ఈ కాలంలో విరివిగా లభించే మరో పండు దానిమ్మ. సీజన్ వచ్చిందంటే చాలు.. మార్కెట్‌లో ఎక్కడ చూసినా ఇవే కనిపిస్తాయి. దానిమ్మ గింజల్లో ఉండే ఔషధగుణాలు అంటువ్యాధులను తట్టుకునేలా శరీరానికి రోగనిరోధక శక్తిని అందిస్తాయి. మెదడుకు రక్తప్రసరణ సాఫీగా జరిగేలా చేసి, దాని పనితీరును మెరుగుపరుస్తాయి. దీంతో పాటు అతిసారం, గుండెజబ్బులు, రక్తహీనత, రక్తపోటు వంటి వ్యాధులను అరికడతాయి. గ్లాసు దానిమ్మ రసం తీసుకుంటే ఒక రోజుకు సరిపడా ఫోలిక్ ఆమ్లంలో 40శాతం పొందినట్లే. ఇందులోని విటమిన్ ఎ, సి, ఇ వల్ల చర్మం, జుట్టు ఆరోగ్యంగా తయారవుతాయి. అయితే దానిమ్మ రసంలో చక్కెర వేయకుండా తాగితేనే అందులోని ఈ లాభాలన్నీ సంపూర్ణంగా పొందచ్చు.
పియర్
యాపిల్‌ని పోలి ఉండే పియర్ పండ్లు ఈమధ్య అన్ని కాలాల్లోనూ అందుబాటులో ఉంటున్నాయి. కానీ ఇవి వానాకాలంలో ఎక్కువగా వస్తుంటాయి. ఇందులో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉండడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలను అధికమొత్తంలో అందజేస్తాయి. పెద్దపేగు క్యాన్సర్‌ను అరికట్టడంతో పాటు కీళ్లనొప్పులను తగ్గించడంలో ఈ పండు కీలకపాత్ర పోషిస్తుంది. మిగతా పండ్లతో పోల్చితే, పియర్‌లో అలర్జిక్ లక్షణాలు అతి తక్కువగా ఉండడం వల్ల దీన్ని ఔషధాల తయారీలో ఎక్కువగా వినియోగిస్తారు.
చెర్రీ
ఎర్రగా, ఎంతో అందంగా ఉండే చెర్రీ పండ్ల వల్ల కలిగే ప్రయోజనాలు కూడా ఎక్కువే. వీటిని తీసుకోవడం వల్ల అధిక బరువు, పొట్ట భాగంలోని కొవ్వు నుంచి విముక్తి పొందవచ్చు. మధుమేహం, మెదడుకు సంబంధించిన వ్యాధులను నియంత్రించడంలో చెర్రీ బాగా ఉపయోగపడుతుంది. నిద్రలేమితో బాధపడేవారు చెర్రీ పండ్లరసాన్ని తరచుగా తీసుకుంటే హాయిగా నిద్రపడుతుంది. వీటిని ఎక్కువగా తినడం వల్ల వృద్ధాప్యఛాయలు దరిచేరవు. గుండె ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచడంలో చెర్రీకి మించింది లేదు. కండరాల నొప్పుల నుంచి త్వరగా ఉపశమనం పొందాలంటే వీటిని తప్పకుండా తీసుకోవాల్సిందే.
యాపిల్
యాపిల్ పండులో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయనే సంగతి అందరికీ తెలిసినా, దానివల్ల కలిగే అసలు ప్రయోజనాలేంటో చాలామందికి సరిగ్గా తెలియకపోవచ్చు. యాపిల్ పండును నమలడం వల్ల నోట్లో విడుదలయ్యే లాలాజలం నోరు, దంతాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ పండు పేగుల్లో అధికంగా పేరుకుపోయిన కొవ్వును కరిగించి, వూబకాయం సమస్యకు చెక్ పెడుతుంది. ఫలితంగా గుండెజబ్బులు కూడా దరిచేరవు. యాపిల్‌లోని పీచుపదార్థం కారణంగా మల, మూత్ర విసర్జనలో ఎదురయ్యే సమస్యలు కూడా త్వరగా నయమవుతాయి. అమెరికాలో నిర్వహించిన ఓ సర్వే ప్రకారం కాలేయం, క్లోమం, పేగు, రొమ్ము క్యాన్సర్లను 23 శాతం వరకు నివారించే గుణం యాపిల్‌లో ఉందట. మలబద్ధకం, అతిసారం సమస్యతో ఇబ్బందిపడేవారు యాపిల్‌ను తీసుకుంటే మంచి ఫలితాన్ని పొందచ్చు. మొత్తానికి రోగనిరోధక శక్తిని పెంచి, అనేక వ్యాధులతో పోరాడే శక్తినిస్తుందీ అద్భుతమైన పండు. కేవలం వర్షాకాలంలోనే కాక అన్ని సీజన్లలోనూ యాపిల్ అందుబాటులో ఉంటోంది కాబట్టి సీజన్‌తో సంబంధం లేకుండా మన రోగనిరోధకశక్తిని పెంచుకోవచ్చు.
