా ఈ మెలకువలను పాటించండి. చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోండి.
- ఇదీ చూడండి: రాష్ట్రంలో కరోనా పంజా.. ఒకేరోజు 2909 కేసులు