రోజువారీ తీసుకునే ఆహారం, విటమిన్ సప్లిమెంట్స్, చేసే వ్యాయామాల ద్వారా ఇమ్యూనిటీని పెంచుకోవడం పైనే దృష్టి పెట్టారంతా! ఈ క్రమంలోనే భారత ఆహార భద్రత, నాణ్యతా ప్రమాణాల సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ) మన సంపూర్ణ ఆరోగ్యం కోసం ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలో సూచిస్తూ ఎప్పటికప్పుడు మార్గదర్శకాలు జారీ చేస్తోంది. అలా తాజాగా విటమిన్-బి అధికంగా లభించే మొక్కల ఆధారిత ఆహార పదార్థాలేంటో తెలియజేస్తూ ట్విట్టర్ వేదికగా మరో పోస్ట్ పెట్టింది. అటు రోగనిరోధక శక్తిని పటిష్టపరచడానికి, ఇటు నాడీ వ్యవస్థ పనితీరును మెరుగుపరచడానికి.. ఇలా రెండు రకాలుగా ఈ ఆహార పదార్థాలు దోహదం చేస్తాయంటూ పోస్ట్‌లో భాగంగా చెప్పుకొచ్చిందీ సంస్థ.
కరోనా మహమ్మారి మన దేశంలోకి అడుగుపెట్టిన దగ్గర్నుంచి భారత ఆహార భద్రత, నాణ్యతా ప్రమాణాల సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ) మరింత అలర్టయింది. ఈ వైరస్ బారిన పడకుండా తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు, ఇతర జాగ్రత్తల గురించి ఎప్పటికప్పుడు ట్విట్టర్ వేదికగా తెలియజేస్తూ అందరిలో అవగాహన పెంచుతోంది. ఈ క్రమంలోనే రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి, నాడీ వ్యవస్థను పటిష్ఠపరచుకోడానికి ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలో చెబుతూ తాజాగా మరో పోస్ట్ పెట్టిందీ సంస్థ.
బి-విటమిన్లు పుష్కలంగా..!
మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవాలంటే సరైన మోతాదులో ‘బి’ విటమిన్ తీసుకోవాల్సిందే అని సూచిస్తోందీ సంస్థ. అది కూడా విటమిన్ ‘బి’ అధికంగా లభించే ఈ ఆరు రకాల మొక్కల ఆధారిత ఆహార పదార్థాలు శ్రేయస్కరం అని సూచిస్తూ బొమ్మల రూపంలో వివరించింది ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ. ఇంతకీ అవేంటంటే..!
వాల్‌నట్స్
వాల్‌నట్స్‌లో మోనోశ్యాచురేటెడ్ కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయుల్ని తగ్గించడంలో సహాయపడతాయి. ఇక ఇందులోని లినోలెనిక్ ఆమ్లం గుండె జబ్బుల బారిన పడే రిస్క్‌ని తగ్గిస్తుంది. వాల్‌నట్స్‌లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు మెదడు ఆరోగ్యానికి చాలా మంచివి. అలాగే ఇందులో అధికంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇక ఈ నట్స్‌లోని బి-కాంప్లెక్స్ విటమిన్లు గర్భిణుల ఆరోగ్యానికి చాలా అవసరం.
రాగులు
పీచు, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా.. గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే పదార్థమే ఇది. క్యాల్షియం, ఐరన్ అధికంగా ఉండే రాగులు రోగనిరోధక శక్తిని పెంచడంలో, రక్తహీనతను తగ్గించడంలో దోహదం చేస్తాయి. ఇక రోజూ వీటిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల వీటిలోని మిథియోనైన్, లైసీన్ అనే అమైనో ఆమ్లాలు చర్మాన్ని నవయవ్వనంగా మార్చుతాయి. ఒత్తిడి, ఆందోళనలు.. వంటి మానసిక రుగ్మతల నుంచి కూడా విముక్తి కల్పిస్తుందీ అద్భుతమైన పదార్థం.
కందిపప్పు
ఫైబర్, ప్రొటీన్లతో పాటు ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్లు కందిపప్పులో పుష్కలంగా లభిస్తాయి. ఈ పప్పులో పొటాషియం శాతం కూడా ఎక్కువే. ఇది బీపీని అదుపులో ఉంచడంలో దోహదపడుతుంది. బరువు తగ్గాలన్నా, జీర్ణశక్తిని పెంచుకోవాలన్నా కందిపప్పుకు సాటి మరొకటి లేదు.
వేరుశెనగ
ఇందులో ఉండే ప్రొటీన్లు శరీరంలో పేరుకుపోయిన కొవ్వులు, క్యాలరీలను కరిగించి బరువు తగ్గడానికి సహాయపడతాయి. శరీరానికి తక్షణ శక్తిని అందించడంతో పాటు రక్తంలో చక్కెర స్థాయుల్ని అదుపులో ఉంచుతాయివి. అందుకే మధుమేహం ఉన్న వారికి పల్లీలు చక్కటి స్నాక్‌గా ఉపయోగపడతాయని నిపుణులు చెబుతుంటారు. ఉడికించిన, నానబెట్టిన లేదంటే వేయించిన పల్లీలను రోజూ తీసుకుంటే క్యాన్సర్ వచ్చే అవకాశం 58 శాతం తగ్గుతుందని ఓ సర్వేలో కూడా తేలింది. అలాగే గుండె ఆరోగ్యానికీ ఇవి మేలు చేస్తాయి.
అరటిపండ్లు
ఈ పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండె జబ్బుల బారిన పడకుండా కాపాడతాయి. అలాగే ఇందులో ఉండే మాంగనీస్, మెగ్నీషియం, క్యాల్షియం, ఐరన్, విటమిన్ ‘బి6’.. వంటి పోషకాలు శరీరానికి సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించడంలో సహకరిస్తాయి. ఇక ఇందులోని పొటాషియం బీపీని, గుండె కొట్టుకునే వేగాన్ని అదుపులో ఉంచుతుంది.. మెదడు ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
గోధుమపిండి
పోషకాహార లోపాన్ని అధిగమించడానికి ఇది చక్కటి ఆహారం. ఐరన్, ఫోలికామ్లం, ‘బి12’ విటమిన్‌తో నిండి ఉన్న ఈ పిండి రక్తహీనతను తగ్గించేందుకు దోహదం చేస్తుంది. ఇది గర్భిణులకు, పిల్లలకు కావాల్సిన విటమిన్లు, ఖనిజాలను అందిస్తుంది.
గమనిక: ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ సూచించిన ఈ ఆరు సూపర్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల అటు రోగనిరోధక శక్తిని పెంచుకుంటూనే.. ఇటు సంపూర్ణ ఆరోగ్యాన్నీ సొంతం చేసుకోవచ్చన్న విషయం తెలుసుకున్నారుగా! అయితే ఎలాగూ వీటిని తీసుకుంటున్నాం కదా అని కరోనా, ఇతర సీజనల్ వ్యాధుల విషయంలో అజాగ్రత్తగా ఉన్నారో సమస్యల్లో పడతారు. కాబట్టి ఆహారమనేది వ్యాధుల్ని మన శరీరంలోకి రాకుండా అడ్డుకునే ఒక చిన్న ఆయుధం వంటిది.. అందుకే మీరు పోషకాహారం తీసుకున్నప్పటికీ వ్యక్తిగత పరిశుభ్రత, మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం తప్పనిసరి. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా మీ ఆరోగ్య స్థితిలో ఏవైనా తేడాలు గమనిస్తే మాత్రం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వైద్యులను సంప్రదించడం ఉత్తమం.