నేరేడు
ఏడాదిలో కనీసం ఒక్క నేరేడు పండైనా తినాలనేవారు మన పూర్వీకులు. ఎందుకంటే దీని వల్ల కలిగే లాభాలు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్థులకు ఇదో దివ్యౌషధమనే చెప్పాలి. నేరేడు పండును తీసుకుంటే మధుమేహం చాలావరకు నియంత్రణలో ఉంటుంది. అంతేకాదు.. ఇందులోని విటమిన్ 'సి' చర్మ ఆరోగ్యానికి, సౌందర్యానికి ఎంతో సహకరిస్తుంది. అజీర్తి, అతిసారం సమస్యల నుంచి గట్టెక్కించే పండు నేరేడు. దీని రసం తాగడం వల్ల అల్సర్ దరిచేరదు. ఇది గర్భాశయ సమస్యలను తగ్గించడంలోనూ బాగా ఉపకరిస్తుంది. అయితే ఏదైనా అతిగా తింటే ప్రమాదమే. దీనికి నేరేడు కూడా మినహాయింపు కాదు. వీటిని ఎక్కువ మోతాదులో తీసుకుంటే దగ్గు, ఒళ్లు నొప్పులు వంటివి వస్తాయి. నేరేడును పరగడుపున తినడం మంచిది కాదు. అలాగే వీటిని తిన్న వెంటనే పాలు తాగకూడదని నిపుణుల సలహా. గర్భిణులు, బాలింతలు నేరేడుకు దూరంగా ఉండడం మంచిది.
అల్‌బకర..
కేవలం వర్షాకాలంలో మాత్రమే లభించే అల్‌బకర పండ్లు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా ఈకాలంలో ఎక్కువగా ఇబ్బందిపెట్టే జలుబు సమస్యను తగ్గించి, రోగనిరోధకశక్తి మెరుగుపడేలా చేస్తాయి. అధిక రక్తపోటుతో బాధపడేవారు రోజూ 3 లేదా 4 అల్‌బకర పండ్లను తీసుకోవడం వల్ల సమస్య నుంచి ఉపశమనం పొందచ్చు. టైప్-2 మధుమేహం ఉన్నవారికి కూడా ఇది మంచి ఔషధంలా పనిచేస్తుంది. గుండెపోటు, రొమ్ము క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల ముప్పును తగ్గించడంతో పాటు ఆస్తమా, జ్ఞాపకశక్తి తగ్గడం, అధిక బరువు వంటి సమస్యల నుంచి బయటపడేస్తుంది. అయితే అల్‌బకరను మరీ ఎక్కువగా తీసుకోకపోవడం మంచిది.
ఇవే కాదు.. జామ, సపోట, అరటి, బత్తాయి.. ఇలా అన్నీ మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి, వ్యాధులతో పోరాడే సామర్థ్యాన్ని అందజేసేవే. ముఖ్యంగా వానాకాలంలో ఎక్కువ రకాల పండ్లు అందుబాటులో ఉంటాయి కాబట్టి వీటిని తీసుకొని మీ ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుకోండి. అయితే ఈ మధ్య పండ్లను కార్బైడ్ వేసి పండిస్తున్నారని వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో నేరుగా తోట నుంచి తెప్పించిన పండ్లను తినడం శ్రేయస్కరం. వీలైతే ఆర్గానిక్ పద్ధతిలో పండించిన వాటిని తీసుకునే ప్రయత్నం చేయండి.
పండు తింటే నిండు జీవితం... తింటారా మరి ?