నెలసరి అనేది మహిళల జీవితంలో అంతర్భాగమే. అయినప్పటికీ చాలా మంది దీని గురించి బహిరంగంగా మాట్లాడేందుకు వెనకాడుతుంటారు. తోటి మహిళలతో కూడా నెలసరి సమస్యల గురించి చెప్పుకునేందుకు ఇబ్బందిగా భావిస్తుంటారు. పీరియడ్స్ సమయంలో మూఢనమ్మకాలు, అపోహలతో ఇబ్బందులు పడుతుంటారు. అలాగే పూర్వ కాలం నుంచి బహిష్టు సమయంలో మహిళలను అపవిత్రంగా భావిస్తున్నారు. వారు ఫలానా పనులు చేయాలి, ఫలానా పనులు చేయకూడదు అంటూ అనవసర నిబంధనలు విధిస్తుంటారు. ముఖ్యంగా వారిని ముట్టుకోరాదని చెబుతుంటారు. అయితే బహిష్టు సమయంలో ఉండే అపోహలు నిజమో కాదో నిపుణులు ద్వారా ఓ సారి తెలుసుకుందాం.
'నెలసరి సమయంలో మహిళలను వంటగది, పూజ గదిలోకి రానివ్వరు. అలాగే ఆలయ ప్రవేశం ఉండదు. పడక గదిలో నిద్రపోనివ్వరు. భోజనం విషయంలోనూ షరతులు పెడుతుంటారు.' అయితే రుతుస్రావం సమయంలో పెద్దలు చెప్పే ఈ నియమాల్లో మూఢ నమ్మకాలు ఉన్నాయని.. ఇవన్నీ అపోహేలేనని గైనకాలజిస్ట్ అంజనా సింగ్ చెబుతున్నారు.
మూఢనమ్మకాలను పక్కనపెట్టి శాస్త్రీయంగా ఆలోచించి.. మహిళలకు అండగా నిలబడితే రుతుక్రమంలో వారు ఎదుర్కొనే సమస్యలను తగ్గించవచ్చని గైనకాలజిస్ట్ అంజనా సింగ్ సూచిస్తున్నారు. రుతుస్రావంపై ప్రజల్లో ఉన్న అపోహలు, అనుమానాలు, మూఢనమ్మకాలు గురించి ఆమె క్లుప్తంగా వివరించారు. పీరియడ్స్ సమయంలో మహిళల రక్తం బయటకు వస్తుందని.. ఆ రక్తాన్ని అపరిశుభ్రమైనదిగా భావిస్తారని అంటున్నారు అంజనా సింగ్.
'పీరియడ్స్ సమయంలో మహిళలను వంటగది, ఆలయాల్లోకి రానివ్వరు. అలాగే పచ్చళ్లు ముట్టుకోనివ్వరు. ఒకవేళ వాళ్లు కనుక పచ్చడిని ముట్టుకుంటే అవి పాడైపోతాయని నమ్ముతారు. బహిష్టు అయిన ఆడవాళ్లను మసాలా ఆహారాలు తిననివ్వరు. ఈ సమయంలో వేడినీళ్లతో స్నానం చేయనివ్వరు. తలస్నానం కూడా చేయొద్దంటారు. మంచం మీద పడుకోవద్దు. శృంగారం పాల్గొవద్దు.' ఇలాంటి నియమాలను పెడతారని గైనకాలజిస్ట్ అంజనా సింగ్ తెలిపారు.
పీరియడ్స్ సమయంలో ఇలాంటి ఎన్నో మూఢనమ్మకాలు, ఆచారాలను పాటిస్తూ మహిళలు చాలా ఇబ్బందులు పడుతున్నారని వైద్యురాలు అంజనా సింగ్ తెలిపారు. పీరియడ్స్‌కు, దైవ నమ్మకాలకు ముడిపెట్టడం సరికాదన్నారు ఆమె అంటున్నారు. మహిళల జీవితంలో పునరుత్పత్తికి నెలసరి అనేది చాలా ముఖ్యమైన అంశమని ఆమె చెప్పారు. బహిష్టు సమయంలో వచ్చే రక్తాన్ని అపరిశుభ్రమైనదిగా లేదా కలుషితమైనదిగా చూడటం సరికాదన్నారు.
"ప్రతి నెలలో మహిళల గర్భాశయంపై హార్మోన్ల వల్ల ఒక పొర ఏర్పడుతుంది. మహిళలు గర్భం దాల్చేంత వరకు ప్రతి నెలా ఈ పొర విచ్ఛిన్నమై రక్తస్రావం రూపంలో శరీరం నుంచి బయటకు వస్తుంది. మహిళలు గర్భం దాల్చినప్పుడు ఈ ప్రక్రియ ఆగుతుంది. అలాంటప్పుడు రుతుస్రావం సమయంలో స్త్రీలను ఆలయాల్లోకి రానివ్వకపోవడం మూఢనమ్మకమే. పీరియడ్స్ సమయంలో మహిళలు వ్యాయామం చేయొచ్చు. ఎక్సర్సైజ్ చేయడం వల్ల వారికి రిలీఫ్ లభిస్తుంది. అలాగే కండరాలు కూడా బలంగా, ఆరోగ్యంగా తయారవుతాయి. వ్యాయామం వల్ల మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. రుతుక్రమం సమయంలో వేడినీళ్లతో స్నానం చేయాలి. అప్పుడే ఒంట్లో నలత, నొప్పులు తగ్గుముఖం పడతాయి. బహిష్టు సమయంలో ఫలానా పనులు చేయాలని ఏమీ లేదు. ఒంట్లో ఓపిక ఉంటే ఏ పనైనా చేయవచ్చు. నెలసరి సమయంలో మసాలాలు లేని సాధారణ ఆహారం తీసుకోవడం మేలు. ఎందుకంటే మసాలా లేని ఆహారం వేగంగా జీర్ణం అవుతుంది. శీతల పానీయాలు, చల్లటి భోజనం తీసుకోవడం వల్ల మహిళల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది."
- అంజనా సింగ్, గైనకాలజిస్ట్
'పీరియడ్స్ సమయంలో శృంగారంలో పాల్గొనాలా? వద్దా అనే మహిళ, ఆమె భర్త ఇష్టంపై ఆధారపడి ఉంటుంది. వారికి శృంగారం చేయాలనిపిస్తే చేయొచ్చు. దీని వల్ల మహిళలకు ఆరోగ్యపరంగా ఎటువంటి హాని లేదు. నెలసరి సమయంలో శృంగారంలో పాల్గొంటే కడుపు నొప్పి నుంచి మహిళలకు కొంత ఉపశమనం లభిస్తుంది. అలాగే మూఢనమ్మకాలను పక్కనపెట్టి బహిష్టు సమయంలో కూడా సాధారణ రోజుల్లో ఉన్నట్లే ఉండటాన్ని మహిళలు అలవాటు చేసుకోవాలి. ఆ సమయంలో వారికి లేనిపోని నిబంధనలు పెట్టి ఇబ్బందులకు గురిచేయకూడదు' అని నిపుణులు చెబుతున్నారు.