Heart Attack Symptoms: అవగాహనతోనే... గుండె పదిలం. కానీ ఈ విషయం తెలియకే చిక్కులు. ప్రపంచంలో ఏటా 1.9 కోట్ల మంది గుండె కవాటాల సమస్యతో ప్రాణాలు కోల్పోతున్నారు. పాశ్చాత్య దేశాల కంటే భారతీయుల్లోనే గుండెపోటు కేసులు ఎక్కువగా వస్తున్నాయి. పదేళ్లుగా ఈ తరహా సమస్యలు మరింత ఎక్కువయ్యాయి. గుండెపోటు అంటే అదేదో పెద్దలకు మాత్రమే సంబంధించిన విషయం కాదు. దశాబ్దకాలంలో 20లు, 30లలోనే గుండెపోటుకు గురయ్యేవారి కేసులు పెరగడం గమనించినట్లు గుండె వైద్య నిపుణులు చెబుతున్నారు.
భారతీయుల్లో గుండె సమస్యలకు ఇవి కారణం
భారతీయుల్లో గుండెకు వెళ్లే రక్తనాళాల పరిమాణం చిన్నగా ఉండటమే సమస్య తీవ్రం కావడానికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. మధుమేహం, ఊబకాయం, రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడం.. వీటన్నింటివల్ల చిన్నవయసులోనే గుండె సమస్యలు వస్తున్నాయి. ఆహార అలవాట్లూ భారతీయుల్లో గుండె సమస్యలకు ఒక కారణం. ఆహారంలో కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉంటున్నాయని, వాటికితోడు మానసిక ఒత్తిడి, ధూమపానం, మద్యపానం, డ్రగ్స్ వాడకం సమస్యలకు దారితీస్తున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. శారీరక శ్రమ తగ్గడం, వృత్తి జీవితంలో ఒత్తిడి పెరగడం.. ఇలా ఎన్నో కారణాలు గుండె చప్పుడుని ఆపేస్తున్నాయి.
అవగాహన పెంచుకోవాలి
ఈ అంశాలపై ప్రజలు అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. దానివల్ల గుండె వ్యాధుల్ని నివారించలేకపోయినా, కారణమయ్యే అంశాల్ని నియంత్రించవచ్చు. ఆయాసం, గుండె పట్టేసినట్లుగా ఉండటం, ఎక్కువగా చెమట పట్టడం, కళ్లు తిరగడం లాంటి లక్షణాలు ఏవి కనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించాలి. మద్యపానం, ధూమపానం వంటి అలవాట్లు మానుకోవాలని, కనీస వ్యాయామం చేయాలని, కొవ్వు పదార్థాలు తీసుకోవడం తగ్గించాలంటున్నారు గుండె వైద్య పరిశోధకులు. జీవనశైలిలో చిన్నచిన్న మార్పులతో మెరుగైన ఫలితాలు ఉంటాయని గుర్తించాలి. యోగా, ధ్యానంను రోజువారీ జీవితంలో భాగంగా చేసుకోవాలని సూచిస్తున్నారు.
ఏది గుండెపోటు అంటే..
చాలావరకు ఛాతీ మధ్యలో నొప్పి వస్తుంటుంది. సాధారణంగా 10-15 నిమిషాల సేపుంటుంది. ఛాతీ మీద ఎవరో కూర్చున్నట్టు, బలంగా నొక్కుతున్నట్టు, బరువుగా అనిపిస్తుంటుంది. నడుస్తున్నప్పుడు, పనులు చేస్తున్నప్పుడు నొప్పి పెరుగుతున్నా.. విశ్రాంతి తీసుకుంటే తగ్గుతున్నా గుండె నొప్పిగా అనుమానించాలి. నొప్పి మెడ, వీపు భాగాలకూ పాకొచ్చు. కొందరికి ఎడమ భుజం, చేయిలోకి విస్తరించొచ్చు. సార్బిట్రేట్ మాత్ర వేసుకుంటే నొప్పి తగ్గుతుంటే గుండెనొప్పిగానే అనుమానించాలి. గుండె పోటు లక్షణాలు కనిపిస్తే ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఎందుకంటే ఆలస్యం చేసే ప్రతిక్షణం ప్రాణాపాయానికి దారితీయొచ్చు. 30 ఏళ్లు దాటిన తర్వాత ఏడాదిలో ఒకసారి గుండె సంబంధ పరీక్షలు చేయించుకుంటే మేలు.
గుర్తించడంలో విఫలం అవుతున్నారు
గుండెపోటు లక్షణాలను గుర్తించడంలో చాలామంది విఫలం అవుతున్నారు. కొంతమంది పూర్తిగా అలక్ష్యం చేస్తూ ఉండగా... మరికొంతమంది కొన్ని గంటల తర్వాత ఆస్పత్రులకు వస్తున్నారు. ఫలితంగా గుండెకు అందాల్సిన అత్యవసర వైద్యంలో జాప్యం జరిగి ప్రాణాల మీదకు వస్తోంది. అందుకే.. హృద్రోగాల నివారణలో ప్రజల్లో అవగాహన పెంచే దిశగా ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు కృషి చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. ప్రభుత్వ పరంగా జిల్లా, ప్రాంతీయ ఆస్పత్రుల్లోనూ గుండె వైద్య చికిత్స సౌకర్యాలను కల్పించడం, అవసరమైన వైద్య నిపుణులను నియమించడం, అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం గ్రామీణ ప్రాంతాల్లో ఆంబులెన్సు సేవలను విస్తరించడంవంటి జాగ్రత్తలు తీసుకోవాలి.
ఈ సూచనలు పాటించాలి
గుండె జబ్బుల విషయంలో ముఖ్యంగా నగరవాసులకు వైద్యులు చేస్తున్న సూచనలు కొన్ని ఉన్నాయి. ప్రధానంగా నిద్రలేమి పరిస్థితులు తగ్గించుకోవాలి. ఉదయం బ్రేక్‌ఫాస్ట్ చేయకుండా ఉండకూడదు. లేచిన 2 గంటల్లోగా అల్పాహారం తీసుకోవాలి. భోజనంలో కూరగాయలు, ఆకు కూరలు, పండ్లు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. వారానికి 5 రోజుల పాటు కనీస వ్యాయామం ఉండేలా చూసుకోవాలి. నడుం చుట్టూ కొవ్వు పేరుకుని పోయే ఊబకాయ సమస్యలకు దూరంగా ఉండేలా జాగ్రత్త పడాలి.
ఇదీ చదవండి : కొవిడ్ సోకితే గుండెపోటు ముప్పున్నట్లేనా?