Cool Drinks Side Effects : చూడడానికి రకరకాల రంగుల్లో, చల్లగా ఉంటాయి కూల్ డ్రింక్స్. ఇటీవల కాలంలో వీటిని తాగే వారి సంఖ్య విపరీతంగా పెరిగింది. స్నేహితులను కలిసినప్పుడు, రెస్టారెంట్‌కు వెళ్లినప్పుడు ఇలా.. సందర్భం ఏదైనా కూల్ డ్రింక్స్‌ను తాగుతున్నారు. వేసవి వస్తే.. ఇంకా ఎక్కువగా శీతల పానీయాలు సేవిస్తున్నారు. కానీ.. కూల్‌డ్రింక్స్‌ను అదే పనిగా తాగడం వల్ల లేనిపోని రోగాల్ని కొని తెచ్చుకున్నట్లే అని వైద్యులు చెబుతున్నారు. అతిగా కూల్ డ్రింక్స్ తాగడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయని హెచ్చరిస్తున్నారు.
కూల్ డ్రింక్స్ అధికంగా తీసుకోవడం వల్ల అందులో ఉండే రసాయనాలు.. లివర్‌ను దెబ్బతీస్తాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అంతే కాకుండా మధుమేహంతో పాటు గుండె జబ్బులు కూడా వచ్చే అవకాశముందని పలువురు అంటున్నారు. సాఫ్ట్ డ్రింక్ నుంచి డైట్ సోడా వరకు ఇలా ఏ శీతల పానీయాన్ని తీసుకున్నా.. వాటి తయారీలో వాడే చక్కెరతో పాటు ఇతర రసాయనాలు మన ఆరోగ్యానికి చేటు చేస్తాయని వివరిస్తున్నారు. 'అధికంగా కూల్ డ్రింక్స్ తాగే వారిలో విపరీతంగా క్యాలరీలు పెరిగిపోతాయి. ఫలితంగా బరువు పెరిగే అవకాశం ఉంది. ఆహారం తక్కువ తీసుకుని వీటిని అధికంగా సేవించే వారికి స్థూలకాయం తప్పని సరిగా వస్తుంది. శీతల పానియాల్లో అధికంగా షుగర్ కంటెంట్ ఉంటుంది. ఇది చాలా ప్రమాదకరం. కాబట్టి శీతల పానీయాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది' అని నిపుణులు చెబుతున్నారు.
దుష్పరిణామాలు ఇవే!
సాధారణంగా 250 -300 మిల్లీ లీటర్ల కూల్ డ్రింక్‌లో 150-200 క్యాలరీలు ఉంటాయి. కూల్ డ్రింక్‌లో అధిక ఫ్రక్టోజ్ ఉంటుంది. దీని వల్ల బరువు పెరిగే అవకాశం ఉంది. ఫలితంగా డయాబెటిస్, బీపీ, గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది. రోజూ కూల్ డ్రింక్స్ తాగే వారిలో అందులో ఉన్న ఫాస్పరిక్ యాసిడ్ వల్ల జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది. తిన్న ఆహారం జీర్ణం కావడానికి ఉపయోగపడే కాంపనెంట్ హైడ్రాలిక్ యాసిడ్ ఉపయోగపడుతుంది. ఇది మన పొట్టలోనే ఉత్పత్తి అవుతుంది. కూలా డ్రింక్స్ తాగినప్పుడు అందులో ఉండే రసాయనం ఈ యాసిడ్‌తో కలిసినప్పుడు జీవక్రియల మీద విపరీతమైన ప్రభావం పడుతుంది.
డీహైడ్రేషన్ తప్పించుకోవడానికి సైతం అనేక మంది కూల్‌డ్రింక్స్‌ను తాగుతారు. కానీ అందులోని కెఫిన్, చక్కెరలు మరింత డీహైడ్రేషన్‌కు దారితీస్తాయి. కెఫిన్ వల్ల అధిక రక్తపోటు, తరచూ మూత్ర విసర్జనకు వెళ్లాల్సి రావటం వంటి దుష్ప్రభావాలు ఉంటాయి. అంతేకాకుండా ఆ రసాయనాలు ఎముకల బలహీనతకు దారితీస్తాయి. షుగర్ కంటెంట్ ఉండటం వల్ల దంత సమస్యలూ వస్తాయి. చిగుళ్లు వదులై.. దంతాలు ఊడిపోయే ప్రమాదముంది.
కూల్‌డ్రింక్స్‌లోని అధిక ఫ్రక్టోజ్ వల్ల బ్రెయిన్లోని హిప్పోక్యాంపస్ పరిమాణం తగ్గిపోతుంది. ఫలితంగా మతిమరుపు వచ్చే అవకాశం ఉంది. అతిగా కూల్ డ్రింక్స్ తాగే పురుషులకు గుండె జబ్బులు వచ్చే అవకాశం 20 శాతం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఈ పానీయాలు కేవలం బరువు పెంచుతాయే తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదని పలు అధ్యయనాల్లో తేలింది. కాబట్టి.. ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఈ పానీయాలకు బదులు... ఖర్బుజ, పుచ్చకాయ, ఇతర పండ్ల రసాలు, చెరుకు రసం తీసుకోవాలి. దాహమేస్తే సాధ్యమైనంత వరకు మంచినీరు తాగాలి. అప్పుడప్పుడు శీతల పానియాలు తాగితే ఏం కాదు కానీ.. అదే పనిగా తాగితే మాత్రం ఆసుపత్రి పాలవ్వడం తప్పదు.