Bananas Health Benefits to Eat Daily : కాలంతో సంబంధం లేకుండా ఎక్కడ పడితే అక్కడ తక్కువ ధరకే దొరికే పండు ఏదైనా ఉందంటే అది ఒక్క అరటి పండు మాత్రమే అని చెప్పుకోవచ్చు. తక్షణ శక్తికి, తిన్న ఆహారాన్ని సులువుగా జీర్ణం చేయడానికి ఈ మ్యాజికల్ ఫ్రూట్ ఎంతో సహాయపడుతుంది. ఇవి అత్యంత ఆరోగ్యకరమైన, పోషకమైన పండ్లుగా చెబుతుంటారు ఆరోగ్య నిపుణులు. అయితే ఎన్నో పోషక విలువలతో నిండి ఉన్న ఈ పండ్లను కొందరు తినడానికి అయిష్టం చూపుతుంటారు. మరికొందరు వీటిని తిన్నా వారానికో, పదిరోజులకోసారో తింటుంటారు. అలాకాకుండా రోజుకో యాపిల్ తింటే ఆరోగ్యంగా ఉంటాం.. డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదని ఎలా అనుకుంటారో.. అదేమాదిరిగా రోజుకో అరటి పండు(Banana) తింటే కూడా అలాంటి ఆరోగ్య ప్రయోజనాలే ఉంటాయంటున్నారు నిపుణులు. అలాగే మీ డైట్‌లో రోజూ ఒక బనానా ఎందుకు తినాలనే అవసరాన్ని తెలియజేయడంతో పాటు అందుకు గల కారణాలు వారు పేర్కొన్నారు. ఆ వివరాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
రోజూ అరటిపండు ఎందుకు తినాలంటే?
డైలీ అరటిపండు తీసుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్ సి, మెదడు పనితీరును మెరుగుపరిచే విటమిన్ B6, జీర్ణ ఆరోగ్యానికి తోడ్పడే డైటరీ ఫైబర్, రక్తపోటు కంట్రోల్ చేసే, గుండె ఆరోగ్యాన్ని కాపాడే పొటాషియం.. వంటి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు అరటిపండ్లలో సహాజంగా లభిస్తాయి. అలాగే తక్షణ శక్తి కోసం ఉపయోగపడే సహజ చక్కెరలు, కార్బోహైడ్రేట్‌లూ ఇందులో పుష్కలంగా ఉంటాయి. ఇవేకాకుండా వీటిలో ఉండే ఫోలేట్ కంటెంట్ మొత్తం ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే ఇందులో ఉండే మెగ్నీషియం ఎముకలు, కండరాల ఆరోగ్యానికి దోహదపడుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇది వ్యాయామం చేసిన తర్వాత వారు కోల్పోయిన పోషకాలు పొందడానికి ఇది మంచి సమర్థవంతమైన ఫుడ్. ఇక దీనిని తీసుకోవడం వెనుక ఉన్న కారణాలను ఓసారి చూద్దాం..
అరటిపండు ఏ టైమ్‌లో తినాలి?.. పరగడుపున తింటే ప్రమాదమా?
పోషకాలు పుష్కలం : అరటిపండ్లు పొటాషియం, విటమిన్ సి, విటమిన్ B6, డైటరీ ఫైబర్‌తో సహా అవసరమైన పోషకాలతో నిండి ఉన్నాయి. కాబట్టి రోజూ వీటిని తీసుకోవడం ద్వారా బాడీకి కావాల్సినన్ని పోషకాలు అంది ఆరోగ్యంగా ఉంటారు.
రక్తపోటు నియంత్రణ : పొటాషియం ఉత్తమ సహజ వనరులలో ఒకటి అరటి పండు. గుండె, కండరాల పనితీరును మెరుగుపరుస్తాయి. అలాగే రక్తపోటును నియంత్రించడానికి ఇది కీలకమైనది.
ఎనర్జీ బూస్ట్ : అరటిపండ్లలో ఉండే గ్లూకోజ్, ఫ్రక్టోజ్, సుక్రోజ్ వంటి సహజ చక్కెరలు త్వరగా స్థిరమైన శక్తిని అందిస్తాయి. వ్యాయామానికి ముందు లేదా మధ్యాహ్నం తీసుకునే స్నాక్స్‌కు వీటిని అనువైన ఎంపికగా చెప్పుకోవచ్చు.
జీర్ణ ఆరోగ్యం : ఈ పండ్లలోని డైటరీ ఫైబర్, పెక్టిన్ అనేవి సాధారణ పేగు కదలికలను ప్రోత్సహించి మలబద్ధకాన్ని నివారిస్తాయి. అంతేకాకుండా మొత్తం జీర్ణ ఆరోగ్యానికి అరటిపండ్లు మంచి సపోర్ట్ ఇస్తాయి.
కడుపులో మంట : వైద్యులూ తరచుగా జీర్ణక్రియలో అసౌకర్యాన్ని అనుభవిస్తున్న వారికి అరటిపండ్లను సిఫార్సు చేస్తారు. ఎందుకంటే అవి ఆహారాన్ని సులభంగా జీర్ణం చేయడంతో పాటు కడుపు నొప్పిని, మంటను తగ్గించడంలో చాలా బాగా సహాయపడతాయి.
గుండె ఆరోగ్యం : అరటిపండ్లు వంటి పొటాషియం అధికంగా ఉండే ఆహారాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తపోటు తగ్గుతుంది. గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని చాలా వరకు తగ్గించుకోవచ్చు.
బరువు నియంత్రణ : ఇవి చాలా తక్కువ కేలరీలు, కొవ్వును కలిగి ఉంటాయి. అయితే ఫైబర్ అధికంగా ఉంటుంది. కాబట్టి వాటిని మీ డైట్‌లో చేర్చుకోవడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. అతిగా తినకుండా ఉంటారు. ఇది మీకు బరువు నియంత్రణలో చాలా వరకు సహాయపడవచ్చు.
ఆరోగ్యకరమైన చర్మం : అరటిపండులోని విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు వృద్ధాప్య ప్రభావాలను ఎదుర్కోవడం, చర్మ స్థితిస్థాపకతను కాపాడుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన చర్మానికి దోహదం చేస్తాయి. ఇలా మేము చెప్పిన ప్రయోజనాలన్నీ పొందాలంటే డైలీ మీ డైట్‌లో తప్పకుండా అరటిపండును తీసుకోవాలి. అప్పుడే ఈ హెల్తీ బెనిఫిట్స్ మీ సొంతమవుతాయి.