హిల్సాచేప ఇంటికొస్తే ఆ చేపని ఎన్ని రకాలుగా వండవచ్చో అన్ని రకాలుగానూ వండటానికి ప్రయత్నిస్తారు బెంగాలీ ఇల్లాళ్లు. సగం ఆవపెట్టి వండితే.. తక్కిన సగం ఆవిరిమీద వండే భాపా వండాలా? పులుసు పెట్టాలా అని ఆలోచిస్తారు. ఆ చేప చేతికి చిక్కాలే కానీ.. బోలెడు రకాల వంటకాలు చేయడానికి సిద్ధంగా ఉంటారు. వెండి రంగులో మిసమిసలాడిపోతూ సముద్రం నుంచి నదిలోకి వచ్చే హిల్సా లేదా ఇల్లిష్ చేపలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి పద్మారకం. రెండోది గంగానదిలో దొరికే కోలాఘాట్ రకం. మొదటి రకాన్ని బంగ్లాదేశ్ నుంచి వచ్చిన కాందిశీకులు ఇష్టంగా తింటే కోలాఘాట్ రకాన్ని బెంగాలీలు ఇల్లిష్ మచ్చో అని పిలుచుకుంటూ పూజల్లో నైవేద్యంగా కూడా పెడతారు. హిల్సాతో పోష్తో ఇల్లిష్, భాపా ఇల్లిష్, భాజా, పాటూరీ, బిర్యానీ వంటివన్నీ చేసుకుంటారు.
కావాల్సినవి:
హిల్సా చేపముక్కలు- కేజీ, నల్ల ఆవాలు- చెంచా, మామూలు ఆవాలు- చెంచా, పచ్చిమిర్చి- మూడు, అల్లం- కొద్దిగా, ఆవనూనె- మూడుచెంచాలు, ఉప్పు- తగినంత
తయారీ:
చేపముక్కలని శుభ్రం చేసి పసుపు, ఉప్పు పట్టించి పక్కన పెట్టుకోవాలి. ఆవాలు, పచ్చిమిర్చి, అల్లం, ఉప్పు, పసుపు వేసి అన్నింటిని మెత్తని పేస్ట్‌లా రుబ్బుకోవాలి. ఒక పాన్‌లో చేపముక్కలు ఉంచి.. వాటికి ముందుగా రుబ్బి సిద్ధం చేసుకున్న ఆవ మిశ్రమాన్ని చేపకి దట్టంగా పట్టించాలి. ఆ ముక్కలపై నుంచి ఆవనూనె పోసుకోవాలి. ఇప్పుడు కుక్కర్‌లో రెండు గ్లాసుల నీళ్లు పోసుకుని అందులో ఈ చేపముక్కలున్న పాన్‌ని ఉంచి విజిల్ పెట్టకుండా మూతపెట్టేయాలి. ఆవిరి మీద పదినిమిషాల్లో చేప ఉడుకుతుంది.
ఇవీ చదవండి: నోరూరించే బెంగాలీ 'ఫిష్ పటూరి'.. ట్రై చేస్తే పోలా?