'పోర్న్ అడిక్షన్..' ప్రపంచంలోని ఎంతోమందిని వేధిస్తున్న సమస్య ఇది. ఇతర వ్యసనాలు ఏమున్నా చెప్పుకోవచ్చు కానీ.. చాలా మంది పోర్న్ అడిక్షన్ సంగతిని బయటపెట్టేందుకు సిగ్గుపడుతూ ఉంటారు. ఈ వ్యసనం నుంచి విముక్తి పొందాలనుకుంటూనే.. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలోకి కూరుకుపోతారు. చివరకు ఎవరితోనూ చెప్పుకోలేక మానసికంగా కుంగిపోతారు.
మద్యం, డ్రగ్స్‌లాగే.. పోర్న్ అడిక్షన్‌ను మానసిక వ్యాధిగా గుర్తించేందుకు అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్(ఏపీఏ) నిరాకరించింది. అయినప్పటికీ మనిషి జీవితంలో ఇది సృష్టించే అనర్థాలు అన్నిఇన్నీ కావు!
ఏదైనా వ్యసనంతో ఎప్పటికైనా చిక్కులు తప్పువు. అశ్లీల వీడియోలు చూసే వ్యసనంతో ఇది ఎక్కువే. పరిస్థితి చేయి దాటిపోతుంది. మరి అలాంటి సమయంలో ఏం చేయాలి? పోర్న్ అడిక్షన్ నుంచి ఎలా బయటపడాలి?
కారణాలు..
ఓ మనిషి పోర్న్‌కు బానిస ఎలా అవుతాడనేది చెప్పడం కష్టం. ఒంటరితనాన్ని, ఒత్తిడిని జయించడానికి పలువురు అశ్లీల వీడియోలు చూడటం మొదలుపెడతారు. మానసిక ఇబ్బందులు, జీవిత బంధాల్లో సమస్యలు, శృంగార సమయంలో ఎవరు ఎలా ఉంటారు? ఆ సమయంలో ఎలా ప్రవర్తించాలి? వంటి విషయాలు తెలుసుకోవడానికి ఆసక్తిగా ఉండటం కొన్ని కారణాలు. ఇంకొందరైతే సరదాగా చూడటం అలవాటు చేసుకుంటారు.
తొలినాళ్లలో ఆ ప్రపంచం అంతా అద్భుతంగానే ఉంటుంది. అదే అలవాటుగా మారిపోతుంది. పరిస్థితి తమ చేతుల్లోనే ఉంది అనుకుని భ్రమపడుతూ ఉంటారు. కానీ అప్పటికే అది రోజువారీ జీవితంలో ఓ భాగమైపోతుంది.
సంకేతాలు ఇవే..
- అశ్లీల వీడియోలు చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేకపోవడం. రిస్క్ చేసి మరీ పని ప్రదేశాల్లో చూడటం.
- శృంగార జీవితం అసంతృప్తిగా అనిపించడం.
- పోర్న్ చూస్తూ ఇతర బాధ్యతలను విస్మరించడం.
- చూసినంత సేపు ఆనందిస్తూ.. ఆ తర్వాత సిగ్గుపడటం.
- అశ్లీల వీడియోలు చూసేందుకు భారీగా ఖర్చుపెట్టడం.
- బాధ, నిద్రలేమి, ఇతర మానసిక ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి పొందేందుకు పోర్న్‌ను ఓ మాధ్యమంగా వినియోగించుకోవడం.
పరిష్కారమేంటి?
పోర్న్ అడిక్షన్ నుంచి విముక్తి పొందేందుకు సరైన చికిత్స లేదు. కానీ సొంతంగా కొన్ని పాటిస్తే ఈ వ్యసనం నుంచి దూరంగా ఉండొచ్చు.
- రిలేషన్షిప్ కౌన్సిలింగ్: కౌన్సిలింగ్ ద్వారా శృంగారానికి సంబంధించిన సమస్యలు పరిష్కారమవుతాయి. ఫలితంగా సమస్యల గురించి చెప్పుకునే విధంగా భాగస్వామిపై నమ్మకం పెరుగుతుంది.
- సైకోథెరపీ: మీలో పోర్న్ అడిక్షన్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవాలి. మానసిక ఇబ్బందిని అధిగమించేందుకు కృషి చేయాలి.
- జీవనశైలిలో మార్పులు: ఒక్కోసారి.. మీ జీవనశైలి కూడా మీరు అశ్లీల వీడియోలు చూసే వ్యసనానికి కారణమయ్యే అవకాశముంది. చాలా ఖాళీగా ఉంటే పోర్న్వైపు ఆలోచనలు మళ్లుతాయి. అందువల్ల ఎప్పటికప్పుడు బిజీగా ఉండేట్టు చూసుకోవాలి. మీకు నచ్చిన పని చేస్తే ఇతర వాటిపై ఆలోచనలు ఉండవు.
'పోర్న్ అడిక్షన్'కు వయసుతో సంబంధం ఉండదు. జీవితాలపై తీవ్ర ప్రభావం కూడా పడుతుంది. అందువల్ల.. నిర్లక్ష్యం చేయకుండా సంకేతాలు కనిపించిన వెంటనే జాగ్రత్త పడితే మంచిది. అవసరమైతే వైద్యుల సహాయాన్ని కూడా తీసుకోవచ్చు.
ఇదీ చూడండి:- మర్మాంగాన్ని శుభ్రం చేసుకోకపోతే.. ప్రమాదమే!