ఈ మధ్యకాలంలో జుట్టు రాలడం అనేది ప్రతి మనిషిలోనూ సర్వసాధారణంగా మారిపోయింది. జుట్టు రాలిపోవడం వల్ల చాలా మంది డిప్రెషన్లోకి జారుకుని సూసైడ్ చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. వయసుతో సంబంధం లేకుండా ఆడ, మగ, చిన్నాపెద్ద ఇలా అందరిలోనూ ఈ సమస్య తలెత్తుతోంది. జుట్టు పెరగటానికి దోహదపడే ప్రత్యేకించి ఆహారమేదీ ఉండకపోయినా.. కానీ కొన్ని పోషకాలు వెంట్రుకలకు మేలు చేస్తాయనటంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ సమస్యను నివారించేందుకు కొన్నిరకాల ఆహారపదార్థాలను తీసుకుంటే మంచిదని నిపుణులు తెలిపారు. వీటితో పాటు జుట్టు రాలేందుకు గల కారణాలను తెలిపారు. అవేంటంటే?
జుట్టురాలేందుకు గల కారణాలు:
- నిద్రలేమి
- తరచూ షాంపూలు మార్చటం
- మానసిక ఒత్తిడి
- ఐరన్ లోపం
- జెనటిక్ సమస్య
- జుట్టుకు రంగులు వేయడం
- కొవిడ్ ఇన్‌ఫెక్షన్లు
- పొగత్రాగటం
- దుమ్ము, ధూళి
- థైరాయిడ్
- విటమిన్ల లోపం
- పోషకాహార లోపం
తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు:
- మొలకెత్తిన గింజలు
- క్యారెట్, బీట్రూట్
- గుమ్మడి గింజలు
- పొద్దు తిరుగుడు పువ్వు గింజలు
- ఆకుకూరలు
- కూరగాయలు, పండ్ల రసాలు
- చేపలు, చికెన్, గుడ్లు
- దాల్చిన చెక్క
- చిలగడ దుంపలు
- పెరుగు, పన్నీరు, పాలు
నిగనిగకు చేపలు
ఒమేగా3 కొవ్వు ఆమ్లాలను మన శరీరం తయారుచేసుకోలేదు. వీటిని ఆహారం లేదా మాత్రల రూపంలోనే తీసుకోవాల్సి ఉంటుంది. ఇవి జబ్బులు రాకుండా కాపాడటమే కాదు.. జుట్టు పెరగటానికి, నిగనిగలాడటానికీ అవసరమే. సాల్మన్, సార్‌డైన్, మాకెరల్ వంటి చేపల్లో ఇవి దండిగా ఉంటాయి.
పెరగటానికి పెరుగు
వెంట్రుకల ఆరోగ్యానికి ప్రొటీన్ అత్యవసరం. ఇది పెరుగులో దండిగా ఉంటుంది. అంతేకాదు.. మాడుకు రక్త సరఫరా మెరుగుపడటానికి, వెంట్రుకలు పెరగటానికి తోడ్పడే విటమిన్ బి5 (పాంటోథెనిక్ యాసిడ్) కూడా ఉంటుంది. ఇది వెంట్రుకలు పలుచబడకుండా, ఊడిపోకుండా కాపాడుతుంది.
దృఢత్వానికి పాలకూర
చాలా ఆకుకూరల్లో మాదిరిగానే పాలకూరలోనూ బోలెడన్ని పోషకాలుంటాయి. విటమిన్ ఎ దండిగా ఉంటుంది. ఐరన్, బీటా కెరొటిన్, ఫోలేట్, విటమిన్ సి సైతం ఉంటాయి. ఇవన్నీ కలిసి మాడు ఆరోగ్యంగా ఉండటానికి దోహదం చేస్తాయి. వెంట్రుకలు పెళుసుబారకుండా, చిట్లిపోకుండా కాపాడతాయి.
