Diabetes : కొత్తగా మధుమేహ వ్యాధి (టైప్-2 డయాబెటిస్) బారిన పడుతున్న వారిలో 80 శాతం మందిలో కొలెస్ట్రాల్ స్థాయులు అసాధారణంగా కనిపిస్తున్నాయని ఇండియన్ డయాబెటిస్ స్టడీ (ఐడీఎస్) గుర్తించింది. ఈ రోగుల్లో అతి తక్కువ హెచ్‌డీఎల్ (మంచి కొలెస్ట్రాల్)తోపాటు ఎక్కువ ఎల్‌డీఎల్ (చెడు కొలెస్ట్రాల్) ఉంటున్నట్లు వెల్లడించింది. ఎరీస్ లైఫ్ సైన్సెస్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 2020-21 మధ్యకాలంలో 5,080 మందిపై ఈ అధ్యయనం చేసినట్లు ఐడీఎస్ ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ డాక్టర్ ఏజీ ఉన్నికృష్ణన్, ఎండోక్రైనాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు, ఉస్మానియా మెడికల్ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ సహాయ్ తెలిపారు. శుక్రవారం వర్చువల్‌గా నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. కొలెస్ట్రాల్ హెచ్చుతగ్గుల వల్ల మధుమేహమే కాకుండా.. కార్డియోవాస్క్యులర్ వ్యాధుల (సీవీడీ) ముప్పు పొంచి ఉన్నట్లేనని హెచ్చరించారు. ఇలాంటివారు ప్రధానంగా ఆహార మార్పులతోపాటు శారీరక వ్యాయామాలు, రక్తంలో గ్లూకోజ్ నియంత్రణపై దృష్టి పెట్టాలని సూచించారు. కొలెస్ట్రాల్ స్థాయులు సాధారణ స్థితిలో ఉండేలా చికిత్సలు తీసుకోవాలన్నారు. చెడు కొలెస్ట్రాల్ వల్ల చిన్న వయసులోనే కొందరు ఆకస్మిక గుండె వైఫల్యాల బారిన పడుతున్నారని వివరించారు.
- గుర్తించిన కీలకాంశాలు.. : కొత్తగా టైప్-2 మధుమేహ వ్యాధి బారిన పడిన 55.6 శాతం మందిలో హెచ్‌డీఎల్-సి(హై డెన్సిటీ లిపిడ్-కొలెస్ట్రాల్) విలువలు తక్కువగా నమోదయ్యాయి. 82.5 శాతం మంది రోగుల్లో ఏదో ఒక రకమైన కొలెస్ట్రాల్ అసాధారణంగా ఉంటోంది.
- 42 శాతం మంది అధిక రక్తపోటు వ్యాధి ముప్పునకు చేరువలో ఉన్నారు. 37.3 శాతం మంది అప్పటికే ఈ సమస్యతో బాధపడుతున్నారు.
- ఈ రోగుల్లో బీఎంఐ (బాడీ మాస్ ఇండెక్స్) 27.2 (అధిక బరువు)గా ఉంది.
- 11.2 శాతం మందిలో మూత్రపిండాల వైఫల్య సమస్య కనిపిస్తోంది.
- ఇదీ చదవండి : కొవ్వు అణువులలో మధుమేహం, గుండెజబ్బుల గుట్టు!