సమస్య: నాకు మధుమేహం, హైబీపీ ఉన్నాయి. నడుస్తుంటే పాదాలకు తారు అంటుకున్నట్టుగా అనిపిస్తుంటుంది. పాదాల్లో నాడులు దెబ్బతినటమే దీనికి కారణమని డాక్టర్లు చెప్పారు. మిగిలిన నాడులను కాపాడుకోవటం తప్ప మరేం చేయలేమన్నారు. ఇప్పుడేం చేయాలి? ఇలా ఎందుకు జరుగుతుంది? -పీవీబీఎస్‌ఆర్ మూర్తి (ఈమెయిల్ ద్వారా)
సలహా: ఒకసారి నాడులు దెబ్బతింటే తిరిగి కుదురుకోవటమనేది అసాధ్యం. మిగిలిన నాడులు దెబ్బతినకుండా, స్పర్శజ్ఞానం పూర్తిగా తగ్గిపోకుండా చూసుకోవటం ఒక్కటే మార్గం. మీకు ఇప్పటికే నాడులు చాలావరకు దెబ్బతిన్నాయి కాబట్టి మీరు పాదాలను గాజుబొమ్మల్లా జాగ్రత్తగా కాపాడుకోవాలి. దీర్ఘకాలంగా మధుమేహంతో బాధపడేవారిలో నాడులు దెబ్బతినే ప్రమాదం పొంచి ఉంటుంది. దీన్నే డయాబెటిక్ న్యూరోపతీ అంటారు. ఈ సమస్య ఒక్క కాళ్లలోనే కాకుండా మెదడు, వెన్నుపాము, నాడుల మూలాల్లోనూ ఉండొచ్చు. మన కాళ్లలో స్పర్శజ్ఞానాన్ని కలిగించటానికి, కదలికలకు తోడ్పడటానికి రెండు రకాల నాడులుంటాయి.
పదేళ్లుగా మధుమేహంతో బాధపడేవారిలో దాదాపు అందరికీ స్పర్శజ్ఞానానికి సంబంధించిన ఏదో ఒక సమస్య వచ్చే అవకాశముంది. నాడీ వ్యవస్థకు రక్తసరఫరా చేసే కేశనాళికలు సన్నబడిపోవటం, ఇన్సులిన్ ప్రమేయం లేకుండా రక్తంలో ఎక్కువైన గ్లూకోజును శక్తిగా మలచుకోవటానికి శరీరం ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవటం, నాడుల మీదుండే రక్షణ పొర క్షీణించటం, స్పర్శజ్ఞానం కోల్పోవటం వల్ల మన రక్షణ వ్యవస్థ దెబ్బతినటం, అనుసంధాన కణజాలం తయారుకాకపోవటం.. ఒంట్లో కీటోన్స్ పెరగటం వల్ల రక్తంలో ఆమ్లగుణం పెరగటం.. యూరియా, క్రియాటిన్, యూరిక్ యాసిడ్ ఒంట్లోంచి సరిగా బయటకు వెళ్లకపోవటం.. వంటివన్నీ నాడులను దెబ్బతీస్తాయి. దీంతో స్పర్శజ్ఞానం తగ్గిపోతుంది. ఏదైనా దెబ్బలు తగిలినా, గీసుకుపోయినా, బొబ్బలు పడినా వెంటనే తెలియదు. ఫలితంగా పుండ్లు, ఇన్‌ఫెక్షన్లు తలెత్తుతుంటాయి. నాడులు దెబ్బతినకుండా నివారించుకోవటానికి ఏకైక మార్గం రక్తంలో గ్లూకోజు మోతాదులను కచ్చితంగా నియంత్రణలో ఉండేలా చూసుకోవటమే. మీకు ఇప్పటికే నాడులు దెబ్బతిన్నాయి కాబట్టి గ్లూకోజును కచ్చితంగా నియంత్రణలో ఉంచుకోవటం అత్యవసరం. మధుమేహ మందులు, వాటితో పాటు ఇన్సులిన్ ఇంజెక్షన్లతో గ్లూకోజు నియంత్రణలో ఉండటమే కాకుండా నాడులు దెబ్బతినకుండానూ ఉంటాయి. అలాగే పాదాలను జాగ్రత్తగా కాపాడుకోవాల్సి ఉంటుంది.
- ప్రతిరోజూ పాదాలను చేత్తో తడిమి చూసుకోవాలి. చర్మం ఎక్కడైనా గీసుకుపోయిందా? ఏవైనా దెబ్బలు తగిలాయా? పెంకులు, ముళ్ల వంటివేమైనా గుచ్చుకున్నాయా? అనేది గమనించాలి. మీరు చూసుకోవటానికి వీలు కాకపోతే ఇంట్లోవాళ్లను చూడమనైనా చెప్పాలి. పాదం కింద అద్దం పెట్టి అయినా పాదాలు ఎలా ఉన్నాయన్నది చూసుకోవచ్చు.
- చిన్న టబ్‌లో నీళ్లు పోసి (నీళ్లు వేడిగా ఉండకూడదు), అందులో కొద్దిగా యాంటీసెప్టిక్ ద్రావణం వేసి రోజూ కాసేపు పాదాలను అందులో పెట్టాలి. అయితే మరీ ఎక్కువసేపు పాదాలను నీటిలో పెట్టరాదు. ఎందుకంటే 20 నిమిషాల కన్నా ఎక్కువసేపు ఉంచితే పాదం నానిపోయి చర్మం ఊడివచ్చే ప్రమాదముంది. పాదాలను నీటిలోంచి తీశాక ఏమాత్రం తడి లేకుండా తువ్వాలుతో శుభ్రంగా తుడుచుకోవాలి. అనంతరం ముఖానికి వేసుకునే పౌడర్‌ను చల్లాలి. దీంతో ఏదైనా తేమ ఉంటే దాన్ని పౌడరు పీల్చేసుకుంటుంది. ఇలా రోజూ ఉదయం, సాయంత్రం పాదాలను శుభ్రం చేసుకోవాలి. దీంతో పుండ్లు, ఇన్‌ఫెక్షన్లను నివారించుకోవచ్చు.
- చెప్పుల విషయంలోనూ తగు జాగ్రత్తలు తీసుకోవాలి. బొటనవేలు చుట్టూరా లేదా బొటనవేలు, దాని పక్క వేలు మధ్యలో పట్టీ లేని చెప్పులనే ఎంచుకోవాలి. పాదం మీద అడ్డంగా ఒకటి లేదా రెండు పట్టీలు ఉండేలా చూసుకోవాలి. మధుమేహుల్లో పాదాల సైజు ఎప్పుడూ ఒకేలా ఉండదు. రోజంతా మారిపోతూ ఉంటుంది. కాబట్టి పాదం మీది పట్టీలు వెల్‌క్రోతో కూడినవైతే మంచిది. దీంతో పాదం సైజుకు తగ్గట్టుగా పట్టీలను అమర్చుకోవచ్చు. అలాగే పాదం జారిపోకుండా మడమ వెనకభాగాన ఆధారం ఉండేలా చూసుకోవాలి. మధుమేహుల్లో పాదం మధ్యలో ఒంపు (ఆర్చ్) తగ్గిపోతుంది. దీంతో నడుస్తున్నప్పుడు పాదం మీద ఒత్తిడి పెరిగి, పాదం త్వరగా దెబ్బతింటుంది. కాబట్టి పాదం ఒంపు వద్ద కాస్త ఎత్తుగా ఉండేలా చూసుకోవాలి. అలాగే పాదం కింద మెత్తటి పొర ఉండే చెప్పులు ఎంచుకోవాలి. ఇప్పుడు మధుమేహుల కోసం ప్రత్యేకంగా చెప్పులు అందుబాటులో ఉంటున్నాయి కూడా. వీలైతే వీటిని ధరించటం మంచిది. సాక్స్ వేసుకుంటే చెమటను పీల్చుకునే కాటన్ సాక్స్‌నే ధరించాలి.
- దేవాలయాల లోపల తప్ప ఎక్కడికి వెళ్లినా కాళ్లకు విధిగా చెప్పులు ధరించాలి.
- పాదాలకు రక్తప్రసరణ మెరుగుపడటానికి తోడ్పడే వ్యాయామాలు చేయటం మంచిది.
ఇదీ చదవండి:రాత్రి మగతకు చిరు సాయం!