సుదీర్ఘ కాలం జీవించిన వారి పేర్లను పరిశీలిస్తే జన్నీ క్లెమెంట్ అనే ఫ్రెంచ్ మహిళ 122 ఏళ్లు జీవించినట్టుగా తెలుస్తోంది. ఈమె 1875లో జన్మించింది. ఆ రోజుల్లో సగటు జీవన ప్రమాణం 43 సంవత్సరాలు మాత్రమే.
మనిషి గరిష్ఠంగా ఎన్ని ఏళ్లు జీవించగలడు అనే ప్రశ్న అనాదిగా ఉంది. సగటు మానవ ఆయుష్షును లెక్కగట్టవచ్చు కానీ మనిషి గరిష్ఠ ఆయుష్షును లెక్కగట్టటం కష్టం. గతంలో జరిగిన కొన్ని అధ్యయనాల ప్రకారం మనిషి 140 ఏళ్లు జీవించవచ్చని తెలిసినా, ఈ మధ్య జరిగిన పరిశోధన ప్రకారం 150 ఏళ్లకు పెరిగింది.
జీవన ప్రమాణాన్ని లెక్కగట్టటం ఎలా?
మనిషి జీవన ప్రమాణాన్ని లెక్కించటానికి వాడుకలో ఉన్న పద్ధతి గోంపెట్జ్ సమీకరణ. 19వ శతాబ్దంలో మొదటిసారిగా ఈ పద్ధతిలో సగటు ఆయుష్షును లెక్కగట్టారు. నేడు క్యాన్సర్, గుండె జబ్బులు, ఇతర ఇన్ఫెక్షన్స్ వల్ల చావుకు దగ్గరయ్యే అవకాశాలు 8 నుంచి 9 ఏళ్లలోనే 2 రెట్లవుతున్నాయి. గోంపెట్జ్ సమీకరణాన్ని అనేక విధాలుగా లెక్కగట్టి మనిషి ఆయుష్షును తెలుసుకోవచ్చు. ఆరోగ్య బీమా కంతులు లెక్కవేయడానికి దీన్ని వాడతారు. బీమా కంపేనీలు వ్యక్తి అలవాట్లను ముఖ్యంగా ధూమపానం, వైవాహిక జీవితం మొదలైన విషయాలను తెలుసుకొని బీమాను అంచనా వేస్తారు.
వయసు పెరిగే కొద్దీ శరీరంలోని అవయవాలు పనిచేయటంలో విఫలమవుతూ వస్తాయి. అవయవాల ఆరోగ్యాన్ని అనుసరించి ఆయుష్షును లెక్కగట్టవచ్చు. ఉదాహరణకు వ్యాయామం చేసేటపుడు లేదా ఏదైనా పనిలో ఉన్నపుడు ఎంత ఆక్సిజన్‌ను మనం పీల్చుకుంటున్నామో పరిశీలిస్తే యవ్వనంలో కన్నా పెరుగుతున్న వయసులో ఇది తగ్గుతుంది. ఒక సగటు మనిషి శరీరంలో ఉన్న అవయవాలు 120 ఏళ్లు పనిచేస్తాయి. ఇది అందరిలోనూ ఒకేలా ఉండకపోవచ్చు. కొందరిలో మూత్రపిండాలు త్వరగా పాడవుతాయి.
ఆశ్చర్యకరంగా సింగపూర్, రష్యా, అమెరికా దేశాల్లోని పరిశోధకులు కొత్త పద్ధతిలో మనిషి సగటు ఆయుష్షును లెక్కగట్టారు. ఒక కంప్యూటర్ నమూనా ఆధారంగా ఇది 150 సంవత్సరాలుగా తేలింది.
150 ఏళ్లు జీవించడమెలా?
సహజంగానే మనం ఎంత త్వరగా ఒక జబ్బు నుంచి కోలుకుంటామో అంత సుదీర్ఘకాలం జీవించటానికి అవకాశం ఉంటుంది. శరీర ఆరోగ్యానికి ఇది ఒక కొలత. వయసు పెరిగే కొద్దీ ఈ శక్తి తగ్గిపోవచ్చు. యవ్వన దశలో ఎటువంటి జబ్బు నుంచైనా త్వరగా కోలుకుంటారు. వయసు పెరిగే కొద్దీ ఇది సన్నగిల్లుతుంది. వైద్య రంగంలో సాధించిన ప్రగతి ప్రస్తుతం వృద్దాప్యంలో ఉన్న వారికి ఎక్కువ ఉపయోగపడకపోవచ్చుని తెలుస్తోంది. సాధారణ జబ్బులకు ఆధునిక చికిత్సా పద్ధతులను వారు వినియోగించుకోలేరు. ఉదాహరణకు ఈ రోజుల్లో జన్మించిన శిశువు 85 ఏళ్ల వరకు జీవించటానికి కావలసిన వైద్య పురోగతి నేడు అందుబాటులో ఉంది. కానీ నేడు 85 ఏళ్ల వయసున్న వ్యక్తి ఇప్పుడు అందుబాటులో ఉండే వైద్య సాంకేతికత అంతగా ఉపయోగపడదు.
ఈ మధ్య జరిగిన పరిశోధన ప్రకారం 3 ప్రధానమైన అంశాలు ఆయుష్షును నిర్ధరిస్తాయి. మొదటిది జన్యువులు. వీటి ప్రకారం 100 ఏళ్లు జీవించటానికి అవకాశం ఉంది. రెండవది మంచి ఆహరం, వ్యాయామం. ఈ రెండిటి వల్ల మరో 15 ఏళ్లు అదనంగా జీవించవచ్చు. మూడవది ఔషధ పరిశోధన లోనూ, వైద్య చికిత్సలోనూ సాధించిన పురోగతి. ప్రస్తుతం సగటు మనిషి ఆయుర్ధాయాన్ని 15 నుంచి 20 శాతం పెంచటం చాలా కష్టం. ఆయుష్షును నిర్ధరించే అంశాలు ఇంకా పూర్తిగా అర్ధం కాలేదు. నేడు జరుగుతున్న పరిశోధన ఇదే వేగంతో పురోగమిస్తే భవిష్యత్తులో మనిషి మరింత కాలం జీవించే అవకాశం కలుగుతుంది.