gi food for heart patients: శరీర సౌష్టవం బాగుండాలని అనుకుంటున్నారా? అయితే ఆలస్యంగా జీర్ణమయ్యే పదార్థాలు తిని చూడండి. గుండెజబ్బులు గలవారికిది మరింత బాగా ఉపయోగపడుతుండటం గమనార్హం. మనం తీసుకునే పిండి పదార్థాల్లోని గ్లూకోజు ఎంత వేగంగా రక్తంలో కలుస్తుందనే దాన్ని గ్లైసిమిక్ ఇండెక్స్(జీఐ)తో లెక్కిస్తుంటారు.
అన్నం, తెల్ల బ్రెడ్డు, బంగాళా దుంపలు, మిఠాయిల వంటివి అధిక జీఐ పదార్థాలు. ఇవి రక్తంలో గ్లూకోజు చాలా త్వరగా పెరిగేలా చేస్తాయి. యాపిల్, నారింజ, బ్రకోలీ, ఆకు కూరలు, పండ్లు, కూరగాయలు.. దంపుడు బియ్యం వంటి పొట్టుతీయని ధాన్యాలు, పప్పుల వంటివన్నీ తక్కువ జీఐ పదార్థాలు. ఇవి నెమ్మదిగా రక్తంలో గ్లూకోజును పెంచుతాయి. మాంసం, చికెన్, చేపల్లో ఎలాంటి పిండి పదార్థాలు ఉండవు. రక్తంలో త్వరగా గ్లూకోజును పెంచే పదార్థాలతో గుండెజబ్బులు, మధుమేహం వంటి జబ్బుల ముప్పు పెరిగే ప్రమాదముంది. అందుకే ఆలస్యంగా జీర్ణమవుతూ, రక్తంలో గ్లూకోజు నెమ్మదిగా కలిసేలా చేసే పదార్థాలు తినటం మంచిదని నిపుణులు చాలాకాలంగా సూచిస్తున్నారు.
గుండెజబ్బులు గలవారిలో వీటి ప్రభావాన్ని తెలుసుకోవటానికి శాస్త్రవేత్తలు ఇటీవల ఒక అధ్యయనం నిర్వహించారు. ప్రొటీన్, కొవ్వు పదార్థాలను ఎప్పటిలాగానే కొనసాగిస్తూ తక్కువ జీఐ పదార్థాలను తీసుకున్నవారిలో శరీర ఎత్తు, బరువుల నిష్పత్తి (బీఎంఐ), నడుం చుట్టుకొలత గణనీయంగా తగ్గినట్టు గుర్తించారు. మహిళల్లో కన్నా పురుషుల్లో నడుం చుట్టుకొలత, తుంటి చుట్టుకొలత, నడుం-తుంటి నిష్పత్తి ఇంకాస్త ఎక్కువగా తగ్గినట్టు తేలింది. ఇది గుండెజబ్బులు గలవారికి ఎంతో మేలు చేస్తుందని భావిస్తున్నారు.
ఇదీ చదవండి: వేసవిలో ఆ సమస్యలు పెరుగుతాయా?