ఇలా చేస్తే కళ్లు రిలాక్సవుతాయి!
‘ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో మీ కళ్లను ఎందుకు అలసటకు గురిచేస్తారు. ఈ సమస్యను తగ్గించి కళ్లు రిలాక్సయ్యే అద్భుతమైన చిట్కాలు కొన్నున్నాయి. అలాంటిదే ఇది..’ అనే క్యాప్షన్‌తో ఇన్‌స్టాలో ఓ వీడియోను పోస్ట్ చేసింది రవీనా. ఆ వీడియోలో భాగంగా.. ‘పాఠశాలలన్నీ మూతపడడంతో పిల్లలు కంప్యూటర్‌తోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. మరికొంతమంది వర్క్ ఫ్రమ్ హోమ్‌లో భాగంగా నిరంతరం కంప్యూటర్ ముందే కూర్చోవాల్సి వస్తోంది. దీంతో కళ్ల మీద ఒత్తిడి పడి కళ్లు అలసటకు గురయ్యే అవకాశం ఉంటుంది. అలాగే కళ్ల కింద నల్లటి వలయాలూ ఏర్పడతాయి. మరి, ఈ సమస్య నుంచి బయటపడాలంటే.. ఒక చిన్న గిన్నెలో చల్లటి పాలు తీసుకొని అందులో రెండు కాటన్ ప్యాడ్స్ ముంచాలి. ఆపై పాలను పూర్తిగా పిండేసి.. ఆ చల్లచల్లటి ప్యాడ్స్‌ని కనురెప్పలపై ఉంచాలి. ఇలా పలుమార్లు చేయడం వల్ల కంటి అలసటను తగ్గించుకోవచ్చు.. అలాగే కళ్ల కింద ఏర్పడిన నల్లటి వలయాలూ మాయమవుతాయి.. కళ్లు తేమను సంతరించుకుంటాయి..’ అంటూ చక్కటి చిట్కాను అందించిందీ కూల్ బ్యూటీ.
ఈ చిట్కాలు పాటించండి!
ప్రస్తుత పరిస్థితుల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా, ఆన్‌లైన్ క్లాసెస్ అయినా.. కంప్యూటర్/ల్యాప్‌టాప్/మొబైల్స్‌తోనే ఎక్కువ సమయం గడపాల్సి ఉంటుంది. కాబట్టి ఈ క్రమంలో కళ్లు అలసిపోకుండా, ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటించాలంటున్నారు నిపుణులు. అవేంటంటే..!
- 20-20-20 సూత్రాన్ని తప్పనిసరిగా పాటించండి. ప్రతి ఇరవై నిమిషాలకోసారి ఇరవై సెకన్ల విరామం తీసుకోండి. ఆ సమయంలో 20 మీటర్ల దూరంలో ఉన్న వస్తువుపై మీ దృష్టిని కేంద్రీకరించండి. లేదా గంటకు అయిదు నిమిషాల పాటు మీ కళ్లకు తగినంత విశ్రాంతినివ్వండి.
- విశ్రాంతి తీసుకొనే సమయంలో కళ్లను సవ్య, అపసవ్య దిశల్లో గుండ్రంగా తిప్పాలి. లేదంటే కళ్లను మూసి ఉంచాలి.
- చాలామంది కనురెప్ప వేయకుండా కళ్లు పెద్దవి చేసి మరీ స్క్రీన్ వైపు చూస్తూ ఉంటారు. ఇలా చేస్తే కళ్లు పొడిబారి, మంట పెడతాయి. అందుకే తరచుగా రెప్పలు వాల్చుతూ ఉండాలి. ఒకవేళ కళ్లు తరచూ పొడిబారుతూ ఉంటే వెంటనే నేత్రవైద్య నిపుణులను సంప్రదించి ఐడ్రాప్స్ తీసుకోవడం మంచిది.
- కళ్లు, మానిటర్ పైభాగం ఒకే ఎత్తులో ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల మానిటర్ మధ్య భాగానికి, కళ్లకు 15 నుంచి 20 డిగ్రీల కోణం ఉంటుంది. ఫలితంగా కళ్లు ఎటువంటి ఒత్తిడికి గురవ్వవు.
- కళ్లకు, కంప్యూటర్ స్క్రీన్‌కు మధ్య కనీసం 22 నుంచి 28 అంగుళాల దూరం ఉండాలి.
- దుమ్ము, ధూళి లేకుండా స్క్రీన్‌ను తరచూ శుభ్రం చేసుకోవాలి.
- మానిటర్‌పై వెలుగు పడకుండా ఉండాలి. అలా కుదరని పక్షంలో కిటికీలు, తలుపుల నుంచి స్క్రీన్‌పై నేరుగా వెలుతురు పడకుండా కర్టెన్లు ఉపయోగించాలి.
- అలాగే స్క్రీన్ బ్రైట్‌నెస్, కాంట్రాస్ట్ మన కంటికి సరిపోయే రీతిలో అమర్చుకోవాలి.
- కళ్లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పనిచేయడానికి వీలుగా లభించే యాంటీ రిఫ్లెక్టివ్ కళ్లద్దాలను ఉపయోగించవచ్చు. ఈ విషయంలో వైద్యుని సలహా తప్పనిసరి.\
- గదిలో ప్రసరిస్తున్న వెలుగుకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కలర్ సెట్టింగులను మార్చే సాఫ్ట్‌వేర్‌లను కంప్యూటర్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవాలి. వీటి వల్ల గది వెలుతురుకు అనుగుణంగా స్క్రీన్ బ్రైట్‌నెస్, కాంట్రాస్ట్ మారుతూ ఉంటాయి. ఫలితంగా కళ్లపై ప్రతికూల ప్రభావం పడకుండా జాగ్రత్తపడచ్చు.
- సాధ్యమైనంత వరకు ఫాంట్ సైజు పెంచుకోవాలి.
- ముఖానికి ఎదురుగా ఫ్యాన్ పెట్టుకోవద్దు. గాలి వల్ల కూడా కళ్లు తొందరగా పొడిబారిపోయే అవకాశం ఉంటుంది.
- కంప్యూటర్‌పై ఎక్కువ సమయం పనిచేసేవారు కాంటాక్ట్ లెన్సులను ఉపయోగించకపోవడం ఉత్తమం. ఎందుకంటే వాటివల్ల కూడా కళ్లు పొడిబారే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.
- కంటి ఆరోగ్యం విషయంలో ఆహారం కూడా కీలకమే. ఈ క్రమంలో బీటా కెరోటిన్ అధికంగా ఉండే క్యారట్స్, చిలగడదుంప, ఆకుకూరలు; లైకోపీన్ ఎక్కువగా లభించే టొమాటో, జామ పండ్లు, ద్రాక్ష పండ్లు.. వంటివి రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి. అలాగే డాక్టర్ సలహా మేరకు విటమిన్-ఎ సప్లిమెంట్స్ వాడాలి.