కుంకుమ పువ్వు మన శరీరంలో వివిధ ఆరోగ్య సమస్యల్ని దూరం చేయడంలోనూ కీలకపాత్ర పాత్ర పోషిస్తుంది. అందుకే పూర్వకాలం నుంచే దీన్ని వివిధ మందుల తయారీలో కూడా వాడుతున్నారు. ఇంతకీ కుంకుమ పువ్వుతో ఆరోగ్యపరంగా చేకూరే ప్రయోజనాలు ఏంటంటారా??
రక్తాన్ని శుభ్రపరుస్తుంది..
మనం తిన్న ఆహారం సులభంగా జీర్ణమవడానికి కుంకుమ పువ్వు ఉపయోగపడుతుంది. అలాగే గ్యాస్ట్రిక్, ఎసిడిటీ వంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగేలా చేస్తుంది. కాలేయ, మూత్రపిండ సంబంధిత సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుంది. అంతే కాదు.. రక్తాన్ని శుభ్రపరచడంలో కూడా తోడ్పడుతుంది.
గర్భిణీలకు..
గర్భం దాల్చిన మహిళలు కుంకుమ పువ్వును పాలల్లో కలుపుకొని తాగితే పుట్టబోయే బిడ్డ మంచి రంగులో పుట్టే అవకాశం ఉంటుంది. అలాగని ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు. అయితే రోజుకి ఎంత తీసుకోవాలన్న విషయంలో వైద్యులను సంప్రదించి నిర్ణయం తీసుకోవడం మంచిది. అలాగే ఈ సమయంలో కొంతమందికి ఎదురయ్యే అజీర్తి సమస్యను తగ్గించి.. ఆకలిని పెంచడంలో కూడా ఇది తోడ్పడుతుంది.
మంచి నిద్రకు..
పడుకునే ముందు చిటికెడు కుంకుమ పువ్వును ఆహారంలో వేసుకుని తినడమో లేక పాలల్లో వేసుకుని తాగడమో చేస్తే బాగా నిద్ర పడుతుంది.
జ్వరాన్ని తగ్గిస్తుంది..
కుంకుమ పువ్వులో 'క్రోసిన్' అనే సహజసిద్ధ రసాయన సమ్మేళనం ఉంటుంది. దీనికి జ్వరాన్ని తగ్గించే శక్తి ఉందని పరిశోధకులు వెల్లడించారు. అలాగే ఇది.. చదివింది ఎక్కువ సేపు గుర్తుంచుకోవడానికి, తిరిగి జ్ఞప్తికి తెచ్చుకోవడానికి మెదడుకు కావలసిన శక్తినిస్తుంది.
ఇతరత్రా..
కుంకుమ పువ్వు దృష్టి లోపాన్ని సరిచేసి కళ్లు స్పష్టంగా కనిపించేలా చేస్తుంది. కీళ్ల నొప్పులను నివారించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అలాగే ఆర్థరైటిస్ సమస్య నుంచి విముక్తి కలిగిస్తుంది. ఒత్తిడి, రుతుసంబంధ సమస్యలు, ఆస్తమా, కోరింత దగ్గు.. ఇలా పలు రకాల సమస్యలను దూరం చేస్తుంది. కుంకుమ పువ్వు శరీరంలో రక్తపోటును తగ్గించి.. మానసిక ప్రశాంతతను చేకూరుస్తుంది. కండరాలకు విశ్రాంతినిస్తుంది. దీనిలో క్యాన్సర్‌ను నిరోధించే లక్షణాలున్నట్లు పలు పరిశోధనల్లో వెల్లడైంది.
రుచికి, వాసనకు..
ఆహార పదార్థాల రుచి, వాసనను పెంచడానికి వాటి తయారీలో కుంకుమ పువ్వును ఉపయోగిస్తారు. ఉదాహరణకి ఖీర్, పలు రకాల స్వీట్లు, బిర్యానీ.. మొదలైన పదార్థాల తయారీలో దీన్ని వాడతారు.
కల్తీ గుర్తించడమెలా?
కుంకుమ పువ్వు చాలా ఖరీదైంది. కాబట్టి మీరు కొన్న ఉత్పత్తి అసలైనదా లేక కల్తీ జరిగిందా తెలుసుకోవడం చాలా ముఖ్యం. అదెలాగంటే.. చిటికెడు కుంకుమ పువ్వును గోరువెచ్చటి నీటిలో లేదా గోరువెచ్చటి పాలలో వేసి తక్షణమే రంగు మారుతుందో లేదో గమనించాలి. ఒకవేళ తక్షణమే రంగు మారినట్లయితే అది అసలైనది కాదని అర్థం. ఎందుకంటే కుంకుమ పువ్వు కలిపిన మిశ్రమానికి ముదురు ఎరుపు నుంచి గోల్డ్ కలర్ రావడానికి కనీసం 15 నిమిషాల సమయం పడుతుంది. అలాగే కొనేముందు ప్యాకింగ్ సరిగ్గా ఉందా లేదా, తయారీ తేదీ, ఎక్స్‌పైరీ తేదీ.. తదితర విషయాలు క్షుణ్ణంగా పరిశీలించడం చాలా ముఖ్యం.
ఇదీ చదవండి: ఈ జాగ్రత్తలతో ఇక ఆన్‌లైన్‌లోనే ఆరోగ్యం!