ముఖ్యంగా శీతాకాలంతో పాటు వర్షాకాలంలోనూ డి-విటమిన్ లేమి సమస్యను చాలా మంది ఎదుర్కొంటారు. సాధారణంగా విటమిన్-డి సూర్య రశ్మి ద్వారా లభ్యమవుతుందని అందరికీ తెలుసు. బయట ఎండలో నడిచినప్పుడు మన శరీరం సూర్యకిరణాల నుంచి సహజ సిద్ధంగా విటమిన్-డిను తయారు చేసుకుంటుంది. మారిన జీవనశైలి, ఆహార అలవాట్ల కారణంగా శరీరానికి తగిన మోతాదులో డి-విటమిన్ అందట్లేదని వైద్యులు చెబుతున్నారు. డి-విటమిన్ తక్కువ అయితే ఏ సమస్యలు వస్తాయి? ఏ ఆహార పదార్థాలు తీసుకుంటే విటమిన్ డి పుష్కలంగా లభిస్తుంది? వంటి విషయాల సమాహారమే ఈ కథనం.
డి-విటమిన్ లోపం వల్ల తలెత్తే సమస్యలు:
- కీళ్ల నొప్పులు, నడుం నొప్పి, అలసట, డిప్రెషన్‌కు గురవ్వటం
- సరిగ్గా నిద్ర పట్టకపోవటం, ఆకలి వేయకపోవటం, కండరాలు బలహీనంగా మారటం
- శరీరంలో విటమిన్-డి ఉండాల్సిన దాని కంటే తక్కువ మోతాదులో ఉంటే మెటబాలిజమ్ దెబ్బతిని శరీర అవయవాల పనితీరు మందగిస్తుంది.
- శరీరంలో విటమిన్-డి తక్కువగా ఉంటే ఎముకల బలం క్షీణించడమే కాకుండా గుండె పనితీరుపై ప్రభావం పడుతుంది.0
డి-విటమిన్ సంపూర్ణంగా లభించే ఆహార పదార్థాలు:
- సాల్మన్, సార్డైన్స్, మ్యాకరల్, ట్యూనా రకాల చేపల్లో డి-విటమిన్ అధికంగా ఉంటుంది.
- పాలు, పెరుగు, వెన్న, జున్ను వంటి డెయిరీ ఉత్పత్తులు
- చికెన్ లివర్, రొయ్యలు, రాగులు, మొక్కజొన్న, సోయా, రాజ్మా, బొబ్బర్లు, పుట్టగొడుగులు
- నువ్వులు, వేరుశనగ, కొత్తిమీర, తోటకూర, మునగాకు
- నారింజ, దానిమ్మ, ఎండు ద్రాక్ష, బొప్పాయి పండ్లు
- ఓట్స్, డార్క్ చాక్లెట్, కాడ్ లివర్ ఆయిల్, లవంగాలు, యాలకులు
సహజంగా విటమిన్-డి సూర్య రశ్మి ద్వారా అందుతుంది. రోజూ ఎండలో వాకింగ్, వ్యాయామం లాంటివి చేస్తే శరీరానికి విటమిన్-డి సమృద్ధిగా లభిస్తుంది. డి-విటమిన్‌కి సంబంధించి ఏవైనా మాత్రలు తీసుకునే ముందు వైద్యుల సలహాలు తీసుకోవడం మేలు.