నిద్ర... శారీరక, మానసిక విశ్రాంతికి అనేది ఎంతో దోహదపడుతుంది. ఇది శరీర ఒత్తిడిని తగ్గించి, శక్తిని పెంచుతుంది. కనీసం రోజుకు 8 గంటల పాటు నిద్రపోవాలని ఆరోగ్య నిపుణులు సూచించారు. ఇలా చేయటం వల్ల రోజంతా ఎంతో ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉంటారన్నది వారి మాట. కానీ ప్రస్తుతం కరోనా మహమ్మారి వల్ల పని ఒత్తిడి పెరిగిపోవటం, ఇతర సమస్యలు తలెత్తడం వల్ల చాలా మంది సరిగ్గా నిద్రపోవటం లేదు. దీంతో చాలా మంది ప్రజలు నిద్రలేమితో బాధపడుతున్నారు.
ఈ సమస్యను ఆయుర్వేదం ద్వారా అధిగమించవచ్చని అంటున్నారు హైదరాబాద్కు చెందిన ప్రముఖ ఏఎండీ ఆయుర్వేద వైద్య కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ రాజ్యలక్ష్మి మాధవం.
శ్వాస తీసుకోవటం, తినటం, తాగటం మనకు ఎంత అవసరమో రోజూ నిద్రపోవటం కూడా అంతే ముఖ్యం. ఇది జీవక్రియలో ఒక ముఖ్యమైన భాగం. నిద్రపోయే సమయంలో శరీర కణజాలాల పునరుజ్జీవం జరగటమే కాకుండా, రోగ నిరోధక శక్తి, శరీరాకృతి మెరుగవుతుంది.
ఆరోగ్యకరమైన నిద్ర అనేది నాలుగు అంశాలపై ఆధారపడి ఉంటుంది.
- రోజువారీగా నిద్రపోయే సమయం
- సరైన సమయంలో పడుకోవటం
- సరైన కాలక్రమాన్ని పాటించటం
- నాణ్యమైన నిద్ర
రోజూ 7-9 గంటల పాటు నిద్రపోవటం వల్ల ఎంతో ఆరోగ్యం ఉంటామని డాక్టర్ రాజ్యలక్ష్మి తెలిపారు. దీని వల్ల శారీరకంగా, మానసికంగా ఎంతో ఉత్సాహంగా ఉండవచ్చని చెప్పారు.
నిద్రలేమితో సమస్యలు..
రోజు సరిగా నిద్ర పోకపోవటం వల్ల ఎన్నో సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా కొవిడ్-19 ఉన్న ఇటువంటి తరుణంలో నిద్ర లేకపోవడం వల్ల కలిగే అన్ని ఇతర నష్టాలతో పాటు, మన రోగనిరోధక శక్తి కూడా క్షీణిస్తుంది. శరీరంలో సహజంగా సైటోకీన్స్ అనే ప్రోటీన్ల ఉత్పత్తి అవుతుంది. వైరస్, బ్యాక్టీరియాలు ప్రవేశించినప్పుడు లేదా వ్యాధి బారిన పడినప్పుడు రోగనిరోధక శక్తిని నియంత్రించటంలో సైటోకిన్లు ఎంతగానో దోహదపడతాయి. నిద్ర లేమి సమస్య ఈ ప్రక్రియకు ఆటంకం కలిగిస్తుంది. అంతేకాకుండా టీ-కణాలు, తెల్లరక్త కణాల పనితీరుపై ప్రభావం చూపుతుంది.
సరైన నిద్ర కోసం...
- వేసవి కాలంలో పగటిపూట నిద్ర పోవటం మానుకోవాలి.
- పగటిపూట నిద్ర రాకుండా ఉండటం కోసం ధ్యానం, ప్రాణాయామం, యోగా వంటి చేయటం ఉత్తమం.
- మంచి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. నిద్ర పోవటానికి 6 గంటల ముందు వరకు ఆల్కహాల్, కెఫీన్, నికోటిన్ వంటి వాటికి దూరంగా ఉండాలి. 2-3 గంటల ముందే తేలికపాటి భోజనం తీసుకోవాలి.
- పాటలు వినడం, ఎల్లప్పుడు మనసును ప్రశాంతంగా ఉంచుకోవటం, ఒత్తిడికి దూరంగా ఉండటం వంటి ఎంతో మేలు కలిగిస్తాయి.
- రోజూ గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి
- కంప్యూటర్, చరవాణులకు దూరంగా ఉండాలి.
ఇలా చేయటం ద్వారా నిద్రలేమి సమస్య నుంచి దూరం కావచ్చని, అలాగే మందులు వేసుకునే బాధ నుంచి ఉపశమనం పొందవచ్చని అంటున్నారు రాజ్యలక్ష్మి.
ఇదీ చూడండి:రష్యా టీకాపై ఇప్పుడే ఏమీ చెప్పలేం: ఎయిమ్స్