Parenting tips :అమ్మానాన్న ఏం తింటున్నారన్నది పిల్లలు గమనిస్తూ ఉంటారు. అది ఆరోగ్యానికి మంచిదా కాదా అనే అవగాహన ఆ వయసులో ఉండదు. నచ్చిన ఆహారాన్ని ఎక్కువ మోతాదులో పెద్దవాళ్లు తీసుకోవడాన్ని గుర్తిస్తే, తమకూ అదే కావాలంటారు. నువ్వు చిన్నవాడివి, తినకూడదు అంటే వాళ్లకర్థం కాదు. అమ్మానాన్న తింటూ, మమ్మల్ని ఎందుకు వద్దంటున్నారనే ఆలోచన మొదలవుతుంది. దాంతో వారు తీసుకోవాల్సిన ఆహారంపై అనాసక్తి పెంచుకొనే ప్రమాదం ఉంది. ఇలాకాకుండా ఉండాలంటే బాల్యం నుంచి పోషకాహార విలువలు నేర్పాలి. అంటే.. వాటిని ముందుగా పెద్దవాళ్లు పాటించాలి.
అవగాహన: ఆహారాన్ని వారికి నచ్చేలా ఇవ్వడానికి ప్రయత్నించాలి. ఏ వయసుకు ఎటువంటి పోషకాలు అవసరమవుతాయో వారికి అవగాహన కలిగించాలి. ఆయా కాలాలను బట్టి తాజా కూరగాయలు, పండ్లు ఆహారంలో తప్పని సరి అనేది అలవరచాలి. పాల ఉత్పత్తులు, మాంసాహారం ద్వారా శరీరానికి అందే విటమిన్లు, ప్రొటీన్లు, ఖనిజ లవణాల గురించి చెప్పాలి. వారాంతాల్లో వంటలో, కూరగాయలు కట్ చేయడంలో పిల్లలను భాగస్వాములను చేయాలి. ‘మా అబ్బాయి పెరుగు తినడు, అమ్మాయి చిన్నప్పటి నుంచి గుడ్డు వద్దంటుంది’ అంటే, అందుకు పెద్దవాళ్లే కారణం కావొచ్చు. అమ్మానాన్న అన్నీ తింటుంటే పిల్లలూ వాటికి అలవాటుపడతారు.
అందం కాదు: పాఠశాల లేదా స్నేహితుల ప్రభావంతో సన్నగా ఉంటేనే అందమనే అపోహ యుక్త వయసుకొచ్చే సరికి పిల్లల్లో కలుగుతుంది. ఇంట్లో పెద్దవాళ్లు డైటింగ్ పేరుతో తిండికి దూరంగా ఉండటం గమనిస్తే, తామూ అలా మారాలని ఆలోచిస్తారు. క్రమేపీ ఆహారాన్ని తగ్గిస్తారు. చదువు, ఆటలు, కెరియర్ అంటూ ఉత్సాహంగా ఉండాల్సిన వయసులో నిస్సత్తువగా మారతారు. ఆరోగ్య కరమైన ఆహారాన్ని తీసుకొంటూ వ్యాయామాలతో ఫిట్‌గా ఉండొచ్చనే అవగాహన పిల్లలకు రావాలంటే అమ్మా నాన్న ఆచరించి చూపాలి. దీంతో పెద్దవాళ్లనూ అధిక బరువు సమస్య బాధించదు. కుటుంబమంతా ఆరోగ్యంగా ఉండొచ్చు.
ఇవీ చదవండి: