Causes Belly Fat : అప్పటి దాకా సాధారణంగా కనిపించిన వ్యక్తులు అతి తక్కువ కాలంలోనే పొట్ట చుట్టూ కొవ్వుతో కనిపించడం మనం తరుచూ గమనిస్తుంటాం. అధిక బరువు పెరిగే వారిలో ఇలాంటి సమస్యలు సాధారణంగా తలెత్తుతుంటాయి. అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను తీసుకోవడం, బేకరీ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్‌ను తీసుకునే వారిలో ఇలాంటి సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి.
నడుము చుట్టూ కొవ్వు చేరడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు ఏర్పడటమే కాకుండా అందం కూడా చెడిపోతుంది. ఫలితంగా చాలామందిలో ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతోంది. అనేక మానసిక సమస్యలకు కారణమవుతోంది. పొట్ట కొవ్వు వల్ల గుండెపోటు, మధుమేహం, కొన్ని రకాల క్యాన్సర్లు, జీర్ణాశయ సమస్యలు తలెత్తుతాయి. కొంతమందిలో బరువు పెరగకుండా కేవలం పొట్ట చుట్టూ కొవ్వు పెరుగుతుండటం గమనించవచ్చు. ఇది మరింత ప్రమాదకరం అని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
"పొట్ట చుట్టూ కొవ్వు పెరగడాన్ని వైద్య పరంగా బెల్లీ ఆఫ్ సెంట్రల్ ఒబెసిటీ అని అంటారు. సాధారణంగా జన్యు పరంగానే మనకు పొట్ట చుట్టూ కొవ్వు పెరిగే లక్షణం ఉంటుంది. అయితే పొట్ట చుట్టూ కొవ్వు ఎక్కువ పెరగడం వల్ల బాడీ మాస్ ఇండెక్స్ 30 లేదా అంతకంటే ఎక్కువగా నమోదవుతుంది. ఇలా పొట్ట చుట్టూ చేరిన కొవ్వు వల్ల ఊపిరితిత్తులకు శ్వాసించే శక్తిని తగ్గిస్తాయి. ఫలితంగా గుండె మీద దీని ప్రభావం పడుతుంది. దీంతో హార్ట్ ఫెయిల్యూర్ లాంటి స్థితి ఏర్పడుతుంది. అలాగే డయాబెటిస్, హైపర్ టెన్షన్లకు ఇది దారితీస్తుంది. పొట్ట చుట్టూ కొవ్వు పెరగకుండా నియంత్రించుకోవాలి. ఇందుకోసం ఫాస్ట్ ఫుడ్, అధిక కొవ్వులు కలిగిన ఆహారాలకు దూరంగా ఉండాలి. 10-12 గంటలు ఆహారం తీసుకొని, మరో 10-12గంటలు ఆహారానికి దూరంగా ఉండాలి. శరీరానికి తగిన విధంగా వ్యాయామం చేయడం వల్ల కూడా పొట్ట చుట్టూ కొవ్వును తగ్గించుకోవచ్చు. పొట్ట చుట్టూ కొవ్వు చేరిన వాళ్లు ప్రతి ఆరు నెలలకు ఒకసారి కొలెస్ట్రాల్, బీపీ, షుగర్, థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవాలి."
- డా. శ్రావణి రెడ్డి కరుమూరి, జనరల్ ఫిజీషియన్
మన శరీరంలో రెండు రకాల కొవ్వులు ఉంటాయని, వాటిలో విసరల్ ఫ్యాట్ అనే కొవ్వు రకం ఎంతో ప్రమాదకరం అని వైద్యులు చెబుతున్నారు. పొట్ట చుట్టూ కొవ్వు చేరే వారిలో విసరల్ కొవ్వులే అధికంగా ఉంటాయని, వీటిని నియంత్రించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గుండె జబ్బులకు, ఆల్జీమర్స్, టైప్ 2 డయాబెటిస్, ప్రీడయాబెటిస్, రక్తపోటు లాంటి అనేక అనారోగ్య సమస్యలకు కారణమయ్యే విసరల్ ఫ్యాట్ అనే కొవ్వులను తగ్గించుకోవడానికి వ్యాయామం చేయాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. వ్యక్తుల ఎత్తు, బరువును బట్టి వ్యాయామాలు చేయడం, శ్వాస వ్యాయామాలు చేయడం, 3కిలోమీటర్లు వాకింగ్ చేయడం, ఆహారంలో ఉప్పును తగ్గించడం, తగినంత నిద్రపోవడం ఎంతో ముఖ్యం అని నిపుణులు చెబుతున్నారు.
ఇవీ చదవండి : స్థూలకాయ సమస్య మిమ్మల్ని వేధిస్తుందా?.. కారణాలివే!
సడెన్‌గా బరువు తగ్గిపోతున్నారా? షుగర్ ఉన్నవారిలో ప్రోటీన్ లాస్‌కు కారణం అదే!