చిట్లకుండా జామ
జామపండ్లలో విటమిన్ సి దండిగా ఉంటుంది. వెంట్రుకలు చిట్లకుండా, విరిగిపోకుండా చూడటానికిది తోడ్పడుతుంది. ఒక కప్పు జామ పండ్ల ముక్కలతో 377 మి.గ్రా. విటమిన్ సి లభిస్తుంది. ఇది మన రోజువారీ అవసరాల కన్నా నాలుగు రెట్లు ఎక్కువ!
రక్త ప్రసరణకు దాల్చిన చెక్క
దాల్చిన చెక్క రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. దీంతో జుట్టు కుదుళ్లకు ఆక్సిజన్, పోషకాలు ఎక్కువగా అందుతాయి. ఫలితంగా జట్టు ఆరోగ్యంగా ఉంటుంది.
ఊడకుండా ఐరన్
తగినంత ఐరన్ తీసుకోకపోయినా జుట్టు ఊడిపోవచ్చు. మాంసాహారంలో.. ముఖ్యంగా కాలేయం వంటి అవయవాల్లో ఐరన్ దండిగా ఉంటుంది. ఆకు కూరలతోనూ లభిస్తుంది. ప్రస్తుతం ఐరన్‌ను కలిపిన పదార్థాలూ అందుబాటులో ఉంటున్నాయి.
పొడిబారకుండా చిలగడ దుంపలు
చిలగడ దుంపల్లో బీటా కెరొటిన్ అనే యాంటీఆక్సిడెంట్ ఉంటుంది. దీన్ని మన శరీరం విటమిన్ ఎగా మార్చుకుంటుంది. ఇది జట్టు పొడిబారటాన్ని అరికడుతుంది. నిగనిగలాడినట్టు కనిపించేలా చేస్తుంది. క్యారెట్, గుమ్మడి, మామిడిపండ్లతోనూ బీటా కెరొటిన్ లభిస్తుంది.
దట్టానికి చికెన్, గుడ్లు
వెంట్రుకలన్నీ ఎప్పుడూ ఒకేలా పెరగవు. కొంతకాలం విశ్రాంతి దశలో ఉంటాయి. తగినంత ప్రొటీన్ అందకపోతే వెంట్రుకలు ఈ దశలోనే ఉంటాయి. అదే సమయంలో పాత వెంట్రుకలు రాలిపోతుంటాయి. మాంసంలో ప్రొటీన్ ఉంటుంది కానీ సంతృప్తకొవ్వు ఎక్కువ. అదే చికెన్‌తో తక్కువ సంతృప్తకొవ్వుతోనే మంచి ప్రొటీన్ లభిస్తుంది. ఇక గుడ్లలోని బయోటిన్ వెంట్రుకలు పెరగటానికి తోడ్పడుతుంది.
మూలికా ఔషధం..
జుట్టు రాలకుండా ఉండేందుకు సంప్రదాయ ఔషధాలు సైతం మెరుగ్గా పనిచేస్తాయి. అలాంటి ఔషధాన్ని తయారు చేసేందుకు కావాల్సిన మూలికలు, తయారీ విధానం ఇప్పుడు చూద్దాం..
కావాల్సిన మూలికలు:
- కుంకుడుకాయ పొడి
- ఉసిరి పొడి
- మెంతుల చూర్ణం
- మందార చూర్ణం
- యష్టిమధు చూర్ణం
తయారీ విధానం:
మొదట ఓ గిన్నెలో 200 గ్రాముల కుంకుడుకాయ పొడి, 25 గ్రాముల మెంతుల పొడి, ఉసిరి పొడి, యష్టిమధు చూర్ణం, మందార పువ్వుల చూర్ణాన్ని తీసుకుని బాగా కలుపుకోవాలి. దీనిని ఓ గాజు సీసాలో దాచిపెట్టుకోవాలి. అనంతరం స్నానం చేసేముందు స్టవ్ వెలిగించి కొద్దిగా నీటిని వేడి చేసుకోవాలి. ఆ తర్వాత మనకు కావాల్సిన మేరకు తయారు చేసుకున్న పొడిని నీటిలో పోసి కలుపుకోని గంటసేపు నానబెట్టుకుని తలకు షాంపూలాగా పెట్టుకోవాలి.