ఒత్తిడిలో ఉన్నప్పుడు అడ్రినల్ గ్రంథులు ఎపినెఫ్రిన్ అనే హార్మోన్ ను విడుదల చేస్తాయి. ఇది గుండె, ఊపిరితిత్తులు, మెదడు వంటి కీలక అవయవాలకు రక్త ప్రసరణ ఎక్కువయ్యేలా చేస్తుంది. ఫలితంగా పేగుల్లో రక్త ప్రవాహం తగ్గి, కదలికలు మందగిస్తాయి.
ఇది మలబద్దకానికి దారితీస్తుంది. మరోవైపు కార్టికోట్రోపిన్ విడుదలకు కారణమయ్యే హార్మోన్ పేగుల్లోకి చేరుకుంటుంది. దీంతో పేగుల కదలికలు మందగించటమే కాదు, లోపల వాపు ప్రక్రియ (ఇన్ఫ్లమేషన్) కూడా మొదలవుతుంది. ఒత్తిడి మూలంగా పేగుల్లో ఇతర పదార్థాలు ప్రవేశించకుండా అడ్డుకునే సామర్థ్యమూ తగ్గుతుంది.
ఇది లోపలికి వాపు కారకాలు చేరటానికి వీలు కల్పిస్తుంది. ఫలితంగా కడుపు ఎప్పుడూ నిండుగా ఉన్నట్టు అనిపిస్తుంది. మంచి బ్యాక్టీరియా అస్తవ్యస్తమవుతుంది. ఇది జీర్ణశక్తి తగ్గటానికి దోహదం చేస్తుంది. కాబట్టి మలబద్ధకం సతమతమయ్యేవారు ఒకసారి ఒత్తిడితో బాధపడుతున్నారా? అనేది చూసుకోవటం మంచిది. ఒత్తిడిని తగ్గించుకోవడంతో పాటు కొన్ని జాగ్రత్తలతో మలబద్ధకాన్ని దూరం చేసుకోవచ్చు.
మెగ్నీషియం మేలు
ఒత్తిడితో కూడిన మలబద్ధకాన్ని తగ్గించటంలో మెగ్నీషియం కీలక పాత్ర పోషిస్తుంది. మనలో 80% మంది తగినంత మెగ్నీషియం తీసుకోవటం లేదని అంచనా. దీనికి తోడు ఒత్తిడి మూలంగా మూత్రం ద్వారా మెగ్నీషియం బయటకు వెళ్లిపోతుంటుంది.
మెగ్నీషియం తగ్గితే ఒత్తిడి మరింత ఎక్కువవుతుంది కూడా అంటే ఇదొక విష వలయంలా తయారవుతుందన్నమాట. మెగ్నీషియం లోపంతో తలనొప్పి, ఆందోళన, కుంగుబాటు వంటి ఒత్తిడి లక్షణాలూ ఉదృతమవుతాయి. అందువల్ల ఆహారంలో తగినంత మెగ్నీషియం ఉండేలా చూసుకోవాలి.
ఇది పేగు లో నీరు చేరుకునేలా చేసి మలాన్ని మెత్తబరుస్తుంది. పేగులు సంకోచించటమూ మెరుగవుతుంది. అవసరమైతే మెగ్నీషియం మాత్రలు వేసుకోవచ్చు. ముందుగా రోజుకు 300 మి.గ్రా.లతో ఆరంభించి ఫలితం కనిపించకపోతే మి.గ్రా. వరకు పెంచుకోవచ్చు. మోతాదు మరీ ఎక్కువైతే నీళ్ల విరేచనాలు కావొచ్చు. కాబట్టి మితిమీరకుండా చూసుకోవటం మంచిది.
ఒత్తిడిని తగ్గించుకోవాలి
ఒత్తిడిని తగ్గించుకునేందుకు ప్రయత్నించాలి. ఇందుకు నిపుణులతో కౌన్సెలింగ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
- నమ్మకమైన మిత్రులతో మనసులోని భావాలను పంచుకోవటం మేలు చేస్తుంది. బాధలను ఇతరులకు చెప్పుకోవటం, స్నేహితుల మంచి మాటల వల్ల భావోద్వేగాలు అదుపులో ఉంటాయి. బిగుసుకున్న కండరాలు వదులవుతాయి.
- వ్యాయామం, శారీరక శ్రమ వంటివి మానసిక ప్రశాంతతకు తోడ్పడతాయి. కాసేపు తోటలో నడిచినా చాలు మనసు కుదుటపడుతుంది. యోగా, ధ్యానం వంటివి ఒత్తిడిని తగ్గిస్తాయి. ఇవి ఆధ్యాత్మిక భావనలు పెంపొందటానికి తోడ్పడతాయి. దీంతో ఒంట్లోని మలినాలు బయటకు వెళ్లిపోయే ప్రక్రియా పుంజుకుంటుంది.
- కంటినిండా నిద్రపోవటమూ ముఖ్యమే. నిద్రలేమి మలబద్ధకానికి దారితీస్తుంది. ఒత్తిడిలో ఉన్నప్పుడు నిద్ర పట్టటమూ కష్టమైపోతుంది. మెగ్నీషియం మాత్రలతో నిద్ర కూడా బాగా పడుతుంది. కంటి నిండా నిద్రపోవటం వల్ల మర్నాడు విరేచనం సాఫీగా అవుతుంది. అంతేకాదు, నాడీ వ్యవస్థ నియంత్రణలో ఉండటం వల్ల ఆందోళన, భయమూ తగ్గుతాయి.
ఇవీ చూడండి: 10 గ్రేడ్లపై ముమ్మర కసరత్తు .. విద్యార్థుల్లో టెన్షన్ టెన్షన్