'రాగి' పాత్రలు.. నీటిని నిల్వ చేసుకోవడానికైనా, ఆహారాన్ని వండుకోవడానికైనా, వండిన ఆహారం తినడానికైనా.. ఇలా ప్రతి దానికీ వారు వాటినే ఉపయోగించేవారు. అందులోని సకల పోషకాలు తీసుకునే ఆహారంలో చేరి.. అవి శరీరంలోని ఇన్ఫెక్షన్లు, బ్యాక్టీరియాతో పోరాడి ఎలాంటి అనారోగ్యాలు రాకుండా కాపాడేవి. అయితే ఆ రాగి పాత్రలు ఇప్పుడు కాస్త రూపురేఖల్ని మార్చుకొని మళ్లీ మన ముందుకొచ్చేశాయి. అంతేకాదు.. వాటిని ఉపయోగించే వారూ నానాటికీ పెరిగిపోతున్నారు. ఈ క్రమంలో రాగి పాత్రల్లో నిల్వ చేసిన నీటిని తాగడం, రాగి పాత్రల్లో ఆహారం తినడం.. వంటి వాటి వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం రండి...
అల్సర్లు తగ్గుతాయి!
మనం తీసుకునే ఆహారం, మానసిక ఒత్తిడి కారణంగా శరీరంలో టాక్సిన్లు పేరుకుపోతాయి. అవి శరీరంలో ఆమ్ల స్థాయుల్ని పెంచుతాయి. ఇది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. కాబట్టి శరీరంలోని పీహెచ్ స్థాయుల్ని అదుపులో ఉంచడంతో పాటు శరీర ఉష్ణోగ్రతను కంట్రోల్ చేయాలంటే ఆల్కలైన్ సమ్మేళనాలు చాలా అవసరం. అవి రాగిలో ఎక్కువగా ఉంటాయి. అందుకే చాలామంది రాగి పాత్రల్లో రాత్రంతా నిల్వ చేసిన నీటిని ఉదయం పూట తీసుకుంటూ ఉంటారు. ఇలా చేయడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. పొట్టలో ఏర్పడిన అల్సర్లు కూడా తగ్గుముఖం పట్టడంతో పాటు జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది. అంతేకాదు.. రోజూ రాగి పాత్రల్ని ఉపయోగించడం వల్ల కాలేయం, మూత్రపిండాల పనితీరు మెరుగుపడి శరీరంలోని వ్యర్థాలు బయటికి వెళ్లిపోతాయి.
అధిక బరువుతో సతమతమవుతున్నారా?
చాలామంది బరువు తగ్గాలని శతవిధాలా ప్రయత్నిస్తుంటారు. కఠినమైన ఆహార నియమాలు పాటించడం, వ్యాయామాలు చేయడం.. వంటి వాటితో రోజూ కష్టపడుతుంటారు. కానీ రోజూ రాత్రంతా రాగి పాత్రల్లో నిల్వ చేసిన నీటిని ఉదయాన్నే తాగడం, రాగి పాత్రల్లో వండుకోవడం, తినడం.. వంటివి చేయడం వల్ల సులభంగా బరువు తగ్గచ్చని చెబుతున్నారు నిపుణులు. ఎందుకంటే శరీరంలో పేరుకుపోయిన కొవ్వును విచ్ఛిన్నం చేసే గుణాలు కాపర్‌లో అధికంగా ఉంటాయి. తద్వారా అధిక బరువును తగ్గించుకోవడంతో పాటు దానివల్ల వచ్చే ఇతర అనారోగ్యాలు రాకుండా కాపాడుకోవచ్చు.
గుండె సమస్యలు దూరం..!
అధిక ఒత్తిళ్లు, అనవసర విషయాలకు ఆందోళన పడడం.. వంటివన్నీ రక్తపోటు హెచ్చుతగ్గులకు కారణమవుతాయి. అలాగే మనం తినే ఆహారం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయులు కూడా శరీరంలో పెరుగుతాయి. ఈ ప్రభావం గుండె ఆరోగ్యంపై పడుతుంది. మరి మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయులు తగ్గి బీపీ, హార్ట్‌బీట్ అదుపులో ఉండాలన్నా, గుండె జబ్బులకు దూరంగా ఉండాలన్నా అది కాపర్ వల్లే సాధ్యమవుతుందని అమెరికన్ క్యాన్సర్ సొసైటీ వెల్లడించింది. కాబట్టి రోజూ రాగి పాత్రల్లో నిల్వ ఉంచిన నీరు తాగడం, రాగి పాత్రల్లో భోంచేయడం.. వంటివి చేస్తే గుండె జబ్బుల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు.
