How To Stop Child Phone Addiction : ప్రస్తుత రోజుల్లో పిల్లలకు ఫోన్ ఓ వ్యసనంగా మారిపోయింది. దీనికి తోడు పిల్లలు ఏదైనా అల్లరి చేస్తే వారి నోరు మూయించాలని తల్లిదండ్రులే వారికి ఫోన్లు అందిస్తున్నారు. దీంతో పిల్లలు ఫోన్లకు బానిసలుగా మారిపోతున్నారు. తీరా వ్యసనంగా మారిన తర్వాత వాళ్లు ఫోన్ వదిలేలా చేయడానికి తల్లిదండ్రులు నానా అవస్థలు పడుతుంటారు. అందుకే పిల్లలను ఫోన్ల నుంచి ఎలా దూరం చేయాలన్న విషయంపై నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా మీరు ఫోన్‌కు దూరంగా ఉండాలి!
సాధారణంగా పెద్దలు చేసే పనులను పిల్లలు అనుకరిస్తుంటారు. కనుక ముందుగా మీరు ఫోన్‌కు దూరంగా ఉండాలి. పిల్లల ముందు అతిగా ఫోన్ వాడడం, టీవీలు చూడటం మానుకోవాలి. పిల్లలతో ఎక్కువ సేపు గడపాలి. ఆడడం, మాట్లాడటం, కథలు చెప్పడం లాంటి చేయాలి. దీంతో వారికి, మీకు మంచి అనుబంధం ఏర్పడుతుంది. ఇంట్లో సానుకూల వాతావరణం ఉంటుంది.
టైమ్ లిమిట్ పెట్టాలి
గాడ్జెట్‌లను పూర్తిగా దూరంగా ఉంచడం సాధ్యం కాదు. అందువల్ల మరో మార్గాన్ని కనుగొనడం అవసరం. పిల్లలకు గాడ్జెట్‌లను అందించడానికి లేదా స్మార్ట్ టీవీని చూడడానికి సమయాన్ని నిర్ణయించండి. వాటిని ఏ సమయం నుంచి ఏ సమయం వరకు చూడాలో కచ్చితంగా నిర్దేశించండి. కావాలంటే అలారమ్ పెట్టండి.
పిల్లల శారీరక శ్రమపై దృష్టి పెట్టాలి
పిల్లలను ఆరుబయట ఆడుకునేందుకు ప్రోత్సహించాలి. ఆటలపై ఎంత ఏకాగ్రత పెడితే, మొబైల్‌పై అంత ఏకాగ్రత తగ్గుతుంది. ఆడుకోవడం వల్ల పిల్లల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ప్లేగ్రౌండ్స్కు, పార్కులకు తీసుకెళ్లి ఆడించడం, స్విమ్మింగ్, రన్నింగ్, జాగింగ్ లాంటివి పిల్లలకు అలవాటు చేయడం మంచిది.
మీ పిల్లల్లోని ప్రతిభను ప్రోత్సహించాలి
పిల్లల్లో సహజ సిద్ధమైన ప్రతిభ ఉంటుంది. వారికంటూ ప్రత్యేకమైన అభిరుచులు ఉంటాయి. వాటిని మీరు ప్రోత్సహించాలి. అప్పుడే వారు సెల్ఫోన్లకు దూరంగా ఉంటారు. అలాగే జనరల్ నాలెడ్జ్‌ను పెంచే టీవీ, రేడియో కార్యక్రమాలను చూపించాలి. పుస్తకాలు చదివించడం, సంగీతం నేర్పించడం లాంటి పనులు చేయాలి.
బెడ్ రూమ్‌లో మొబైల్, ట్యాబ్లెట్ వాడవద్దు
చిన్నపిల్లలు రాత్రిపూట పడుకునే బెడ్ రూమ్‌లో మొబైల్ ఫోన్‌లను, ట్యాబ్లెట్‌లను ఉంచకూడదు. ఎందుకంటే, మొబైల్ ఫోన్‌లను ఎక్కువగా ఉపయోగిస్తే, కంటిచూపు తగ్గుతుందని పలు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. అంతేకాదు గ్యాడ్జెట్‌లను ఉపయోగించే పిల్లలు అతిగా చిరాకు పడుతుంటారు. పైగా ఆందోళన, నిరాశ, స్వీయ సందేహాలు లాంటి సమస్యలకు గురువుతారు. ఫోన్లకు అడిక్ట్ అయిన పిల్లల ఆలోచన ధోరణి కూడా మారుతుందని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. దీనితో పిల్లలు సైబర్ నేరగాళ్ల చేతిలో బాధితులుగా మారుతున్నారని చెబుతున్నారు. కనుక పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తగా వ్యవహరించాలని నిపుణులు చెబుతున్నారు.
మీ పిల్లలు సరిగా చదవట్లేదా? కారణాలు ఇవేనట - సెట్ చేయాల్సింది మీరే!
మీ పిల్లలు నిత్యం నవ్వుతూ ఉండాలా? - అయితే ఈ 5 విషయాలు చెప్పండి!