కొబ్బరి, ఆలివ్, నువ్వుల నూనె, ఆముదం, బాదం... అంటూ వివిధ రకాల హెయిర్ ఆయిల్స్ మార్కెట్లలో లభ్యమవుతుంటాయి. అయితే ఇలా బోలెడు డబ్బు పెట్టి హెయిర్ ఆయిల్స్‌ను కొనే బదులు ఇంట్లోనే సహజసిద్ధంగా తయారుచేసుకోవడం ఎంతో మేలంటున్నారు ప్రముఖ పోషకాహార నిపుణురాలు రుజుతా దివేకర్ తల్లి రేఖా దివేకర్. ఆరోగ్యానికి సంబంధించిన వివిధ అంశాలతో పాటు ఎన్నో రుచికరమైన, పోషక విలువలతో కూడిన వంటకాలను షేర్ చేసుకుంటున్న ఆమె తాజాగా శిరోజాల ఆరోగ్యానికి సంబంధించి ఓ వీడియోను పోస్ట్ చేశారు. కొబ్బరి నూనెతో పాటు ఇంట్లోనే సులభంగా లభించే మరికొన్ని పదార్థాలతో హెర్బల్ ఆయిల్‌ను తయారుచేయడమెలాగో దీని ద్వారా పంచుకున్నారు.
కోకొనట్ హెర్బల్ హెయిర్ ఆయిల్
కావాల్సిన పదార్థాలు
- మందార పూలు -20
- వేపాకులు -30
- కరివేపాకు -30 రెబ్బలు
- ఉల్లిపాయలు (చిన్నవి)-5
- మెంతులు- ఒక టీ స్పూన్
- కలబంద -ఒకటి
- మల్లె పువ్వులు- 15 నుంచి 20
- కొబ్బరి నూనె- ఒక లీటరు
తయారీ
మెంతులను ఒక అరగంట పాటు నీటిలో నానబెట్టాలి. కలబందను చిన్న చిన్న ముక్కలుగా కోయాలి. తర్వాత పైన చెప్పిన అన్నింటినీ మిక్సీలో వేసి పేస్ట్‌లాగా తయారుచేయాలి. ఈ మిశ్రమాన్ని లీటరు కొబ్బరి నూనెలోకి కలపాలి. దీనిని ఒక 45 నిమిషాల పాటు మీడియం సైజు మంటపై మరిగిస్తే ఆకుపచ్చ రంగులోకి మారిపోతుంది. ఆపై చల్లార్చి ఒక గాజు సీసాలోకి వడపోసి భద్రపరచుకోవాలి.
ప్రయోజనాలివే! హెయిర్ ఆయిల్ తయారీతో పాటు దీనిని తలకు పట్టించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు చేకూరతాయో కూడా తన పోస్ట్‌లో చెప్పుకొచ్చారు రేఖ. కేశాల ఎదుగుదలకు ఉపకరించే ఈ హెర్బల్ ఆయిల్ తయారీ గురించి తెలుసుకున్నారుగా.. మరి మీరూ ఈ నూనెను ట్రై చేయండి. ఒత్తైన శిరోజాలను సొంతం చేసుకోండి.
|