అందానికీ ఇది అవసరమే!
చర్మం మృదువుగా ఉండాలన్నా, జుట్టు నల్లగా మారాలన్నా.. మన శరీరంలో ఉత్పత్తయ్యే మెలనిన్ అనే పిగ్మెంట్‌పైనే అది ఆధారపడి ఉంటుంది. శరీరంలో మెలనిన్‌ను ఉత్పత్తి చేసే అతి ముఖ్యమైన ఖనిజం కాపర్. అంతేకాదు.. చర్మంలో ఎప్పటికప్పుడు కొత్త కణాలు ఉత్పత్తయ్యేందుకు ఇది దోహదం చేస్తుంది. తద్వారా చర్మం నిగారింపును సంతరించుకుంటుంది. మృదువుగా మారుతుంది. అలాగే జుట్టు నెరవకుండా నల్లగా, సిల్కీగా ఉంచడంలోనూ కాపర్ పాత్ర చాలానే ఉందని చెప్పుకోవచ్చు.
లోపలి గాయాలు ఇట్టే మానిపోతాయ్!
- సాధారణంగా శరీరం బయట అయ్యే గాయాల కంటే శరీరం లోపల అయ్యే గాయాలు మానాలంటే చాలా కాలం పడుతుంది. మరి, అలాంటి గాయాలు కూడా త్వరగా మానిపోవాలంటే అది రాగితోనే సాధ్యమవుతుంది. అందుకు రాగిలోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలే కారణం.
- వయసు తక్కువైనా కొందరికి ముఖం ముడతలు పడడం, నుదురుపై గీతలు రావడం.. వంటి వృద్ధాప్య ఛాయలు కనిపిస్తుంటాయి. ఇలాంటి సమస్యలకు కారణమయ్యే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడే యాంటీఆక్సిడెంట్ గుణాలు రాగిలో బోలెడు. అలాగే కొత్త కణాల ఉత్పత్తికీ రాగి ఎంతగానో తోడ్పడుతుంది. తద్వారా వృద్ధాప్య ఛాయలు తగ్గి నవయవ్వనంగా కనిపించే అవకాశముంది.
- రాగిలోని బలమైన యాంటీఆక్సిడెంట్ గుణాలు శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడతాయి. తద్వారా క్యాన్సర్ కణాలు పెరగకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఇలా క్యాన్సర్ ముప్పును చాలా వరకు తగ్గిస్తుంది రాగి.
- వాతావరణంలోని కొన్ని బ్యాక్టీరియాలు మన శరీరంపై తీవ్ర ప్రభావాన్ని చూపి వివిధ రకాల అనారోగ్యాలకు కారణమవుతాయి. మరి, ఇలాంటి బ్యాక్టీరియాలతో పోరాడి.. వాటిని విచ్ఛిన్నం చేసే స్వభావం రాగిలో ఉంటుంది. తద్వారా పలు రకాల ఇన్ఫెక్షన్ల బారి నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు.
- సరైన మోతాదులో కాపర్ శరీరానికి అందకపోవడం వల్ల థైరాయిడ్ గ్రంథి పనితీరు దెబ్బతింటుంది. తద్వారా హైపోథైరాయిడిజం, హైపర్‌థైరాయిడిజం.. బారిన పడే అవకాశముంది. మరి, శరీరంలో కాపర్‌లేమిని పూరించాలంటే రాగి పాత్రల్లో తినడం, రాగి పాత్రల్లో నిల్వ చేసిన నీటిని తాగడం అలవాటు చేసుకోవాలి.
- కీళ్లలో వాపు తగ్గడానికీ రాగి చాలా దోహదం చేస్తుంది. ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలే ఇందుకు కారణం.
- శరీరంలో కొత్త కణాల్ని సృష్టించడమే కాదు.. మనం తీసుకునే ఆహారం నుంచి ఐరన్‌ను శోషించుకొని శరీరానికి అందించడానికీ ఈ ఖనిజం ఎంతగానో ఉపయోగపడుతుంది. తద్వారా రక్తహీనతను దూరం చేసుకోవచ్చు.
రోజూ రాగి పాత్రల్ని ఉపయోగించడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసుకున్నారుగా! కేవలం నీటిని నిల్వ చేసుకోవడానికి మాత్రమే కాకుండా వండుకోవడానికి, తినడానికీ వీటిని ఉపయోగించడం మంచిది. ఇంకెందుకాలస్యం.. వెంటనే రాగి పాత్రల్ని మీ డిన్నర్ సెట్‌లో భాగం చేసేయండి.