పిల్లలకు ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చడానికి తల్లిదండ్రులు బాగా కష్టపడుతుంటారు. కానీ పిల్లలు మాత్రం జంక్ ఫుడ్‌నే ఇష్టపడతారు. మరికొందరు చిన్నారులు జంక్ ఫుడ్‌కు బానిసలుగా మారి.. తక్కువ వయస్సులోనే ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారు. మరి అలాంటి చిన్నారులు ఊబకాయం నుంచి బయటపడాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అవేంటంటే..
నగరాలతో పాటు పట్టణాల్లో ఏ వీధిలో చూసినా ఫ్రైడ్ రైస్, పిజ్జా, బర్గర్ వంటి షాపులు కనిపిస్తాయి. చిన్నపిల్లలు వీటిని చూడగానే ఆకర్షితులు అవుతారు. వాటి వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్లి కొనుగోలు చేయాలని మారాం చేస్తూ ఉంటారు. పిల్లలు మారాం చేస్తున్నారని తల్లిదండ్రులు కూడా అడిగినవన్నీ ఇప్పిస్తారు. చివరికి జంక్ ఫుడ్‌కు చిన్నారులు అలవాటు పడిపోతున్నారు. ఒకసారి అలవాటు అయిన తర్వాత వాటిని తప్పితే మిగతా ఆహార పదార్థాలు తినలేనంతగా పిల్లలు మారిపోతున్నారు.
జంక్ ఫుడ్‌కు అలవాటు పడ్డ పిల్లలను వాటి నుంచి దూరం చేయడం చాలా కష్టతరంగా మారుతోంది. జంక్ ఫుడ్ రోజూ తినడం వల్ల పిల్లలు చిన్న వయస్సులోనే బరువు పెరుగుతున్నారు. దీంతో పాటు ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారు. ఇలాంటి సమయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోడం ద్వారా పిల్లల బరువు తగ్గేలా చేయవచ్చని నియోనటాలజిస్ట్ డా. విజయానంద్ చెబుతున్నారు. పిల్లలు పిజ్జా, బర్గర్లు వంటివి తినకుండా చేయాలని, రుచికరమైన, పోషక పదార్థాలు ఉన్న ఆహారాన్ని అందించాలని ఆయన సూచించారు.
ఇంట్లో చిన్న చిన్న పనులను పిల్లలతో చేయించడం, దగ్గరలోని ప్రాంతానికి వెళ్లేటప్పుడు కార్లు లేదా బైక్‌లపై తీసుకెళ్లకుండా నడిపించుకుని తీసుకెళ్లాలని విజయానంద్ చెప్పారు. అపార్ట్‌మెంట్లలో లిఫ్ట్ ఉన్నా.. అది వాడకుండా మెట్ల మార్గం ద్వారా తీసుకెళ్లడం, పిల్లలు ఆసక్తి చూపించే క్రికెట్, బాస్కెట్‌బాల్, కబడ్డీ, బ్యాడ్మింటన్ లాంటి ఆటలను ఆడించాలని చెప్పారు. ఇక డ్యాన్స్ లాంటివి నేర్పించడం వల్ల పిల్లల్లో శారీరక శ్రమ పెరుగుతుందని, దీని వల్ల బరువు తగ్గుతారని విజయానంద్.. తల్లిదండ్రులకు సూచించారు. ఒకవైపు శారీరక శ్రమ పెంచుతూనే.. మరోవైపు పిల్లలు తినే ఆహార మోతాదును తగ్గించడం, ఆహారంలో కొవ్వు పదార్థాలను తక్కువగా అందించడం లాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల స్థూలకాయం నుంచి బయట పడేయవచ్చని అంటున్నారు.
తల్లిదండ్రులను చూసే పిల్లలు ఆహారపు అలవాట్లను పాటిస్తారు. పిల్లలకు ఏదైతే చెబుతున్నామో.. మనం కూడా అవే పాటించాలి. తల్లిదండ్రులు కూడా జంక్ ఫుడ్, శరీరంలో కొవ్వును పెంచే ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. కూల్‌డ్రింక్స్, ఐస్‌క్రీమ్స్, బేకరీ పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండాలి. ఇక చిన్నపిల్లలు తినేటప్పుడు వారి చేతికి సెల్‌ఫోన్ ఇవ్వడం, టీవీ చూపించడం లాంటివి చేయకూడదని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఇలాంటి సమయాల్లో చిన్నారులు ఎక్కువ ఆహారం తీసుకుంటారని, దాని వల్ల మరింత నష్టం జరుగుతుందంటున్నారు. ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చిన్నపిల్లలు ఊబకాయం నుంచి త్వరగా బయటపడతారని విజయానంద్ సూచించారు.