Heart Failure Symptoms And Causes : మన శరీరంలో ప్రతి భాగానికి రక్తాన్ని సరఫరా చేస్తూ మనల్ని కాపాడుతున్న అవయవం గుండె. అందుకే శరీరంలోని మిగిలిన అన్ని భాగాల కన్నా గుండె అత్యంత కీలకమైనదని చెప్పుకోవచ్చు. అయితే కొన్నిసార్లు ఈ గుండె ఫెయిల్ అవడానికి అవకాశం ఉంది. హార్ట్ ఫెయిల్యూర్‌కు కారణాలు, ముందుగా కనిపించే లక్షణాలు, పాటించాల్సిన జాగ్రత్తలు ఏమిటో చూద్దాం.
హార్ట్ ఫెయిల్యూర్ ఎందుకు వస్తుంది?
Causes of heart failure: హార్ట్ ఫెయిల్యూర్ అనేది రెండు కారణాల వల్ల జరగవచ్చని వైద్యులు చెబుతున్నారు. గుండె చుట్టూ ఉంటే రక్తనాళాల్లో ఏర్పడే ఆటంకం వల్ల హార్ట్ ఫెయిల్యూర్ కావచ్చు అని వైద్యులు వివరిస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో వైద్య పరీక్షలు నిర్వహించి ఎక్కడ బ్లాక్ అయిందో గుర్తించి, చికిత్స చేయాల్సి ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. ఇన్ఫెక్షన్స్, సిస్టమేటిక్ కనెక్టివ్ టిష్యూ డిసీజ్‌లు వల్ల కూడా హార్ట్ ఫెయిల్యూర్ కావడానికి అవకాశం ఉంటుందని ప్రముఖ కార్డియాలజిస్ట్ డా.శరత్ రెడ్డి వివరిస్తున్నారు. ఈ రకమైన ఫెయిల్యూర్ అకస్మాత్తుగా వచ్చేది కాదని, అనారోగ్య కారణం, నిర్లక్ష్యం, శరీరానికి తగిన శ్రమ లేకపోవడం, ధూమపానం, మద్యపానం లాంటి అనేక కారణాలు ఉండవచ్చని పేర్కొన్నారు.
హార్ట్ ఫెయిల్యూర్ లక్షణాలు ఏంటి?
Heart Failure Symptoms : హార్ట్ ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉన్న వారిలో కొన్ని లక్షణాలు ముందే కనిపిస్తాయి. ఈ లక్షణాల ఆధారంగా వారు హార్ట్ ఫెయిల్యూర్ అవుతుందనే అంచనాకు రావచ్చు. అలసట, ఆందోళన, గుండె దడ లక్షణాలు కనిపిస్తాయని వైద్యులు చెబుతున్నారు. అయితే ఈ లక్షణాలు ఉన్నంత మాత్రాన కచ్చితంగా హార్ట్ ఫెయిల్యూర్ అని నిర్ధరణకు రాకూడదని.. వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. వైద్యులు తగిన టెస్టులు చేసిన తర్వాత రోగ నిర్ధరణ చేస్తారని డా.శరత్ రెడ్డి వివరించారు.
హార్ట్ ఫెయిల్యూర్ లక్షణాలు ఉన్న వాళ్లు వేటికి దూరంగా ఉండాలి?:
Heart failure patient diet: హార్ట్ ఫెయిల్యూర్ లక్షణాలు కలిగిన వ్యక్తులు జీవన శైలిలో మార్పులు చేసుకోవాలి. తీసుకునే ఆహారం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉప్పు అధికంగా ఉండే పదార్థాలకు దూరంగా ఉండాలి. ప్రధానంగా ఆహారంలో ఉప్పును బాగా తగ్గించుకోవాలి. అలాగే గ్యాస్ నిండిన పానీయాలకు దూరంగా ఉండాలి. మద్యపానం, ధూమపానం ఉంటే వెంటనే మానెయ్యాలి. వాకింగ్ లేదా ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు గుండెదడ, ఆయాసం, అలసట అనిపిస్తే వెంటనే ఆపేయాలి.
హార్ట్ ఫెయిల్యూర్ లక్షణాలు ఉన్న వాళ్లు పాటించాల్సినవి!
Heart failure Prevention and treatment : హార్ట్ ఫెయిల్యూర్ లక్షణాలు కలిగిన వాళ్లు సమతుల ఆహారాన్ని తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు, చికెన్, చేపలు తీసుకోవాలి. తక్కువ మోతాదులో పాలు, పాల పదార్థాలు తీసుకోవాలి. క్రమం తప్పకుండా వాకింగ్ లేదా జాగింగ్ చేయాలి. వైద్యుల సూచనల మేరకు ఎక్సర్సైజ్ చేయాలి. ఇన్ఫెక్షన్లు సోకకుండా ముందే వ్యాక్సిన్లు తీసుకోవాలి. వైద్యులు సూచించిన మందులను క్రమం తప్పకుండా వేసుకోవాలి. మందులను అకస్మాత్తుగా ఆపేయడం మంచిది కాదని గుర్తించాలి. శ్వాస ఆడకపోవడం, నిద్రలో తేడా, ఆందోళన అనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.