ఇటీవల కాలంలో చాలామందిని నల్లమచ్చలు వేధిస్తున్నాయి. కొన్ని ఇంటి చిట్కాలు పాటిస్తే వాటినుంచి ఉపశమనం పొందొచ్చని చెబుతున్నారు నిపుణులు.
కలబంద పూత
పావుకప్పు కలబంద గుజ్జులో కొద్దిగా విటమిన్ ఈ నూనె, చెంచా నిమ్మరసం కలిపి మిశ్రమంలా చేసుకోవాలి. దీన్ని ముఖానికి రాసుకుని ఆరాక గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా వారానికోసారి పూత వేసుకోవాలి. విటమిన్ ఈ నూనె చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. పిగ్మెంటేషన్ నివారణకు తోడ్పడుతుంది. నిమ్మరసం మృత కణాలు, నల్లమచ్చలు తొలగిస్తుంది. కలబంద చర్మానికి తేమను సమకూరుస్తుంది.
నీరు తాగడం...
రోజూ ఎక్కువ నీరు తాగడం వల్ల చర్మం సహజంగా మెరుస్తుంది. ఇది శరీరంలోని మలినాలను తొలగిస్తుంది. దీంతో చర్మం తాజాగా, నిగనిగలాడుతుంది. కెఫీన్, చక్కెర ఉన్న పదార్థాలకు బదులు పండ్లు, కూరగాయలు వంటివి తీసుకోవాలి. వాటిల్లో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. అలాగే రోజులో రెండు సార్లు ముఖాన్ని కడగడం వల్ల చర్మంపై ఉండే దుమ్ము తొలిగిపోతుంది.
బొప్పాయి పూత...
బొప్పాయిలో పపైన్ అనే పదార్థం ఉంటుంది. ఇది చర్మాన్ని తాజాగా ఉంచుతుంది. బొప్పాయి గుజ్జును ముఖానికి రాసుకోవడం వల్ల నిగారింపు వస్తుంది. బొప్పాయి గుజ్జులో టేబుల్ స్పూను తేనె కలపాలి. ఒక వేళ పొడిబారిన చర్మం అయితే ఈ మిశ్రమానికి క్రీం కలపాలి. జిడ్డు చర్మం ఉన్నవారు అరచెంచా నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకోవాలి. దీనివల్ల ముఖంపై ఉండే నల్ల మచ్చలు తొలిగిపోతాయి. నిమ్మలోని విటమిన్ సి మచ్చలను తొలగిస్తుంది. క్రీంలోని లాక్టిక్ ఆమ్లం చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది. తేనె తేమను అందిస్తుంది.
మజ్జిగ...
మజ్జిగలో లాక్టిక్ ఆమ్లం ఎక్కువ. ఇది ముఖంపై ఉండే మృతకణాలు, నల్లమచ్చలను తొలగిస్తుంది. మజ్జిగను దూది సహాయంతో ముఖానికి రాసుకోవాలి. ఆరిన తరువాత చల్లని నీటితో కడిగేస్తే ఫలితం కనిపిస్తుంది.
నిమ్మ, పెరుగు పూత...
నిమ్మ చర్మానికి చేసే మేలు గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇందులో ఉండే విటమిన్ సి, సిట్రిక్ ఆమ్లం బ్లీచింగ్ ఏజెంట్‌గా పని చేస్తుంది. ఇది నల్లమచ్చలను తొలగించడానికి ఉపయోగపడుతుంది. పెరుగు, నిమ్మ మిశ్రమం మృదువైన, నిగనిగలాడే చర్మం కోసం ఉపయోగపడతాయి. దీనికి చక్కెర కూడా కలపొచ్చు. చక్కెర మృతకణాలను కూడా తొలగిస్తుంది.
ఇదీ చదవండి: సైకిలెక్కి తొక్కితే.. ఆరోగ్యం మీ వశమే!