గుండె పోటు నుంచి మెరుగ్గా కోలుకోవడంలో సాయపడే ఒక వినూత్న పట్టీని అమెరికా పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఇందులో ప్రత్యేకంగా రూపొందించిన చిన్నపాటి రక్తనాళాలు ఉంటాయి. ఎలుకలపై వీటిని ప్రయోగించినప్పుడు అద్భుతంగా పనిచేసినట్లు తేలింది.
ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా మరణాలకు గుండె జబ్బులే ప్రధాన కారణమవుతున్నాయి. గుండె పోటు వచ్చిన ప్పుడు రక్త నాళంలో పూడిక ఏర్పడి, గుండె కణాలకు ఆక్సిజన్ అందదు. ఫలితంగా భారీగా కణాలు మృతి చెందడం, రక్త నాళాల్లో లోపాలు, ఇన్ఫ్లమేషన్ తలెత్తుతాయి. గుండెపోటుకు సమర్థ చికిత్స చేయాలంటే గుండె కండర కణాలకు ఆక్సిజన్, పోషకాలను చేరవేయడానికి రక్తనాళాలు ఏర్పడాలి.
ఇందుకోసం ప్రత్యేక కణాలు కలిగిన పట్టీలను తయారుచేయడానికి శాస్త్రవేత్తలు చాలాకాలంగా ప్రయత్నించారు. కె చెంగ్ నేతృత్వంలోని పరిశోధకులు సఫలీకృతులయ్యారు. వీరు ఒక ఫైబ్రిన్ జెల్పై గుండెకు సంబంధించిన సోమల్ కణాలను ఉంచారు. వాటిపై ప్రత్యేకంగా రూపొందించిన సూక్ష్మ రక్తనాళాలను అమర్చారు. గుండె పోటు వచ్చిన ఎలుకలకు వీటిని అమర్చినప్పుడు.. ఈ పట్టీలోని కణాలు స్పందించాయి. గుండె కండరం, రక్తనాళాలు తిరిగి వృద్ధి చెందేలా ప్రేరణలు కలిగించాయి.
ఇదీ చూడండి:దేశంలో 10.65 కోట్లు దాటిన కరోనా టెస్టులు