Exercise To Increase Sex Stamina In Telugu : దాంపత్య జీవితంలో శృంగారం అనేది ఒక మధురానుభూతి. అయితే నేటి ఆధునిక జీవనశైలి వల్ల స్త్రీ, పురుషుల లైంగిక పటుత్వం అనేది బాగా తగ్గిపోతోందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా స్థూలకాయం కారణంగా 31 శాతం మంది పురుషులు, 43 శాతం మంది మహిళలు తమ దైనందిన లైంగిక జీవితానికి దూరమవుతున్నారు. చెప్పుకోలేని వేదనలకు గురవుతున్నారు. ఈ ప్రభావం దంపతుల అనుబంధాలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతోంది. అందుకే ఈ సమస్యను అధిగమించేందుకు.. సరైన ఆహార నియమాలు, వ్యాయామాలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. వాస్తవానికి వివిధ రకాల వ్యాయామాలు.. మనుష్యుల్లోని సెక్స్ కోరికలను పెంచడానికి కూడా దోహదం చేస్తాయని అంటున్నారు. ఈ వ్యాయామాల వల్ల ఇంకా ఏమేమి ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆకర్షణ పెరుగుతుంది!
ప్రతిరోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల చక్కటి శరీరాకృతి ఏర్పడుతుంది. ఇది వ్యక్తులలో స్వీయ ప్రేరణను, ఆత్మవిశ్వాసాన్ని కచ్చితంగా పెంచుతుంది. మరీ ముఖ్యంగా మీ జీవితభాగస్వామికి మీ పట్ల మరింత ఆకర్షణ పెరుగుతుంది. ఫలితంగా మధురమైన లైంగిక చర్యకు ప్రేరణ కలుగుతుంది. ఆ కలయిక కూడా భాగస్వాములు ఇద్దరూ ఆస్వాదించేలా ఉంటుంది.
కండరాలు చురుగ్గా..!
వ్యాయామం చేయని మహిళలతో పోల్చితే.. వ్యాయామం చేసే స్త్రీలలో లైంగిక కోరికలు బాగా పెరిగినట్లు టెక్సాస్ విశ్వవిద్యాలయం నిర్వహించిన ఓ సర్వేలో నిరూపణ అయ్యింది. అది ఎలాగంటే.. వ్యాయామం చేసేటప్పుడు.. క్రమంగా గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. శ్వాస వేగం కూడా అందుకు అనుగుణంగా పెరుగుతుంది. ఫలితంగా కండరాలు మరింత చురుగ్గా పనిచేయడం ప్రారంభిస్తాయి.. ఈ మార్పులన్నీ అంతిమంగా లైంగిక కోరికలు పెరిగి, శృంగారాన్ని బాగా ఆస్వాదించేలా చేస్తాయి.
ఒత్తిడిని తగ్గిస్తాయి!
ఒత్తిడి అనేది మనలోని శృంగారపరమైన కోరికల్ని, లైంగికాసక్తిని హరించేస్తుంది. వివిధ వ్యక్తిగత, వృత్తిపరమైన కారణాలు మనల్ని ఒత్తిడిలోకి, ఆందోళనల్లోకి నెట్టివేస్తున్నాయి. అందుకే వీటిని నియంత్రించడానికి ప్రతీ రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ముఖ్యంగా ఒకే రీతి వ్యాయామాలు కాకుండా.. వివిధ రకాల వర్కవుట్స్ చేయాలి. దీని వల్ల శరీరంలో ఎండార్ఫిన్స్ (హ్యాపీ హార్మోన్లు) విడుదలవుతాయి. ఇవి శారీరక నొప్పులను, ఒత్తిడి, ఆందోళనలను తగ్గిస్తాయి. అంతే కాదు.. మీ సంతోషాన్ని, ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తాయి. ఫలితంగా లైంగికాసక్తి, సెక్స్ సామర్థ్యం రెండూ క్రమంగా పెరుగుతాయి.
రక్తప్రసరణ మెరుగవుతుంది!
ఆరోగ్యం మెరుగ్గా ఉండాలన్నా, చురుగ్గా పనిచేయాలన్నా.. శరీరంలోని అవయవాలు అన్నింటికీ చక్కగా రక్తప్రసరణ జరగడం చాలా అవసరం. ముఖ్యంగా లైంగిక అవయవాలకు ఇది చాలా అవసరం. ఇందుకోసం వ్యాయామమే సరైన మార్గం. వర్కవుట్స్ చేసే క్రమంలో గుండె కొట్టుకునే వేగం క్రమంగా పెరుగుతుంది. తద్వారా శరీరంలోని అవయవాలు అన్నింటికీ రక్తప్రసరణ సాఫీగా జరుగుతుంది. ఫలితంగా లైంగిక అవయవాలు చాలా బాగా యాక్టివేట్ అవుతాయి. ఈ విధంగా శరీరంలో జరిగే ఈ మార్పులన్నీ లైంగిక అవయవాల ఆరోగ్యానికి, సెక్స్ సామర్థ్యం పెరగడానికి దోహదం చేస్తాయి.
ఏయే వ్యాయామాలు మంచివి?
Best Exercises For Sexual Strength : లైంగిక ఆసక్తిని, శృంగార సామర్థ్యాన్ని పెంచాలంటే కొన్ని రకాల వ్యాయామాలు చేయడం మంచిదని సెక్సాలజిస్టులు సూచిస్తున్నారు. ముఖ్యంగా కీగల్, స్క్వాట్స్, లాంజెస్, పుషప్స్, ప్లాంక్ వ్యాయామాలు చేయాలి. వీటితోపాటు ప్రతిరోజూ క్రమం తప్పకుండా నడక, పరుగు, ఈత, సైక్లింగ్.. లాంటివి చేయాలి. ఇవి కటి వలయంలోని కండరాల్ని దృఢం చేసి లైంగిక సామర్థ్యాన్ని పెంచుతాయి. అయితే ఈ వ్యాయామాలను ఒంటరిగా కాకుండా.. మీ జీవిత భాగస్వామితో కలిసి జంటగా చేస్తే.. ఇద్దరి మధ్య ఆకర్షణ విపరీతంగా పెరుగుతుంది. ఫలితంగా మీ కలయిక మధురానుభూతిని అందిస్తుంది.
నోట్: మీరు మంచి జీవనశైలిని కలిగి ఉండి, క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తున్నప్పటికీ.. లైంగికాసక్తి పెరగకపోయినా లేదా సెక్స్ సామర్థ్యం తగ్గినా.. లేదా ఇతర వ్యక్తిగత కారణాలేవైనా ఉన్నా.. ఆలస్యం చేయకుండా సంబంధిత నిపుణుల్ని సంప్రదించాల్సి ఉంటుంది.