జీవనశైలి వ్యాధులు రాష్ట్రాన్ని కమ్మేస్తున్నాయి. ముఖ్యంగా అధిక రక్తపోటు, మధుమేహ సమస్యలతో బాధపడే వారు ఎక్కువ సంఖ్యలో ఉంటున్నారు. చిన్న వయసులోనే ఈ వ్యాధుల బారిన పలువురు పడుతున్నారని నిపుణులు పేర్కొంటున్నారు. ఏపీ వైద్య ఆరోగ్య శాఖ గత ఏడాది సెప్టెంబరు, అక్టోబరు నుంచి 39 సంవత్సరాలపైబడిన వారిని సర్వే చేసింది. ఇప్పటివరకు 1.75 కోట్ల మంది నుంచి వివరాలు సేకరించగా వీరిలో 8% మంది రక్తపోటుతో, 6% మంది మధుమేహంతో బాధపడుతున్నారని గుర్తించారు.
తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 23.73 లక్షల మందికి... మిగిలిన జిల్లాల్లో 9 లక్షల నుంచి 18 లక్షల మందికి పరీక్షలు జరిగాయి. కొందరికి రక్తపోటు, మధుమేహం వచ్చిందని ఈ పరీక్షల అనంతరమే తేలింది. వారికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయిలో వైద్యం అందించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రాథమిక దశలోనే చికిత్స అందిస్తే ఉత్తమ ఫలితాలు కనిపిస్తున్నాయని పేర్కొంటున్నారు. కేంద్రం కూడా నిర్వహించిన కుటుంబ ఆరోగ్య సర్వేలోనూ జీవనశైలి వ్యాధులతో బాధపడే వారు ఎక్కువగా ఉన్నారని తేలింది.
మధుమేహం: మొత్తం 12 లక్షల మంది మధుమేహ వ్యాధితో బాధపడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో 23.73 లక్షల మందిని పరీక్షిస్తే..1,80,383 మంది మధుమేహంతో బాధపడుతున్నారని తేలింది. పశ్చిమగోదావరిలో 1.51 లక్షలు, గుంటూరులో 1.41 లక్షలు, ప్రకాశం జిల్లాలో 1.14 లక్షల మంది ఉన్నారని గుర్తించారు.
రక్తపోటు: పరీక్ష చేసిన వారిలో గరిష్ఠంగా తూర్పుగోదావరి జిల్లాలో 11.49%, పశ్చిమగోదావరిలో 11.28%, ప్రకాశంలో 10.55% మంది రక్తపోటుతో బాధపడుతున్నారు. కనిష్ఠంగా అనంతపురంలో 5.34%, చిత్తూరులో 7.11% కడపలో 7.49%, విశాఖపట్నం జిల్లాలో 7.53% మంది చొప్పున ఉన్నారు.
క్యాన్సర్: 1.75 కోట్ల మందిలో సుమారు 55 వేల మంది క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. తూర్పుగోదావరిలో 8వేలు, విశాఖపట్నం, అనంతపురం జిల్లాల్లో ఐదువేల మంది చొప్పున ఉన్నారు.
రక్తహీనత: ఐదు నుంచి 19 ఏళ్ల బాలబాలికలను, 20 నుంచి 49 సంవత్సరాల మధ్య మహిళలను పరీక్షించగా 54.95% మంది రక్తహీనతతో బాధపడుతున్నారని గుర్తించారు. స్వల్ప స్థాయిలో బాధపడుతున్న వారు 75 లక్షల మంది, తీవ్ర స్థాయిలో ఉన్నవారు 1.50 లక్షల మంది ఉన్నారు. తీవ్ర రక్తహీనతతో బాధపడే వారు చిత్తూరు, అనంతపురం, కర్నూలు, నెల్లూరు, విశాఖపట్నం, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాల్లో ఎక్కువగా ఉన్నారు. 13వేల నుంచి 20వేల మంది... తక్కువగా శ్రీకాకుళం, విజయనగరం, కడప జిల్లాలో 3 నుంచి 8 వేల మధ్యన ఉన్నారు.
కేంద్రం అధ్యయనంలోనూ...!
కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ గత నెలలో ప్రకటించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (2019-20) ఫలితాల ప్రకారం మహిళల కంటే పురుషుల్లోనే ఈ సమస్య అధికంగా ఉంది. వీరిలో కూడా రక్తపోటుతో బాధపడే వారే అత్యధిక సంఖ్యలో ఉన్నారు. మధుమేహం పురుషుల్లో సగటున 21.8% వరకు ఉండగా...మహిళల్లో 19.5% ఉన్నట్లు తేలింది. రక్తపోటు పురుషుల్లో 29.0% వరకు ఉండగా... మహిళల్లో 25.3% ఉన్నట్లు తేలింది. తూర్పుగోదావరి జిల్లాలో రక్తపోటు, మధుమేహ బాధితులు ఎక్కువ సంఖ్యలో, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో తక్కువగా ఉన్నారు.
- ఇదీ చదవండి : కరోనా టీకాపై మీ డౌట్స్ ఇవేనా?